అర్జెంటీనా: చిన్నారులపై అత్యాచారం ... క్రైస్తవ మతాధికారులకు 40 ఏళ్ల జైలు శిక్ష

Argentina
ఠాగూర్| Last Updated: బుధవారం, 27 నవంబరు 2019 (16:16 IST)
అర్జెంటీనాలోని ఒక చర్చి స్కూలులో వినికిడి లోపం ఉన్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు రోమన్ క్యాథలిక్ మతాధికారులకు అక్కడి కోర్టు 40 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.
 
మెండోజా ప్రావిన్స్‌లోని ఒక చర్చి స్కూలులో 2004 నుంచి 2006 మధ్య వినికిడి లోపం గల కొందరు చిన్నారులపై హొరాసియో కొర్బాచో, నికోలా కొరాడీ అనే ఇద్దరు మతాధికారులు అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతోవారికి జైలు శిక్ష విధించారు.
 
పోప్ ఫ్రాన్సిస్ సొంత దేశమైన అర్జెంటీనాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ కేసు విషయంలో చర్చి చాలా నెమ్మదిగా స్పందించిందన్న ఆరోపణలున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ చర్చిల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెరుగుతున్నాయి.
 
కోర్టు ఏం చెప్పింది? 
మెండోజాలోని అంటోనియో ప్రొవోలో ఇనిస్టిట్యూట్‌కు చెందిన చిన్నారులపై 59 ఏళ్ల కొర్బాచా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువవడంతో ఆయనకు 45 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆరోపణలు ఎదుర్కొన్న మరో మతాధికారి 83 ఏళ్ల కొరాడీ(ఇటలీ దేశస్థుడు)కి 42 ఏళ్ల జైలు శిక్ష వేశారు.
 
ఇటలీలోని వెరోనాలో ఉన్న ఒక చర్చి స్కూలులో 1970 ప్రాంతంలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నా గతంలో ఎన్నడూ అభియోగాలు నమోదు కాలేదు. లూజన్ డి కుయో స్కూల్ గార్డనర్ అర్మాండో గోమెజ్‌కి 18 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలపై అప్పీలు చేసుకోవడానికి కోర్టు అవకాశం కల్పించలేదు.
 
తీర్పు వచ్చాక ఏం జరిగింది? 
జైలు శిక్షలు విధించిన తరువాత నిందితులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ, తీర్పు సమయంలో కోర్టులో ఉన్న కొందరు బాధిత పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఏడుస్తూ ఒకరినొకరు పట్టుకోవడం కనిపించింది. కోర్టు వెలుపల కొందరు యువత తీర్పుపై హర్షం వ్యక్తంచేయడం కనిపించింది.
 
''ఇది మాకు, ప్రపంచానికి ఎంత ముఖ్యమైన తీర్పో మీకు తెలియదు'' అని ఓ బాధితురాలి తండ్రి ఏరియల్ లిజారగా 'వాషింగ్టన్ పోస్ట్'తో అన్నారు. 'చర్చి ఈ వేధింపులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మతాధికారులు మా పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డారు, వేధించారు'' అన్నారాయన.

దీనిపై మరింత చదవండి :