వినేశ్ ఫొగాట్ పెదనాన్న కూతురు గీతా ఫొగాట్ 2003 మేలో ఏషియన్ కాడెట్ చాంపియన్ షిప్‌లో బంగారు పతకం గెలిచింది. ఇది మహావీర్ ఫొగాట్ ట్రైనింగ్ సెంటర్‌కు దక్కిన తొలి అంతర్జాతీయ విజయం. దీంతో హరియాణాలోని బలాలీ గ్రామం మొత్తం విజయోత్సవం జరుపుకుంది. ఆ సమయంలో మహావీర్ తమ్ముడు రాజ్‌పాల్ కూడా తన కూతురికి అటువంటి అపూర్వ స్వాగతాన్నే కోరుకున్నారు. అప్పుడు వినేశ్ వయసు ఎనిమిదేళ్లు. 21 ఏళ్ల తరువాత వినేశ్ ఇప్పుడు భారతీయ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారు. పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగివచ్చినప్పుడు ఆమెకు ఘనస్వాగతం లభించింది.
న్యూదిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాళ్ల ఊరు బలాలీ వరకూ 120 కిలోమీటర్ల పొడువునా వేలమంది అభిమానులు బారులుతీరి వినేశ్‌కు స్వాగతం పలికారు. హరియాణాలో ఏ ఆటగాళ్లకూ, ఒలింపిక్ విజేతలకు కూడా ఎప్పుడూ ఈ స్థాయిలో అభిమానులు పోటెత్తలేదు. ఈరోజు రాజ్‌పాల్ జీవించి ఉంటే తన కల నెరవేరినందుకు చాలా సంతోషించి ఉండేవారు. వినేశ్ ఫొగాట్ భారత్ గర్వపడేలా చేసిన ప్రతిసారీ ఆ క్రెడిట్ ఆమె తండ్రికే ఇవ్వాలి. తన కూతుళ్ల జీవితం గొప్పగా ఉండాలని ఆయన కలగన్నారు. అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా తల్లి ప్రేమ్‌లత, కోచ్‌గా మారిన పెదనాన్న మహావీర్‌లు వినేశ్ తండ్రి రాజ్‌పాల్ కలను సజీవంగా ఉంచారు.
వీరందరూ కలిసి ప్రతి మలుపులో ఆటంకాలను అధిగమించిన ఓ చాంపియన్‌ను తయారు చేశారు. 2003 అక్టోబర్ 25 రాత్రి రాజ్‌పాల్ మరణించారు. అప్పటి నుంచి బలాలీ గ్రామం తరచూ వినేశ్ సహా ఫొగాట్ సిస్టర్స్‌ను ఆదరిస్తూనే ఉంది. కానీ ఈసారి దేశం మొత్తం ఆమె సాధించిన విజయాన్ని ఉత్సవంలా జరుపుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో మూడు బౌట్లలోనూ విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టిన వినేశ్ ఫొగాట్, ఫైనల్‌కు ముందు కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉందని అనర్హతకు గురయ్యారు. వినేశ్ కేవలం బలాలీ గ్రామపు బిడ్డ మాత్రమే కాదు, ఈ దేశపు బిడ్డ అని 2012లో లండన్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పోటీపడిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ గీతా ఫొగాట్ అన్నారు.
నాన్నకు ప్రేమతో..
నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. నేనొక రెజ్లింగ్ చాంపియన్ కావాలని ఆయన కోరుకునేవారు. ఏషియన్ క్యాడెట్ టైటిల్ గెలిచిన గీతకు గ్రామంలో అపూర్వ స్వాగతం లభించినప్పుడు, నాకు కూడా అలాంటి గౌరవం దక్కాలని నాన్న కోరుకున్నారు. నేనూ, ప్రియాంక, రీతూతో కలిసి 2009 ఆసియన్ క్యాడెట్ చాంపియన్ షిప్‌లో బంగారుపతకం గెలిచినప్పుడు మా గ్రామంలో అపూర్వస్వాగతం లభించింది. ఆ సమయంలో నాకు మా నాన్న కోరిక గుర్తుంది. ఆయన ఎక్కడున్నా నేను బావుండాలని కోరుకుంటారు. నా ప్రతి విజయంలోనూ ఆయనను తలుచుకుంటాను అని మహావీర్ ఫొగాట్‌పై రాసిన పుస్తకం కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో వినేశ్ చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఆటతీరు ప్రశంసనీయం. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్‌లో తలపడలేకపోయింది. నావరకూ ఆమె ఎప్పుడూ చాంపియనే అని మహావీర్ చెప్పారు. పురుషాధిపత్యం ఉండే రెజ్లింగ్‌కు ఆడపిల్లలను పరిచయం చేసినప్పుడు తన కుటుంబంలో ఓ ఒలింపిక్ చాంపియన్ ఉండాలని మహావీర్ భావించేవారు. మహవీర్ లానే రాజ్‌పాల్ కూడా తన కుమార్తెల విషయంలో అభ్యుదయ ఆలోచనలతో ఉండేవారు. ఆయన ఎప్పుడూ తన కొడుకులను, కూతుళ్లను వేరువేరుగా చూడలేదు. ఇంటి పనులు చేయమని అమ్మ మమ్మల్ని అడిగినప్పుడల్లా ఆయన మా సోదరుడు హర్వీందర్‌ను తిట్టేవారు. వేరే ఏ పనులు లేకుండా మా దృష్టి అంతా రెజ్లింగ్‌పైనే ఉండాలని స్పష్టంగా చెప్పేవారు. మా అమ్మకు ఏదైనా సాయం కావాల్సి వస్తే ఆమె మమ్మల్ని కాకుండా మా సోదరుడు హర్వీందర్‌ను అడిగేవారు. అని వినేశ్ చెప్పారు.
