మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (12:26 IST)

కోవిడ్-19: పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయని బ్రిటన్ ప్రధాని హెచ్చరిక

బ్రిటన్‌లో కొత్త వేరియంట్ కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి రెండో వారం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

 
కొత్త కేసులు, రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. రానున్న రెండు మూడు వారాలు పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయని ఆయన హెచ్చరించారు. మనం పోరాటం చివరి దశలోకి అడుగుపెడుతున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. ‘‘కరోనావైరస్ కేసులు పతాక స్థాయికి చేరుతున్నట్లు అనిపిస్తోంది. ముందెన్నడూ లేనంత స్థాయిలో ఆసుపత్రులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 
వచ్చే నెల రెండో వారం పూర్తయ్యేలోగా తొలి నాలుగు ప్రాధాన్య వర్గాలకు వ్యాక్సీన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వైద్య సిబ్బంది, 70 ఏళ్లకు పైబడిన వృద్ధులు, సామాజిక సేవల సిబ్బంది, తీవ్రమైన అనారోగ్యాలు ఉండేవారిని తొలి నాలుగు ప్రాధాన్య వర్గాలుగా ఆయన పేర్కొన్నారు.

 
మరోవైపు అందరూ ఇంటికే పరిమితం కావాలని స్కాట్లాండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జనవరి 18 వరకు స్కూళ్లు, కాలేజీలను మూసే ఉంచాలని వేల్స్ కూడా ఆదేశించింది. ఉత్తర ఐర్లాండ్ కూడా ఈ- లెర్నింగ్‌ను మరింత కాలం పొడిగిస్తున్నట్లు పేర్కొంది. వరుసగా ఏడో రోజు సోమవారం కూడా బ్రిటన్‌లో 50,000కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.