శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (19:59 IST)

ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు దక్షిణాసియా యువతులు ఇన్‌స్టాగ్రామ్‌‌‌లో తమను తాము 'బ్రౌన్ గర్ల్స్'గా చెబుతూ తమలాంటివారందరికీ వేదిక కల్పిస్తున్నారు. ఇంతకీ ఈ చామన ఛాయ రంగు అమ్మాయిలు(బ్రౌన్ గర్ల్స్‌) ఎవరు? ఎందుకలా చామనఛాయ అమ్మాయిలుగా ప్రకటించుకుంటున్నారు?

 
''మేం ముదురు గోధుమ వన్నెలో ఉన్నామని.. లేదంటే ఆ మాత్రం గోధుమ రంగులోనూ లేమని మమ్మల్ని అనేవారు ఉన్నారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మాకు మా సంస్కృతిని చాటడానికి వీలు కల్పిస్తోంది.. మేం కూడా అదే పనిచేస్తున్నాం'' అంటున్నారు ఈ బ్రౌన్ గర్ల్స్ గ్యాంగ్ వ్యవస్థాపకురాలు సంజనా నగేశ్. సంజనా స్థాపించిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 50 వేల మంది ఫాలోవర్లున్నారు. వారు బ్రౌన్‌గర్ల్స్ అందించే కంటెంట్ కోసం ఎదురుచూడడమే కాదు.. బ్రౌన్ గర్ల్స్‌కు కావాల్సిన కంటెంట్ అందించేందుకూ ఉత్సా హంగా ఉంటారు.

 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దక్షిణాసియా స్ఫూర్తిదాయక మహిళలకు వేదికనివ్వడమే ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ లక్ష్యం. ''ఇన్‌స్టాగ్రామ్‌లో నేను స్క్రోల్ చేస్తూ నాలా అద్భుతాలు చేసే మహిళల కోసం చూస్తున్నానప్పుడు. మా సుసంపన్న దక్షిణాసియా సాంస్కృతిక వారసత్వం జనబాహుళ్య పాప్ సంస్కృతితో మిళితమవుతూ అక్కడ సరికొత్త మేళవింపుతో కనిపించింది. అది అద్భుత సృజనకు దారితీస్తోంది. నేను చూపించాలనకుంటున్నదీ అదే'' అంటారు సంజన తాను ఈ పేజీ క్రియేట్ చేసినప్పటి రోజులు గర్తుచేసుకుంటూ.

 
ఆ పేజీలోని డాటాబేస్‌ను ఒకసారి పరికిస్తే అమెరికా, భారత్, కెనడా, బ్రిటన్‌కు చెందిన ఫాలోవర్లను ఆకర్షించేలా ఇండియన్-అమెరికన్ నటి మిండీ కలింగ్, యాక్టివిస్ట్ జమీలా జామిల్, ఇంకా ఎంతోమంది బాలీవుడ్ తారలకు సంబంధించిన మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇది వర్ధమాన కళాకారులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, సృజనకారుల చిత్రాలూ ఇక్కడున్నాయి. అయితే, అందరిలోనూ ఉన్న ఉమ్మడి లక్షణం చామన ఛాయ. సిమ్మి పటేల్ (@paper.samosa) వంటి కళాకారులు, @thecutepistaకు చెందిన నేహా గాంకర్ వంటివారికి సంజన పేజీపై ప్రాధాన్యం దక్కింది. వీరు ఈ పేజీ వేదికగా అందించే జీవితానికి సంబంధించి తమ పరిశీలనలు తెలుసుకోదగినవి.

 
ప్రకటనల రంగంలో పనిచేసే సిమ్మి బ్రిటన్‌లో పుట్టి అమెరికాలో పెరిగారు. పేపర్ సమోసా పేరిట ఇన్‌స్టా పేజీ క్రియేట్ చేసి అందులో ఆమె ఇండియన్, వెస్టర్న్ పాప్ సంస్కృతులను మేళవిస్తూ మీమ్స్ పెడుతుంటారు. ''ఏదైనా హాయిగా ఉండే కంటెంట్ సృష్టించాలనుకుంటాను. అది, మిగతావాటికి భిన్నంగా ఉంటూ ప్రజలను ఎంగేజ్ చేసేలా ఉండాలనుకుంటాను'' అంటారామె. ముఖ్యంగా వీటన్నిటికీ మూలం, లక్ష్యం కూడా పాశ్చాత్య దేశాల్లో నివసించే దక్షిణాసియా ప్రజలే. ఇన్‌స్టాలో #BrownGirl అనే హ్యాష్‌ట్యాగ్ లక్షలాదిగా వాడుతున్నారు.