బడిలో ఎప్పుడూ అమ్మాయిలతోనే కాదు, అబ్బాయిలతోనూ పోట్లాడేదానిని. మా బామ్మ తగవులు పెట్టుకోవద్దని మాకు చెబుతుండేది. కానీ ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేం వారిని ఎదిరించేవాళ్లం. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే.. ఏడిపించడానికి నేనెవరికీ అవకాశమివ్వలేదు. నా కూతుళ్లు అబ్బాయిలకు తక్కువేం కాదని మా నాన్న గర్వపడుతుండేవారు. ఆయన చనిపోయిన తరువాత తౌజీ (పెదనాన్న) మా నాన్నలానే పెంచారు. మా నాన్న లేని లోటును ఆయన ఏనాడూ తెలియనివ్వలేదు. అని వినేశ్ గుర్తు చేసుకున్నారు.
వినేశ్ తండ్రిపై కాల్పులు
వినేశ్ తండ్రి అక్టోబర్ 25, 2003లో దీపావళికి ఒక వారం ముందు, కర్వా చౌత్ పండుగరోజున చనిపోయారు. వినేశ్ తల్లి ప్రేమ్‌లత తన భర్త రాజ్‌పాల్ క్షేమం కోసం ప్రార్థించేవారు. కానీ ఆయన ఎప్పటికీ తిరిగిరారని ఆమె ఊహించలేకపోయారు. ఆయన చనిపోయే ఓ గంట ముందే ఆమె ఉపవాసం విరమించారు. రాజ్‌పాల్ బలాలీ హరియాణా రోడ్‌వేస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తారు. ఆయన బలాలీ, దాద్రి మార్గంలో బస్సు నడిపేవారు. రాజ్‌పాల్‌కు వరుసకు సోదరడయ్యే వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగా ఉండేది కాదు. కానీ ఆయన రాజ్‌పాల్‌కు చాలా సన్నిహితంగా ఉండేవారు. అలాంటి ఆయనే రాజ్‌పాల్‌ను హత్య చేశారు. రాజ్‌పాల్ ఇంటి బయట కూర్చుని ఉన్నప్పుడు ఆయనపై కాల్పులు జరిపారు. రాజ్‌పాల్ అక్కడికక్కడే మరణించారు.
అదే నా చివరి కర్వా చౌత్. (భర్త క్షేమం కోసం భార్య చేసే వ్రతం) నేను సర్వం పోగొట్టుకున్నాను అని ప్రేమ్‌లత అన్నారు. నా భర్త రక్తపు మడుగులో పడి ఉన్నారు. నేను మా పిల్లల పరిస్థితిని ఊహించలేకపోయాను. ఎలా స్పందించాలో కూడా తెలియలేదు. నా జీవితానికి అర్ధం లేదనిపించింది. కానీ నా పిల్లల కోసం బతకాలనే విషయాన్ని అర్థం చేసుకున్నాను. అన్నారామె. వినేశ్ ఎప్పుడూ తన తల్లి తమ కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. తనను ఓ ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా తయారుచేసిన తల్లికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు. వినేశ్ తల్లి ప్రేమ్‌లతకు 2004లో క్యాన్సర్ నిర్థరణ అయింది. వినేశ్ వాళ్ల నాన్న చనిపోయిన తర్వాత నా ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. నాకు క్యాన్సర్ అని తేలింది. నేను ఇంకా ఏడాదో, రెండేళ్లో బతకుతానని డాక్టర్ చెప్పారు అని ప్రేమ్‌లత గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో నా పిల్లలు మరీ చిన్నవాళ్లు. వారి భవిష్యత్తు గురించి చాలా బాధపడ్డా. వారి కోసమైనా బతకాలనుకున్నాను. వినేశ్ సోదరుడు హర్వీందర్ తల్లిని జోధ్‌పూర్‌లో ఓ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. నువ్వు ఇంకా ఎన్నాళ్లు జీవించాలని అనుకుంటున్నావు...అని డాక్టర్ అడిగారు. ఐదేళ్లని చెప్పాను. అప్పటికి, నా పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడతారని అనుకున్నాను. అయితే డాక్టర్ నవ్వి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నీ పిల్లలతో హాయిగా ఉంటావని భరోసా ఇచ్చారు. ఆ డాక్టర్ దయవల్ల, ఆ దేవుడి దయ వల్ల నేను ఇప్పటికీ నా పిల్లలతో ఇక్కడే ఉన్నాను అని ప్రేమ్ లత అన్నారు. కొన్నాళ్లు కొడుకు హర్వీందర్ ఆమెను ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. కానీ, పిల్లల పనులకు, ట్రైనింగ్‌లకు అడ్డురాకూడదని తానే స్వయంగా ఆసుపత్రికి వెళ్లేదానినని ప్రేమ్‌లత చెప్పారు. తన పిల్లలు ఆటల్లో విజయాలు సాధించారని, ఇదంతా మహావీర్ పుణ్యమేనని ప్రేమ్‌లత అన్నారు.
