శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 6 మే 2021 (13:13 IST)

కోవిడ్: భారతదేశంలో సెకండ్ వేవ్ సంక్షోభానికి కారణమేంటి? ఎక్కడ తప్పు జరిగింది?

భారతదేశంలో గానీ, రాజధాని దిల్లీలో గానీ ఆక్సిజన్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు సోమవారం నాడు చెప్పారు. కానీ, ఆయన మాట్లాడిన ప్రదేశానికి కాస్త దూరంలోనే ఉన్న చాలా చిన్న చిన్న ఆసుపత్రులు ఆక్సిజన్ కావాలనీ, లేదంటే రోగుల ప్రాణాలు అపాయంలో పడతాయంటూ ఎస్ఓఎస్ సందేశాలు పంపిస్తున్నాయి.

 
"పిల్లలు చనిపోతారేమోననే భయంతో మా గుండెలు జారిపోయాయి" అని పిల్లల వైద్య నిపుణులు ఒకరు బీబీసీతో అన్నారు. ఒక స్థానిక రాజకీయ నాయకుని చొరవతో ఆ ఆసుపత్రికి సమయానికి ఆక్సిజన్ లభించింది. ఒక వైపు దేశంలో పరిస్థితి విషమంగా ఉంటే మరో వైపు కేంద్ర ప్రభుత్వం చేసే ప్రకటనలు మాత్రం ఆక్సిజన్ కొరత లేదనే చెబుతున్నాయి.

 
"మేము కేవలం ఆక్సిజన్ సరఫరా చేయడానికే సమస్యలను ఎదుర్కొంటున్నాం" అని భారత గృహ మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారి పీయూష్ గోయల్ చెబుతున్నారు. "ప్రభుత్వ నియమావళిని అనుసరించి ఆక్సిజన్ వాడమని ఆయన హాస్పిటళ్లకు సలహా ఇచ్చారు. అవసరమైన వారికి మాత్రమే ఆక్సిజన్ ఇస్తున్నప్పటికీ తగినంత ఆక్సిజన్ లేదని కొందరు డాక్టర్లు బీబీసీకి చెప్పారు.

 
సెకండ్ వేవ్‌లో తలెత్తే విధ్వంసాన్ని తగ్గించేందుకు, తగిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధంగా లేకపోవడంతో ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాయని నిపుణులు అంటున్నారు. ఆక్సిజన్ కొరత కేవలం ఈ మొత్తం సంక్షోభంలో ఒక సమస్య మాత్రమే అని అన్నారు.

ముందుగా హెచ్చరికలు వచ్చినా...
"తగినంత ఆక్సిజన్ కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని బెడ్స్ కానీ లేవు" అని వైద్య రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నవంబరులో తెలిపింది. మరో కోవిడ్ సునామి రానున్నట్లు ఫిబ్రవరిలో పలువురు నిపుణులు బీబీసీకి చెప్పారు. వేగంగా వ్యాప్తి చెందే ఒక కొత్త రకం వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందనున్నదని ప్రభుత్వం నియమించిన శాస్త్రవేత్తలు, నిపుణులు మార్చి నెలలో హెచ్చరించారు. అయినప్పటికీ దీనిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆ బృందంలో ఒక శాస్త్రవేత్త బీబీసీతో అన్నారు. అయితే, ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఏమి మాట్లాడలేదు. వీటన్నిటి మధ్యా, "దేశంలో మహమ్మారి ముగిసిపోయినట్లే" అని మార్చి 8న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.

 
తప్పు ఎక్కడ జరిగింది?
గత సంవత్సరం సెప్టెంబరులో 90,000 కేసుల నుంచి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నాటికి రోజు వారి కేసులు 20 వేలకు పడిపోయాయి. కోవిడ్‌ను జయించామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత నెమ్మదిగా దేశంలో బహిరంగ ప్రదేశాలన్నిటినీ తెరిచేసారు. ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటించడం మానేశారు. అధికారుల నుంచి వచ్చిన అయోమయపు సందేశాలే ఇందుకు కారణం అని చెప్పవచ్చు.

