ఏపీలో కర్ఫ్యూ .. దూర ప్రాంత ఆర్టీసీ సర్వీసులు రద్దు...
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దీంతో కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా, బుధవారం నుంచి సరికొత్త ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా, మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారి ఆరు గంటల వరకు కర్ఫ్యూ విధించింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచే వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ సరిహద్దుల్లోనే నిలిపివేస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు, ప్రజా రవాణా పనిచేయనున్నాయి. అనంతరం వాటిపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా.. రాష్ట్రంలో కర్ఫ్యూ దృష్ట్యా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని ఆర్టీసీ రద్దుచేసింది. దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ రోజు నుంచి ఈనెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా.. బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు అనుగుణంగానే అప్పటికప్పుడు పలు రూట్లల్లో బస్సులు సమకూర్చనున్నారు. మధ్యాహ్నం 12 లోపు గమ్యస్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకే అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత గమ్యస్థానాలు చేరుకునే దూరప్రాంత బస్సు సర్వీసులను రద్దు చేశారు.
దీంతోపాటు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలావుంటే.. ఏపీలో కర్ప్యూను అధికారులు కఠినంగా అమలుచేస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వాహానాలను సరిహద్దుల్లోనే ఆపి.. వెనక్కి పంపుతున్నారు.