సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 19 ఆగస్టు 2024 (17:23 IST)

బ్లూ సూపర్ మూన్: ఈ రోజు రాత్రి చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడా?

Moon
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ రాత్రి ఆకాశంలో ‘బ్లూ సూపర్ మూన్’ కనిపించనుంది. భారతదేశంలో ఈరోజు(ఆగస్ట్ 19) రాత్రి నుంచి ఆగస్ట్ 20 వేకువజాము వరకు బ్లూ సూపర్ మూన్ కనిపిస్తుంది. స్థూలంగా సూపర్‌మూన్ అంటే పౌర్ణమి రోజున చంద్రుడు సాధారణంగా కనిపించే పరిమాణం కంటే ఇంకా పెద్దగా కనిపించడం. సాధారణ సమయాల్లో కనిపించే చంద్రుడి కంటే సూపర్ మూన్ 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా, కనీసం 14 శాతం పెద్దదిగా కనిపిస్తుంది.
 
సూపర్ మూన్ అని ఎందుకు అంటారు
భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు చంద్రుడిని ‘సూపర్ మూన్’ అని పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే 14 శాతం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సూపర్ మూన్‌నే పెరీజీ మూన్‌ అని కూడా పిలుస్తారు. భూమి చుట్టూ చంద్రుడు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటాడు. ఈ కక్ష్యలో భూమికి చేరువగా ఉండే పాయింట్‌ను పెరీజీ అంటారు. దూరంగా ఉండే పాయింట్‌ను అపోజీ అంటారు. భూమికి 3,60,000 కిలోమీటర్లు, అంతకంటే తక్కువ దూరంలోకి వచ్చినప్పుడు చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. భూమికి సమీపంగా వస్తుంది కాబట్టి మూన్ అప్పుడు పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
 
బ్లూ మూన్ అంటే
ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తే రెండోదాన్ని బ్లూ మూన్ అంటారు. అలాగే ఒక సీజన్‌లో నాలుగు సార్లు పౌర్ణమి వస్తే అప్పుడు మూడో పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. ఇక్కడ సీజన్ అంటే యూరప్, ఉత్తర అమెరికా దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కొన్ని ఆఫ్రికా దేశాలలో పాటించే స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అనే నాలుగు సీజన్లు. సాధారణంగా ఒక సీజన్‌లో మూడు పౌర్ణమిలు ఏర్పడతాయి. కానీ, అప్పుడప్పుడూ ఒకే సీజన్‌లో నాలుగు పౌర్ణమిలు వస్తాయి. అలాంటప్పుడు ఆ సీజన్‌లోని మూడో పౌర్ణమిని బ్లూమూన్ అని పిలుస్తారు. ఇప్పుడు ఏర్పడుతున్నది ఇలా ఈ సీజన్‌లో వస్తున్న నాలుగు పౌర్ణమిల్లో మూడోది.
 
బ్లూ సూపర్ మూన్ అంటే..
ఆగస్ట్ 19 రాత్రి కనిపిస్తున్న చంద్రుడు భూమికి సమీపంగా వస్తున్నందున సూపర్ మూన్.. దాంతోపాటు పాశ్చాత్య దేశాల సీజన్ల లెక్కల్లో ఒకే సీజన్లో వస్తున్న నాలుగు పౌర్ణమిలలో మూడో పౌర్ణమి నాటి చంద్రుడు కావడంతో బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. ఈ రెండూ ఒకే రోజు వస్తుండడంతో ఆగస్ట్ 19 రాత్రి కనిపించే చంద్రుడిని బ్లూ సూపర్ మూన్ అని పిలుస్తున్నారు. ఇది ఖగోళశాస్త్రం పరంగా కొంత అరుదైన సందర్భం.
 
బ్లూ మూన్ నీలంగా ఉంటుందా?
బ్లూ మూన్ అంటే ఆ రోజు చంద్రుడు నీలం రంగులో ఏమీ కనిపించడు. సాధారణ రోజుల్లో కంటే ప్రకాశవంతంగా మాత్రమే కనిపిస్తాడు. ఎప్పుడైనా వాతావరణంలోని కొన్ని రకాల ధూళి రేణువులు కాంతిలోని ఎర్రని తరంగదైర్ఘ్యాలను చెదరగొడితే అలాంటి సందర్భాలలో చంద్రుడు కొంత నీలంగా కనిపించొచ్చు అని ‘నాసా’ చెప్తోంది. కానీ, అది ఎప్పుడైనా జరగొచ్చు.