శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 6 మే 2021 (12:33 IST)

కరోనావైరస్: ప్రజల ప్రాణాలా, ఆర్ధిక వ్యవస్థా? లాక్‌డౌన్‌పై మోదీ సర్కారులో అయోమయం

దేశంలో పెద్ద ఎత్తున కోవిడ్ కేసులు, మరణాలు నమోదవుతుండటంతో జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ విధించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే, దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదని అధికారులు చెబుతున్నారు. ''పేదలను, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తూ దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించడం మంచిది‘‘ అని మంగళవారం నాడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు.

 
రాహుల్ గాంధీ కోరిన రక్షణ అంటే వారికి కనీసం ఆదాయం కల్పించడం. తాము గెలిస్తే కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. లాక్‌డౌన్‌లో ఆ తరహా ఏర్పాటు చేయాలని రాహుల్ కోరుతున్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు స్థానిక లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. మరో 10 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో మే 15 వరకు లాక్‌డౌన్ కొనసాగబోతోంది.

 
భారత దేశంలో రెండు మూడు వారాలపాటు జాతీయ లాక్‌డౌన్ విధించడం మంచిదని అమెరికా ప్రభుత్వ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌచి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు. ''ఇండియాలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు. సెకండ్ వేవ్‌ను అదుపు చేయడానికి లాక్‌డౌన్‌ విధించాలని భారత సుప్రీం కోర్టు ఇటీవలే మోదీ ప్రభుత్వానికి సూచించింది. సభలు, సమాశాలులాంటి సూపర్ స్ప్రెడర్ కార్యక్రమాలను నిషేధించాలని సూచించింది.

 
''లాక్‌డౌన్ వల్ల కలిగే సామాజిక, ఆర్ధిక పరిణామాలు మాకు తెలుసు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ వర్గాల సమస్యలను ముందే పరిష్కరించాల్సి ఉంది'' అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

 
వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పరిస్థితి ఏంటి?
ఆసుపత్రి సిబ్బంది 24 గంటలూ పని చేస్తున్నా, ఆక్సిజన్, బెడ్ల కొరత కారణంగా వారి కళ్ల ముందే రోగులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. దీంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. అందుకే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాడ్‌డౌన్ విధింపు తప్పదన్న అభిప్రాయం డాక్టర్లు, వైద్య సిబ్బంది నుంచి కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో గత సంవత్సరంలాగే పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల వ్యాఖ్యానించారు.

 
దేశంలో పదికి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, నగరాల్లో లోకల్‌ లాక్‌డౌన్లు లేదంటే రాత్రి పూట కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వీకెండ్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించారు. లాక్‌డౌన్‌ను చివరి ఆప్షన్‌గా పరిగణించాలని ప్రధాని మోదీ గత వారం ముఖ్యమంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో సూచించారు. అయితే, మహారాష్ట్ర, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా రోజుకు సగటున నాలుగు లక్షల ఇన్‌ఫెక్షన్ కేసులు రాగా, ఇప్పుడు 3 లక్షల 57 వేలకు తగ్గాయి.

 
అయితే, కరోనా మరణాల సంఖ్య మాత్రం అనుకున్నంత తగ్గలేదు. వైరస్ ఇంకా కొత్త ప్రదేశాలకు వ్యాప్తి చెందుతోంది. నగరాల మాదిరిగా ఆరోగ్య సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. సెకండ్ వేవ్‌ను ఆపే శక్తి మనకు లేదని డాక్టర్ గులేరియా అభిప్రాయపడ్డారు. అంతేకాదు, రాష్ట్రాల లాక్‌డౌన్‌ విజయవంతమవుతున్నట్లు, వ్యాధి వ్యాప్తి కట్టడి అవుతున్నట్లు ఎక్కడా ఆధారాలు కనిపించడం లేదనీ, దేశవ్యాప్త లాక్‌డౌన్ ఒక్కటే దీనికి పరిష్కారమని గులేరియా అన్నారు.
 
ప్రజల ప్రాణాలా, ఆర్ధిక వ్యవస్థా.. ఏది ముఖ్యం?
భారత ప్రభుత్వం సమస్య ఏమిటంటే, ప్రజల ప్రాణాలను కాపాడాలని భావిస్తే ఆర్ధిక వ్యవస్థ నాశనం కావచ్చు. ఆర్ధిక వ్యవస్థనే దృష్టిలో పెట్టుకుంటే, పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతాయి. నిరుద్యోగం కూడా పెరుగుతుంది. మరోవైపు వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. కానీ 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో టీకా కార్యక్రమం వేగంగా పూర్తి చేయడం అంత సులభమైన విషయం కూడా కాదు.