మోదీ తన సందేశాల్లో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించమని ప్రజలకు చెబుతున్నారు. కానీ, ఆయన మాత్రం ఇటీవలి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మాస్కులు ధరించని ప్రజలు పాల్గొన్న భారీ ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించారు. ఆయన ప్రభుత్వంలో ఉన్న చాలామంది మంత్రులు కూడా మాస్కులు ధరించకుండానే భారీ సభల్లో ప్రసంగించారు. లక్షలాది మంది పాల్గొనే కుంభ మేళా నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చారు.

 
"వారు పాటించిన దానికి, చెప్పిన దానికి అసలు సంబంధం లేదు" అని పబ్లిక్ పాలసీ అండ్ హెల్త్ సిస్టమ్స్ నిపుణులు డాక్టర్ చంద్రకాంత్ లహరియా అన్నారు. "సెకండ్ వేవ్ వస్తుందనే విషయాన్ని పట్టించుకోకుండా చాలా తొందరగా సంబరం చేసుకోవడం మొదలుపెట్టాం" అని వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ అన్నారు.

 
ఆరోగ్య వ్యవస్థలో అవస్థలు
కానీ, దీనికి మరో కోణం కూడా ఉంది. ఈ విధ్వంసం భారతదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం, నిధుల కేటాయింపులో ఉన్న లోటుపాట్లను బయటపెట్టింది. చికిత్స దొరకక మరణిస్తున్న వారు, ఆసుపత్రుల బయట కనిపించిన హృదయ విదారక దృశ్యాలు భారతదేశ ఆరోగ్య రంగంలో ఉన్న మౌలిక సదుపాయాల అసలు చిత్రాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. "భారతీయ ప్రజారోగ్య రంగం ఎప్పుడూ సక్రమంగా లేదు. ఖర్చు భరించగలిగే వాళ్ళు ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడుతుండగా, పేద వారు మాత్రం కనీసం డాక్టర్ అపాయింట్మెంట్ కూడా దొరకక ఇబ్బంది పడుతున్నారు" అని ఒక నిపుణుడు అన్నారు.

 
ఇటీవల పేద వర్గాల వారి కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పధకాలు, ఉచిత మందుల పంపిణీ పథకాలు పెద్దగా ఉపయోగపడటం లేదు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని గాని, ఆసుపత్రులను గాని పెంచేందుకు గత కొన్ని దశాబ్దాలుగా పెద్దగా ప్రయత్నాలు జరగలేదు.

ప్రజారోగ్యానికి కేటాయింపులు ఎంత?
భారతదేశంలో గత ఆరు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కూడా ప్రజారోగ్యంపై కేవలం స్థూల జాతీయ ఉత్పత్తిలో 3.6 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ఇది అయిదు బ్రిక్స్ దేశాలతో పోలిస్తే అతి తక్కువ మొత్తం.
 
2018లో వైద్య రంగం పై బ్రెజిల్ 9.2 శాతం, దక్షిణ ఆఫ్రికా 8.1 శాతం, రష్యా 5.3 శాతం, చైనా 5 శాతం వెచ్చించాయి. అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశ వైద్య రంగంపై వెచ్చించే మొత్తం కాస్త ఎక్కువే. 2018లో అమెరికా ఆ దేశ వైద్య రంగం పై 16.9 శాతం ఖర్చు పెడితే, జర్మనీ 11.2 శాతం వెచ్చించింది. శ్రీలంక, థాయిలాండ్ లాంటి చిన్న దేశాలు కూడా 3.76 శాతం, 3.79 శాతం వైద్య రంగం పై వెచ్చిస్తున్నాయి. ఇది భారతదేశం కంటే ఎక్కువ.
 
