మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మే 2021 (20:05 IST)

కరోనా నుంచి కోలుకున్నవారు చేయాల్సిన పనులు ఏంటి?

దేశంలో కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రతి ఒక్కరినీ హడలెత్తిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. మరికొందరు ఈ వైరస్ బారినుంచి కోలుకున్నప్పటికీ.. చాలా నీరసంగా ఉంటున్నారు. ఇలాంటి వారు శారీర‌కంగా, మానసికంగా దృఢంగా అయ్యేందుకు కొద్దిరోజుల పాటు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 
కరోనా వైరస్ బారినపడి తిరిగి కోలుకున్న తర్వాత ఆహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దానిమ్మ‌, ఆరెంజ్‌, యాపిల్‌, బొప్పాయి, ఇత‌ర‌త్రా పండ్ల‌ను రెగ్యుల‌ర్‌గా తినాలి. నీర‌సం త‌గ్గాలంటే పండ్ల ర‌సాలు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. ఇంకా కుదిరితే ఉద‌యం పూట పండ్లు తిని, సాయంత్రం జ్యూస్ తాగ‌డం మంచిది. దీనివ‌ల్ల పండ్ల‌ను తీసుకునే శాతం పెరుగుతుంది. 
 
అలాగే, శరీరాన్ని ఆవహించిన నిస్సత్తువను తగ్గించి ఎముక‌ల‌ను దృఢంగా మార్చ‌డంలో పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువల్ల ప్రతి రోజూ ప‌డుకునే ముందు పాలు తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి వ‌స్తుంది. వేడి పాల‌ల్లో చిటికెడు ప‌సుపు వేసుకుని తాగితే ఇంకా మంచి ఫ‌లితం ఉంటుంది.
 
రోజూ ఆవిరి ప‌ట్టుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతేకాకుండా శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ స‌హాయ‌ప‌డుతుంది. అందువల్ల రోజుకు రెండు నుంచి మూడుసార్లు ఆవిరి ప‌ట్టుకోవ‌డం మంచిది.
 
కూర‌గాయ‌ల్లో కావాల్సిన‌న్ని విట‌మిన్లు, పోష‌కాలు ల‌భిస్తాయి. కాబట్టి ప్ర‌తిరోజు ఆహారంలో ర‌క‌ర‌కాల కూర‌గాయ‌లు ఉండేలా చూసుకోవాలి. క్యారెట్‌, ట‌మాటో, బీట్‌రూట్ వంటి వాటిల్లో ఖ‌నిజాలు, విట‌మిన్లు పుష్క‌లంగా ఉంటాయి. వీటిని పుష్టిగా ఆరగించడం వల్ల నీరసం చాలా మేరకు తగ్గిపోతుంది. 
 
అన్నిటికంటే ముఖ్యంగా, క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా కొద్దిరోజుల పాటు ఎప్ప‌టిక‌ప్పుడు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ చెక్ చేసుకోవాలి. పూర్తిగా కోలుకునే వ‌ర‌కు ఇంటి స‌భ్యుల‌కు దూరంగానే ఉండాలి. ఇంట్లో ఉన్నా మాస్క్ ధ‌రించాలి. నెగెటివ్ వ‌చ్చిన త‌ర్వాత ప‌ది రోజుల పాటు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవ‌డం మంచిది.