మనుషులు బతికి ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుందంటూ గత ఏడాది మార్చి 24న లాక్‌డౌన్ విధిస్తున్న సందర్భంగా ప్రధాని అన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ అంతకన్నా భీకరంగా ఉంది. మరి ప్రధాని ఎందుకు లాక్‌డౌన్‌ పట్ల విముఖత చూపిస్తున్నారు? ''లోకల్ లాక్‌డౌన్‌, కంటైన్‌మెంట్ జోన్లకే ప్రధాన మంత్రి ప్రాధాన్యమిస్తున్నారు'' అని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.

 
గత ఏడాది, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లింది. వృద్ధి రేటు ఓ త్రైమాసికంలో -23.9 శాతానికి పడిపోయింది. గతంలో భారత ఆర్థిక వ్యవస్థలో ఇంత తీవ్రమైన క్షీణత ఎప్పుడూ కనిపించ లేదు. దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్లమంది నిరుద్యోగులుగా మారారు. పెద్ద సంఖ్యలో కార్మికులు వలస బాట పట్టారు. వీరిలో చాలా మంది తమ గ్రామాలకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ వలసలు, వారి కష్టాల కారణంగా అప్పట్లో ప్రధాన మంత్రి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బహుశా అందుకే ఆయన మరో లాక్‌డౌన్‌కు సిద్ధపడలేక పోతున్నట్లు కనిపిస్తోంది.

 
మరోవైపు, అన్‌లాక్ తర్వాత ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఈ సమయంలో దాన్ని మళ్లీ కదిలించడం ప్రమాదకరమని ప్రధాని భావిస్తుండవచ్చు. మరోవైపు, దేశవ్యాప్తంగా వైద్యులు, ఆసుపత్రులలో పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఉన్నారు. వాళ్లను అలా ఎక్కువ కాలం పని చేయించడం కూడా సరికాదని ప్రభుత్వం ఆందోళన పడుతోంది.

 
నిపుణులు ఏమంటున్నారు?
గత ఏడాది మోదీ ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న స్టీవ్‌ హాంకీ తప్పుబట్టారు. అసంఘటిత రంగంపై ఆధారపడిన భారతదేశంలో లాక్‌డౌన్ విధించడం అవివేకమని ఆయన అన్నారు. ''భారతదేశంలో స్మార్ట్‌ లాక్‌డౌన్‌లు అవసరం. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రాంతాలలోనే లాక్‌డౌన్‌ విధించాలి'' అని ఆయన అన్నారు.

 
''భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. దాన్ని కట్టడి చేయడం అంత సులభం కాదు. దీనికోసం మనం కొన్ని కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలి. టెస్టులు, ట్రేసింగ్‌లు పెంచాలి. రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. ఇళ్లలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. మత సామూహిక కార్యక్రమాలు ఆపాలి. వ్యాక్సీన్‌పై అవగాహన పెంచాలి'' అని అమేశ్ అడాల్జా అన్నారు.

 
భారత సంతతికి చెందిన ఆయన జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ప్రజారోగ్య నిపుణుడిగా పని చేస్తున్నారు. మిషిగాన్ యూనివర్సిటీలో డేటా సైంటిస్టుగా పని చేస్తున్న ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ భ్రమర్‌ ముఖర్జీ కూడా భారత దేశంలో మొదటి, రెండో వేవ్ కరోనా పరిణామాలను నిరంతరం పరిశీలిస్తున్నారు. ''భారత దేశంలో కొన్ని అంశాలపై దృష్టి పెడితే, లోకల్ లాక్‌డౌన్‌లతోనే కరోనాను కట్టడి చేయవచ్చు'' అని భ్రమర్ ముఖర్జీ అన్నారు.

 
''అధికారిక లెక్కలకన్నా వాస్తవ వైరస్ వ్యాప్తి, మరణాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గణాంకాలు సేకరించడం వల్ల సెకండ్ వేవ్ పీక్‌ స్టేజ్ ఎప్పుడు అన్నది గుర్తించవచ్చు'' అని ఆయన సూచించారు.