పొడవాటి జుట్టుపై మక్కువ
పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ బరువు తగ్గించేందుకు సాధ్యమైన ప్రతిపనీ చేశారు. చివరకు ఆమె జుట్టు కూడా కత్తిరించారు. ఆటల్లోకి వచ్చిన తొలినాళ్లలో వినేశ్ పొడవాటి జుట్టు గురించి కలగనేవారు. టీనేజీలోకి అడుగుపెట్టాక అందరు అమ్మాయిల్లానే జుట్టు పొడవుగా పెంచుకోవాలనుకున్నారు. కానీ మహావీర్ ఫొగాట్ చాలా కఠినంగా వ్యవహరించేవారు. 2000 చివర్లలో ఫొగాట్ అమ్మాయిలను రెజ్లింగ్‌కు పరిచయం చేసినప్పుడు ఆయన తాను శిక్షణ ఇచ్చే ఆరుగురు అమ్మాయిల విషయంలో స్ట్రిక్ట్ గా ఉండేవారు. వీరిలో నలుగురు ఆయన కూతుళ్లే (గీతా, బబితా, రీతు, సంగీత), మరో ఇద్దరు వినేశ్, ప్రియాంక. మహావీర్‌కు రెజ్లింగ్ అనేది సంస్కృతి మూలాల్లో ఇమిడిపోయిన ఓ గ్రామీణ క్రీడ. అందులో కొన్ని సంప్రదాయాలు కచ్చితంగా పాటించాలి. వాటిల్లో ఒకటి జుట్టు పొట్టిగా ఉండటం...
2015లో పెదనాన్న లేకుండా ఐదునెలలపాటు నేను శిక్షణ శిబిరంలో ఉన్నాను. నాకున్న ఒకే కోరిక పొడవాటి జుట్టు. అదేమీ పెద్ద విలాసం కాదు. కేవలం పొడవు జుట్టు మాత్రమే. ట్రైనింగ్ సమయంలో జుట్టు పెంచాను... కానీ, ఇష్టమైనవి కొన్నింటిని ఎప్పటికైనా వదులుకోవాల్సి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఆ సమయానికి నా జుట్టు భుజాల వరకూ ఉంది. దీన్ని పెదనాన్న పట్టించుకోరని అనుకున్నా. మా ట్రైనింగ్ మళ్ళీ మొదలుపెట్టినప్పుడు మొదటి రెండు మూడు సెషన్లు ఆయన నా జుట్టు గురించి మాట్లాడలేదు. కానీ ఆయన మౌనం తుపాను ముందు ప్రశాంతత అని నాకు తెలుస్తూనే ఉంది. మూడోరోజు సాయంత్రం ట్రైనింగ్‌కు ముందు నా జుట్టు గురించి అడిగారు. అంతే నేను స్తంభించిపోయాను. తలకిందకు దించి మౌనంగా ఉండిపోయా. అని వినేశ్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరోమాట మాట్లాడలేదు. కేవలం అడిగారు అంతే. చివరకు నేను ఎప్పుడూ కోరుకునే నా పొడవైన జుట్టును అలాగే ఉంచుకునేందుకు అంగీకరించారు అన్నారు వినేశ్
ఒలింపిక్ పతకం సాధించాలనే నా కల ఇంకా నెరవేరలేదు. కానీ ఆటకోసం వినేశ్ చేసిన త్యాగాలు దేనితోనూ పోల్చలేం. పారిస్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ ఒలింపిక్ పోడియం ఫినిష్ కంటే గొప్పది. ఆమె జాతి మొత్తం గర్వపడేలా చేసింది అని మహావీర్ ఫొగాట్ అన్నారు.