గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (18:08 IST)

టీనేజీ అబ్బాయిలకు లింగ సమానత్వంపై శిక్షణనిస్తే మహిళలపై వేధింపులు తగ్గుతాయా?

ప్రపంచవ్యాప్తంగా రోజూ సగటున 137 మంది మహిళలు భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. టీనేజీ అబ్బాయిల ఆలోచనా విధానాన్ని మార్చడం ద్వారా మహిళలపై హింసను అరికట్టేందుకు భారత్‌లో 'యాక్షన్ ఫర్ ఈక్వాలిటీ ప్రోగ్రాం' ప్రయత్నిస్తోంది. 18 ఏళ్ల ఓంకార్ గతంలో తన చెల్లి రుతు మీద తరచూ కోపాన్ని ప్రదర్శించేవాడు. కానీ, ఇప్పుడు అతడు పూర్తిగా మారిపోయాడు. తన చెల్లితో చాలా గౌరవంగా, ప్రశాంతంగా మాట్లాడుతున్నాడని అతని తల్లి కాంత చెప్పారు.

 
అతడు ఇంట్లో చాలా పనుల్లో తల్లికి, చెల్లికి సాయం చేస్తాడు. "టీ పెడతాడు. ఇల్లు ఊడ్చుతాడు. సామాన్లను సర్దుతాడు. చుట్టుపక్కల ఉండే కుర్రాళ్లతో పోలిస్తే, మా అబ్బాయి పూర్తిగా మారిపోయాడు" అని కాంత చెప్పారు. లింగ సమానత్వంపై యువకుల్లో అవగాహన కల్పించేందుకు మహారాష్ట్రలోని పుణెలో యాక్షన్ ఫర్ ఈక్వాలిటీ (ఏఎఫ్‌ఈ) అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

 
ఈ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న 5,000 మందికి పైగా టీనేజీ కుర్రాళ్లలో ఓంకార్ ఒకరు. 2011లో ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్ (ఈసీఎఫ్) ప్రారంభించిన ఏఎఫ్‌ఈ కార్యక్రమం మహిళలపై హింసను అరికట్టేందుకు టీనేజీ అబ్బాయిలకు అవగాహన కల్పిస్తోంది. లింగ సమానత్వం కోసం పోరాటం అనేది పరుగులు పెట్టే నదీ ప్రవాహంతో పోటీపడటంలాంటిదని ఈసీఎఫ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టినా ఫుర్టాడో అంటున్నారు.

 
"మీ హక్కుల కోసం మీరు పోరాడటం చాలా ముఖ్యమని మహిళలకు చెబుతున్నాం. అందుకోసం, కొంతమంది మహిళలను చైతన్యవంతుల్ని చేయగలిగాం" అని ఆమె చెప్పారు. ఏఎఫ్‌ఈలో 13 నుంచి 17 ఏళ్ల వయస్సు అబ్బాయిలకు లింగ సమానత్వం, మహిళల పట్ల వివక్ష, హింస లాంటి అంశాలపై 43 వారాల పాటు అవగాహన కల్పిస్తారు. అందుకోసం ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించారు.

 
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, మహిళలపై హింస ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉంది. ప్రపంచంలో 70 శాతం మంది మహిళలు తమ భాగస్వామి చేతుల్లో భౌతికంగా లేదా లైంగికంగా హింసను ఎదుర్కొంటున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 2012లో దిల్లీలో 23 ఏళ్ల విద్యార్థి (నిర్భయ) మీద సామూహిక అత్యాచారం ఘటన తర్వాత మహిళలపై హింసపై తీవ్రమైన చర్చ జరిగింది. ఆ తరువాత ఇటీవల #MeToo ఉద్యమం వచ్చింది.

 
అందుకే ఇలాంటి అవగాహనా కార్యక్రమాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధానంగా, అల్పాదాయ సంప్రదాయిక సమాజంలో అబ్బాయిలు, అమ్మాయిలు పాత కాలపు ఆచారాలను పాటిస్తుంటారు. ఫలానా పని మహిళలే చేయాలి, ఫలానా పనిని పురుషులు మాత్రమే చేయాలన్న ఆలోచనతో ఉంటారు. మహిళలను మాటలతో, చేతలతో వేధిస్తుంటారు.