భారతదేశంలో ప్రతి 10,000 జనాభాకు 10 కంటే తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఐదుగురు కంటే తక్కువ మంది ఉన్నారు. కరోనావైరస్ వేవ్ అరికట్టడానికి గత సంవత్సరం చాలా మంది నిపుణుల కమిటీలు సన్నద్ధమయ్యాయి. అప్పుడే ఆక్సిజన్, బెడ్స్, మందుల కొరత వారిని కలవరపెట్టింది. "మొదటి వేవ్ తలెత్తినప్పుడే ఈ సెకండ్ వేవ్ గురించి అప్రమత్తమై ఉండాల్సింది. దేశంలో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్‌ నిల్వలు ఎంతున్నాయో పరిశీలించి వాటి ఉత్పత్తిని పెంచి ఉండాల్సింది" అని మహారాష్ట్ర మాజీ ఆరోగ్య కార్యదర్శి మహేష్ జగడే అన్నారు. ఇండియాలో డిమాండుకు తగినంత ఆక్సిజన్ ఉన్నప్పటికీ దాని రవాణా సమస్యాత్మకంగా ఉందని చాలా మంది అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ముందే చక్కదిద్ది ఉండవలసిందని నిపుణులు అంటున్నారు.

ఇప్పుడేం చేస్తున్నారు?
ఆక్సిజన్ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పారిశ్రామిక ఆక్సిజన్ వాడకాన్ని నిలిపేసింది. కానీ, ఇదంతా చాలా మందిరోగులు ఆక్సిజన్ కొరతతో మరణించాక చేసింది. "దీని వల్ల చాలా మంది రోగుల కుటుంబ సభ్యులు ఆక్సిజన్ కోసం బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవడానికి లైన్లలో నిల్చుని కొన్ని వేల రూపాయిలు ఖర్చు పెడుతున్నారు" అని డాక్టర్ లహరియా చెప్పారు.

 
అయితే, డబ్బులు ఖర్చు పెట్టగలిగే స్థోమత ఉన్నవారు ఎక్కువ డబ్బులు వెచ్చించి రెమ్‌డెసివిర్‌, టోకిలీజుమాబ్ లాంటి మందులు కొనుక్కుంటున్నారు. జనవరి ఫిబ్రవరిలో ఈ మందులకు డిమాండు తగ్గిపోయిందని రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి చేసే ఒక మందుల సంస్థ ఉద్యోగి చెప్పారు. "ప్రభుత్వం వీటి ఆర్డర్ పెట్టి ఉంటే మేము ఈ మందులను నిల్వ చేసి సిద్ధంగా ఉంచేవాళ్ళం. మేమిప్పుడు వీటి ఉత్పత్తిని పెంచాం. కానీ, వీటి డిమాండు తీవ్రంగా పెరిగి పోయింది" అని చెప్పారు.

 
కానీ, కేరళ మాత్రం ఈ పరిస్థితికి పూర్తిగా సన్నద్ధమై ఉంది. గత అక్టోబరు నుంచే ఆ రాష్ట్రం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టడంతో కేరళలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఫతాహుద్దీన్ చెప్పారు. కోవిడ్ చికిత్సలో వాడే మందులను కూడా తగినంత నిల్వలు తెచ్చిపెట్టామని చెప్పారు. రానున్న వారాల్లో కేసులు పెరిగితే అమలు చేయాల్సిన ప్రణాళికతో కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలను అవలంబించాల్సి ఉండాల్సిందని జగడే అన్నారు. కానీ, సెకండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాలకు, చిన్న పట్టణాలకు వేగంగా వ్యాపిస్తుండటంతో సమయం మించిపోతుంది.

వ్యాప్తి నిరోధక చర్యలేవీ...
వేగంగా వ్యాపించే ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు కనిపెట్టడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం ముఖ్యమైన అడుగు. గత సంవత్సరం ఇండియన్ సార్స్ సిఓవి-2 జీనోమిక్ కన్సార్టియా (ఐఎన్‌ఎస్‌ఏ‌సిఓజి)ని స్థాపించి దేశంలో ఉన్న 10 లేబొరేటరీలను అనుసంధానం చేసింది. కానీ, ఈ గ్రూపు తరచుగా నిధుల కొరతతో ఇబ్బంది పడింది. ఈ మ్యుటేషన్ల గురించి భారతదేశం చాలా ఆలస్యంగా గుర్తించడం మొదలుపెట్టిందని డాక్టర్ జమీల్ అన్నారు. ఇక్కడ సీక్వెన్సింగ్ ప్రయత్నాలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే మొదలయ్యాయి.

