మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మే 2021 (17:56 IST)

భయపెడుతున్న కరోనా.. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్డౌన్

కరోనా వైరస్ రోజురోజుకూ భయపెడుతోంది. ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్యలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. దీంతో లక్డౌన్ విధించే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 రోజులపాటు లాక్డౌన్‌ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.
 
ఈ లాక్డౌన్ ఈ నెల 7 నుంచి 16 వరకు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ అధ్యక్షత బుధవారం అత్యవసర కేబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు మంత్రివర్గం లాక్‌డౌన్‌ అమలుకు ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఇంటర్కు ప్రమోట్‌ చేసింది. బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణించాలనుకునే వారు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకొని నెగిటివ్‌ రిపోర్టు వెంట ఉంచుకోవాలని సూచించింది.