 
18 ఏళ్ల అక్షయ్ 2014లో ఏఎఫ్‌ఈ కార్యక్రమంలో చేరాడు. తరువాత తన ఇద్దరు సోదరులను కూడా చేర్పించాడు. ఇప్పుడు, సమాజంలో ఇతర అబ్బాయిలకు ఆదర్శంగా మారాడు. ఓంకార్ తల్లిలాగే, అక్షయ్ తల్లి సుజుత కూడా తన కుమారుడి ప్రవర్తనలో చక్కని మార్పు వచ్చిందని చెప్పారు. "మావాడు ఒకప్పుడు చాలా భిన్నంగా ఉండేవాడు. ఇంట్లో చిన్న పని కూడా చేసేవాడు కాదు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఇంట్లో చాలా పనులు చేస్తున్నాడు. వాడు మారడమే కాదు, తన తమ్ముళ్లను కూడా మార్చేశాడు" అని ఆమె వివరించారు.

 
అక్షయ్, ఓంకార్ ఇంటి చుట్టుపక్కల ఉండే చాలా మంది అబ్బాయిలు 14, 15 ఏళ్ల వయసులోనే మద్యానికి అలవాటు పడుతున్నారు. కొందరు యుక్త వయసు వచ్చేసరికే మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. దేశ వ్యాప్తంగా అల్పాదాయ వర్గాలలో మద్యపానం విస్తృతంగా వ్యాపించింది. మద్యానికి బానిసలయ్యే పురుషులు తమ భార్యలను, ఇతర బాలికలను వేధించే అవకాశం ఉంది. ఇది మహిళలను తీవ్రంగా ఇబ్బందిపెట్టే సమస్య.

 
మద్యం తాగిన వాళ్లు వీధుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లోనూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. మహిళలను వేధిస్తుంటారు. అలాంటి వారి కారణంగా కొన్ని ప్రాంతాల్లో బాలికలు బయట ఆడుకోవడానికి కూడా భయపడతారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండదన్న అభిప్రాయంతో ఫిర్యాదు చేసేందుకు కూడా మహిళలు, బాలికలు వెనకడుగు వేస్తుంటారు.

 
మహిళలపై లైంగిక వేధింపులు, హింసను అరికట్టడంలో శిక్షణ పొందిన ఓంకార్, అక్షయ్‌లు బాధితులకు సాయం అందిస్తున్నారు. ఓసారి ఫూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడుతున్నాడు. అది చూసిన అక్షయ్ తన స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లారు. మద్యం తాగిన వ్యక్తిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి, బాధితురాలితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ‘‘అతడిని పోలీసులు తీసుకెళ్లి కొన్ని రోజుల పాటు కౌన్సెలింగ్ ఇప్పించారు. ఇప్పుడు, అతడు పూర్తిగా మారిపోయాడు. అలా అనేక కుటుంబాల్లో కలహాలు, హింస లేకుండా చేయగలుగుతున్నాం’’ అని అక్షయ్ చెబుతున్నారు.

 
"ఒకప్పుడు అమ్మాయిలు చాలా బలహీనులని, బయటకు వెళ్లేందుకు భయపడతారని అనుకునేవాడిని. కానీ, వారు అలా భయపడటానికి మన పితృస్వామ్య వ్యవస్థే కారణమన్న విషయాన్ని తర్వాత గ్రహించాను. అప్పటి నుంచి వారిని గౌరవించడం మొదలుపెట్టాను" అని అక్షయ్ చెప్పారు. ఏఎఫ్‌ఈ కార్యక్రమం ద్వారా తాను తెలుసుకున్న విషయాలను ఓంకార్ ఇతర యువకులకు కూడా చెబుతున్నాడు. ఒక స్నేహితుడితో కలిసి ఆయన మరో 10 మంది అబ్బాయిలకు అవగాహన కల్పిస్తున్నాడు. స్త్రీలు, పురుషులు సమానమేనని, అమ్మాయిలను వేధించకూడదని, అవసరమైనప్పుడు వారికి సహాయం చేయాలని చెబుతున్నాడు.

 
అవగాహన కార్యక్రమం ప్రారంభంలో, బాలికలు అడిగినప్పుడు లేదా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే అబ్బాయిలు సహాయం అందించాలని చెబుతారు. పరిస్థితి శ్రుతి మించకుండా చూసేందుకు అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తారు. ఓసారి అక్షయ్ తన ఇంటికి సమీపంలో ఓ అమ్మాయికి బాల్య వివాహం జరుగుతుండగా అధికారులకు, మహిళా సంఘాలకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆ పెళ్లిని అడ్డుకున్నారు.

 
ఈసీఎఫ్ లాగే, ప్రోముండో అనే సంస్థ పలు దేశాల్లో లింగ సమానత్వంపై పురుషుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. 1997లో బ్రెజిల్‌లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం వాషింగ్టన్ డీసీ కేంద్రంగా భారత్, బ్రెజిల్, అమెరికా సహా 25 దేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.