 
''సినిమాలు, టీవీలపై ఆధారపడడానికి ముందు మాలాంటి మహిళలు ఒకే తరహా, మూస ధోరణిలో చిత్రీకరించబడేవారు. ఇకముందు అలా ఉండదు. మేం పూర్తిగా మా సొంత కథలను అందిస్తాం' అని సంజన చెప్పారు. దక్షిణాసియా ప్రజలు డిజిటల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారేది ఒహాయోలోని బౌలింగ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాధిక గజ్జల అధ్యయనం చేస్తున్నారు. 'ఈ బ్రౌన్ గర్ల్ మూమెంట్ నన్నేమీ ఆశ్చర్యపర్చలేదు' అంటారామె. బాలీవుడ్ స్టార్లు కూడా చాలాకాలంగా తమను, తమ బ్రాండ్లను కావాల్సినట్లు ప్రొజెక్ట్ చేసుకోవడానికి డిజిటల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని చెప్పారామె.

 
''ఈ యువతులు కూడా బాలీవుడ్ స్టార్ల తరహాలోనే తమను తాము వ్యక్తీకరించుకుంటున్నారు.. అయితే, బాలీవుడ్ స్టార్ల కంటే ఇంకా పకడ్బందీగా వ్యక్తీకరిస్తున్నార''ని చెబుతున్నారు రాధిక గజ్జల. ఈ మహిళలంతా డిజిటల్ డయాస్పొరాలో భాగమని రాధికా గజ్జల చెబుతున్నారు. 'ది క్యూట్ పిస్తా' అనే ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న నేహా గావంకర్ అనే ట్రైనీ ఆర్కిటెక్ట్ కూడా ఇదే చెబుతున్నారు.

 
'నేను భారత్, బ్రిటన్‌లో పెరిగాను. ఆ తరువాత పదేళ్ల కిందట అమెరికాకు తరలిపోయాను. దక్షిణాసియా సంస్కృతి, వారసత్వానికి సంబంధించిన సుసంపన్నతను చాటడానికి ఒక ఆనందకరమైన మాధ్యమం అవసరం.. అందులో మనం ఇమిడిపోయేలా ఉండాలి'' అంటారామె. ఈమధ్యే తన భారతీయ సాంస్కృతిక మూలాల్లో నిమగ్నం కావాలని కోరుకున్నానని.. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చానని.. అక్కడ తనలాంటి ఇంకెందరో తాను కోరుకుంటున్నలాంటి కంటెంట్‌నే అందిస్తున్నారని చెప్పారు.

 
భారతీయులుగా, పాకిస్తానీలుగా, ఇంకా ఇతర ఆసియా దేశస్థులుగా ఉండడంపై వ్యక్తీకరిస్తున్న అనేకమంది ప్రతిభావంతులను చూశానని.. ఈ మొత్తం సుసంపన్న చరిత్రలో నేనూ భాగంగా కావాలనుకున్నానని చెప్పారామె. ''బ్రౌన్ గర్ల్గ్'‌గా గుర్తింపు పొందడంపై తానూ గర్వంగా ఉన్నానని టొరంటోలో నివసించే ప్రణవి సుతాగర్ అన్నారు. తమిళ కెనడియన్ అయిన ఆమె గ్రాఫిక్ డిజైనింగ్ వ్యాపారంలో ఉన్నారు.
 
ఆమె Not__Sari అనే ఇన్‌స్టా ఖాతా నిర్వహిస్తున్నారు. అక్కడామె తాను తయారు చేసే దుస్తులు, బ్యాడ్జీలు, పోస్టర్లు ప్రదర్శిస్తుంటారు. ''నేను పెద్దదాన్నవుతున్న సమయంలో ఇతర చామనచాయ రంగువారితో(దక్షిణాసియా వారు) స్నేహం పెంచుకునేదాన్ని. మేం వేర్వేరు దేశాలు, వేర్వేరు నేపథ్యాలకు చెందినవారమైనప్పటికీ మా అందరిలో కొన్ని సారూపత్యతులు ఉండేవి. సాంస్కృతిక సారూప్యతలు మా మధ్య బంధం పెంచడాన్ని నేను ఇష్టపడేదాన్న''ని చెప్పారు.
 
బ్రౌన్ అనే పదం వాడకం ఇక్కడ ముఖ్యమైనదని.. వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు దేశాల నుంచి వచ్చినా వారందరిలో కామన్‌గా ఉండే ఈ అంశం వారి నేపథ్యాల మధ్య అంతరాన్ని చెరిపేస్తుందని ప్రొఫెసర్ గజ్జల చెప్పారు. ''దీన్ని కేవలం దక్షిణాసియా మహిళలకు మాత్రమే చెందిన విషయం కాదు.. వారి కుటుంబాల నుంచి వలస వెళ్లినవారికి చెందినది కూడా. ఆ వలసలు ఇష్టపూర్వకంగా జరిగినవి కావొచ్చు.. లేదంటే, వలస పాలకుల పీడన, బానిసత్వం కారణంగా జరిగినవి కావొచ్చు. కానీ, ఈ వలసదారులందరిలోనూ ఉమ్మడి అంశం చామనచాయలో ఉండడం.
 