 
"యూకే లో కోవిడ్ పీక్ సమయంలో 5-6 శాతం శాంపిళ్లను సీక్వెన్సింగ్ చేస్తూ ఉండగా ప్రస్తుతానికి భారతదేశంలో కేవలం 1 శాతం శాంపిళ్లను మాత్రమే సీక్వెన్స్ చేస్తోంది. కానీ, రాత్రికి రాత్రి ఈ సామర్ధ్యం పెంచడం వీలయ్యే పని కాదు" అని ఆయన అన్నారు. భారతదేశం మాత్రం కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సినేషన్ పై ఆశలు పెట్టుకుంది. "ఇప్పటికే ముక్కలైన ప్రజారోగ్య వ్యవస్థను కొన్ని నెలల్లో పటిష్టపరచడానికి వీలయ్యే మార్గం ఏమి లేదని ఏ ప్రజారోగ్య నిపుణుడిని అడిగినా చెబుతారు" అని దిల్లీలో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించే ఒక మహిళ బీబీసీ తో అన్నారు.

 
కోవిడ్ ఎదుర్కోవడానికి జనాభాకు ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా వ్యాక్సీన్ ఇవ్వడమే ఉత్తమమైన మార్గం. దాని వల్ల ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం తగ్గి, వైద్య వ్యవస్థ పై ఒత్తిడి తగ్గుతుందని ఆమె అన్నారు. భారతదేశం జులై నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సీన్ ఇవ్వాలని భావించింది. "కానీ, ఈ వ్యాక్సీన్ నిర్వహణా కార్యక్రమానికి కూడా సరైన ప్రణాళిక చేయలేదు" అని లహరియా అన్నారు. వ్యాక్సీన్ నిల్వలు లేకుండానే భారత ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సీన్ తీసుకునే అనుమతినిచ్చింది.

 
దేశంలో 100 కోట్లకు పైగా జనాభా ఉండగా ఇప్పటి వరకు కేవలం 20. 6 లక్షల మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నారు. అందులో 10.24 కోట్ల మందికి సింగిల్ డోసు లభించింది. 45 ఏళ్ళు నిండిన వారందరికీ వ్యాక్సీన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వానికి 60.15కోట్ల వ్యాక్సీన్ డోసులు అవసరం. దేశంలో 18-44 సంవత్సరాలు నిండిన వారు 60.22 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ వ్యాక్సీన్ ఇవ్వాలంటే 1.2 బిలియన్ డోసులు అవసరం. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి కూడా వెనక్కి వెళ్లి, భారతదేశం వ్యాక్సీన్ ఎగుమతులను రద్దు చేసింది.

 
బయోలాజికల్ ఇ, హఫ్కీన్ ఇన్‌స్టిట్యూట్ లాంటి సంస్థలను కూడా వ్యాక్సీన్ ఉత్పత్తి చేసేందుకు అనుమతినిచ్చింది. కోవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి కూడా ఉత్పత్తి చేసేందుకు 60.9 కోట్ల ధన సహాయాన్ని కూడా చేసింది. "కానీ, ఈ నిధులు ఇంకాస్త ముందుగా ఇచ్చి ఉండాల్సింది. దీంతో మరి కొన్ని జీవితాలు కాపాడి ఉండేవాళ్ళం‘‘ అని డాక్టర్ లహరియా అన్నారు. "ఇప్పుడు ఈ వ్యాక్సీన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి తగినన్ని వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇంతలో కొన్ని లక్షల మందికి కోవిడ్ సోకే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.

 
ప్రపంచ ఔషధాగారం అని చెప్పుకునే భారతదేశంలో వ్యాక్సిన్లు మందుల కొరత ఏర్పడటం విచారకరమని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం మనం పోరాడేందుకు ఆఖరు సారి వచ్చే మహమ్మారి కాదు. మనం వైద్య రంగం పై అధికంగా వెచ్చించాల్సిన అవసరం ఉందని చెప్పడానికి ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనేందుకు ఒక పిలుపు లాంటిదని డాక్టర్ లహరియా అన్నారు. "భవిష్యత్తులో విధానాలు ఊహించిన దాని కంటే కూడా ముందుగానే మహమ్మారి రావచ్చు" అని ఆయన అన్నారు.