శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

జో బైడెన్‌కు జై కొట్టలేం.. ఎందుకంటే.. ఆయన ఎన్నికను గుర్తించం : పుతిన్

అమెరికా దేశానికి 46వ అధ్యక్షుడుగా ఎన్నికైన జో బెడైన్‌కు జై కొట్టలేమని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎందుకంటే.. ఆయన ఎన్నికను తాము గుర్తించడం లేదని చెప్పుకొచ్చారు. 
 
నిజానికి ఈ అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయభేరీ మోగించారు. సుస్పష్టమైన మెజారిటీ సాధించిన జో బైడెన్‌కు ప్రపంచదేశాలు శుభాకాంక్షలు పలుకుతున్నాయి. కానీ, చైనా, రష్యా వంటి కొన్నిదేశాలు వేచిచూసే ధోరణి అవలంబించాయి. చైనా ఇటీవలే బైడెన్ విజయాన్ని గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఇపుడు రష్యా స్పందించింది. ఎవరి నాయకత్వంలోనైనా సరే అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రస్తుతం బైడెన్ విజయాన్ని గుర్తించలేమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేటతెల్లం చేశారు. 
 
బైడెన్ గెలిచాడన్న విషయాన్ని అమెరికాలో చట్టబద్ధంగా ప్రకటించాల్సి ఉందని, బైడెన్ విజేత అని ఆయన ప్రత్యర్థి పక్షం కూడా గుర్తించాల్సి ఉందని పుతిన్ అభిప్రాయపడ్డారు. అంతేతప్ప, బైడెన్‌ను అభినందించకపోవడం వెనుక ఎలాంటి వ్యూహాత్మక విధానం లేదని అన్నారు.
 
కాగా, బైడెన్ గెలుపు పట్ల రష్యా స్పందించకపోవడం వల్ల ఇరు దేశాల సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, 'కొత్తగా దెబ్బతినడానికి ఏముంది? రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడో క్షీణించాయి' అని జవాబిచ్చారు.