బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మే 2021 (17:13 IST)

ఆ 12 రాష్ట్రాలే కొంప ముంచుతున్నాయ్.. : లవ్ అగర్వాల్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా వుంది. దీంతో ప్రతి రోజూ లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, దేశంలో క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్లే త‌గ్గి.. పెరుగుతున్నాయ‌ని, క‌రోనా పాజిటివిటీ, మ‌ర‌ణాల‌ రేటు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద్నారు. 
 
ముఖ్యంగా, 12 రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఆ రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌డ్‌, ప‌శ్చిమ బెంగాల్, బీహార్, హ‌ర్యానా రాష్ట్రాల్లో ల‌క్ష చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. 50 వేల నుంచి ల‌క్ష మ‌ధ్య యాక్టివ్ కేసులు 7 రాష్ట్రాల్లో ఉన్నాయి. 50 వేల కంటే త‌క్కువ కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్రాలు 17 ఉన్నాయ‌న్నారు. 
 
13 రాష్ట్రాల్లో రోజుకు వంద మంది చ‌నిపోతున్నారు. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, హ‌ర్యానాలో మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌న్నారు. రోజువారీ క‌రోనా కేసుల్లో 2.4 శాతం పెరుగుల ఉంది. మంగళవారంతో పోలిస్తే ఈ రోజు పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా వ‌చ్చాయ‌న్నారు. మ‌హారాష్ట్రలో కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌క‌పోతే.. వైద్య‌సేవ‌ల నిర్వ‌హ‌ణ మ‌రింత క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌న్నారు.
 
ఇకపోతే, బెంగ‌ళూరు, చెన్నైలో క‌రోనా కేసులు ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతున్నాయి. ఒక్క బెంగ‌ళూరులోనే వారం రోజుల్లో ల‌క్ష‌న్న‌ర పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. బెంగ‌ళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువ‌గా ఉంది. త‌మిళ‌నాడులో 38 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. కోజికోడ్, ఎర్నాకులం, గురుగ్రామ్ జిల్లాల్లో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని చెప్పారు. 
 
ఇదిలావుంటే, దేశంలో బుధవారం కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోద‌య్యాయి. గత 24 గంటల్లో 3,82,315  మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,38,439  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 2,06,65,148కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 3,780 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,26,188 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,69,51,731 మంది కోలుకున్నారు. 34,87,229 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,04,94,188 మందికి వ్యాక్సిన్లు వేశారు.