త్వరలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం : ప్రధాని మోడీ
కొత్త సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట అన్నీ సానుకూల ప్రకటనలో వస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలుగా దేశీయంగానే రెండు టీకాలను అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. ఇపుడు దేశంలో త్వరలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
సోమవారం ఢిల్లీలో నేషనల్ మెట్రోలజీ కాంక్లేవ్-2021ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నూతన సంవత్సరంలో దేశంలో రెండు కోవిడ్ వ్యాక్సిన్లను విజయవంతంగా అభివృద్ధిపరచిన భారతీయ శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. భారతదేశం చేపట్టబోయే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమమని, ఇది త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు.
అలాగే, నేషనల్ ఆటోమేటిక్ టైమ్‌స్కేల్, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ ప్రజలకు మోడీ అంకింతం చేశారు. జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబెరేటరీకి శంకుస్థాపన చేశారు. విద్యార్థులతో శాస్త్రవేత్తలు ముఖాముఖీ జరిపి, సంస్థ సాధిస్తున్న విజయాలను వారికి తెలియజేయాలని, వారిని భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్దిదిద్దేందుకు కృషి చేయాలని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)ను ప్రధాని కోరారు.
దేశం ఎదుర్కొంటున్న ప్రతి సవాలుకు కలిసికట్టుగా పరిష్కారం కనుగొనేందుకు సీఐఎస్ఆర్ సహా దేశంలోని సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూషన్లు చేస్తున్న కృషి శ్లాఘనీయమని అన్నారు. సీఎస్ఐఆర్ నేషనల్ ఫిజికల్ లేబరేటరీ (ఎన్‌పీఎల్) కృషిని కూడా ప్రధాని కొనియాడారు. గతంలో సాధించిన విజయాలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం కావడానికి ఇవాల్టి సదస్సులో జరిగే చర్చలు ఉపకరిస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.