శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 14 మే 2021 (11:53 IST)

అస్సాం: పిడుగులు పడి 18 ఏనుగులు మృతి

అస్సాంలోని నాగావ్ జిల్లాలో 18 ఏనుగులు మృతి చెందాయి. కండోలీ అభయారణ్యంలో పిడుగులు పడడంతో ఆ ఏనుగుల మంద ప్రాణాలు కోల్పోయిందని అక్కడి అటవీ అధికారులు వెల్లడించారు. అభయారణ్యం సమీపంలోని గ్రామస్థులకు అడవిలో ఏనుగుల కళేబరాలు పెద్దసంఖ్యలో కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ''పెద్ద సంఖ్యలో ఏనుగులు మృత్యువాత పడడం కలచివేసింది. దీనిపై విచారణకు ఆదేశించాను'' అని ఆయన చెప్పారు. భారత్‌లో 27 వేలకు పైగా ఏనుగులు ఉండగా అందులో 21 శాతం ఒక్క అస్సాం రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకేసారి ఇంత పెద్దసంఖ్యలో ఏనుగులు చనిపోవడం అస్సాంలో గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి.

 
ఏనుగుల మరణంపై అస్సాం అటవీ మంత్రి పరిమళ్ శుక్లవైద్య కూడా స్పందించారు. కథియాటోలీ రేంజ్ అటవీ ప్రాంతంలో భారీగా పిడుగులు పడి 18 ఏనుగులు మరణించడం బాధాకరం అంటూ ఆయన స్పందించారు. అటవీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరుపుతారని ఆయన చెప్పారు.