అమెరికా 2001 సెప్టెంబరు 11 దాడుల తరువాత నుంచి ఈ 'బ్రౌన్' అనే పదం మరింత ప్రాచుర్యంలోకి వచ్చిందని ప్రొఫెసర్ గజ్జల అంటారు. ''ఇది రాజకీయ ఏకాభిప్రాయం గురించి.. ఈ బ్రౌన్ అనే పదం భిన్న నేపథ్యాలున్నవారిని ఏకతాటిపైకి తెచ్చింది. అయితే, ఈ బ్రౌన్ అనే పదం వర్ణ వివక్ష కేటగిరీలో లేదు. జనాభా లెక్కల్లోనూ ఇలాంటి వర్గీకరణ లేదు. కానీ, వలస వచ్చినవారు అనేదానికి ఇది ఎప్పుడూ సూచికగానే ఉంది. ముఖ్యంగా అమెరికాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇప్పడు మహిళలు తమ కథలను చెప్పడానికి దీన్ని ఉపయోగించడం చూస్తున్నాం'' అన్నారు ప్రొఫొసర్ గజ్జల.
 
ఇక సోషల్ మీడియాకు వస్తే.. ఈ మహిళలంతా ఒకర్నొకరు వెతుక్కుంటూ ఇక్కడ కలిశారు. వేర్వేరు నేపథ్యాల నుంచి.. వేర్వేరు సరిహద్దులను దాటుకుని వారంతా వచ్చినా తమ మధ్య ఎన్నో ఉమ్మడి అంశాలున్నాయని వారు గుర్తించారు. బ్రౌన్ అనేది ఒక వ్యావహారిక పదం.. దేశీ అనే పదం వాడడానికి ఇష్టపడనివారు కూడా దీన్ని వాడొచ్చు. ఇండో-కరీబియన్ ప్రజలు, శ్రీలంకవారు కూడా ఇందులోకి వస్తారని ప్రణవి సుతాగర్ చెబుతున్నారు.
 
'ఈ బ్రౌన్ అనే పదాన్ని శ్వేతజాతీయులు వాడుతున్నారని నేననుకోను. ఎవర్నైనా ఉద్దేశించి వారు కనుక అలాంటి పద ప్రయోగం చేస్తే అది బాధించే విషయమే. నా అనుభవం ప్రకారం అదేమీ అమర్యాదకర పదమేమీ కాదు. నా పట్ల కూడా ఎవరూ ఇంతవరకు అలా అన్నది లేద''ని చెప్పారామె.
 
''దక్షిణాసియా మహిళలంటే అణచివేతకు గురయ్యేవారు, సంప్రదాయబద్ధమైనవారు అనే ముద్ర మొదటి నుంచీ ఉంది. కానీ, ఇన్‌స్టా‌లోని ఈ 'బ్రౌన్ గర్ల్స్' ఆ అభిప్రాయాలను తొలగిస్తూ తరచూ అనేక విధాలుగా హాస్యం ఒలకబోస్తూ ఉల్లాసభరితంగా ఉన్నామని, అణచివేతలకు వ్యతిరేకంగా తిరిగి పోరాడగలమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చామనఛాయ మహిళలకు శ్వేత జాతీయుల రక్షణ అవసరం లేదు'' అన్నారామె.
 
ఇన్‌స్టాలో 'హేట్ కాపీ' అనే అకౌంట్ నడిపే మారియా ఖమార్‌ను ఔత్సాహిక దేశీ కళాకారులు స్ఫూర్తిగా తీసుకుంటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. న్యూయార్క్‌లో ఆమె చిత్రాలు ప్రదర్శిస్తుంటారు. దేశీ నడివయసు మహిళలను సోషల్ మీడియా చిత్రపటంలోకి తెచ్చింది హేట్ కాపీయే అంటారు సిమ్మి.
 
కెనడాలోని టొరంటోలో నివసించే మారియా 'నాకు వ్యక్తిగతంగా ఎదురైన అనుభవాల గురించి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించి చిత్రాలు గీస్తాను' అని చెప్పారు. ''బ్రౌన్ గర్ల్స్ మీకు వ్యతిరేకం కాదు. శ్వేతేతరులకు మీడియాలోనూ ప్రాతినిధ్యం ఉండడం లేదు. బ్లాక్, బ్రౌన్ మహిళలన పక్కనపెడుతున్నారు. ఇప్పడు మేమూ కనిపిస్తున్నాం'' అంటారు మారియా.