సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (10:59 IST)

శబరిమల కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ

శబరిమల కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే, ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయడాన్ని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఇద్దరు న్యాయమూర్తులైన జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 3:2 నిష్పత్తిలో శబరిమల కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. పార్శీ మహిళలను ఘోరీల్లోకి అనుమతించరని రాజ్యాంగ ధర్మాసనం గుర్తుచేసింది. అదేసమయంలో మతాలపై చర్చ జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, అన్ని రివ్యూ పిటిషన్లపై విచారణను కూడా విస్తృత ధర్మాసనానికి కోర్టు బదిలీ చేసింది. 
 
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళల ప్రవేశంపై ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఎత్తివేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ 2018 సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పదుల సంఖ్యలో రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.
 
ఈ పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి ఫిబ్రవరి 6వ తేదీన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. గురువారం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై తీర్పు వెలువరించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం ఈ నాటిది కాదు. 
 
మహిళల హక్కులకు, భక్తుల విశ్వాసాలకు, కోర్టు తీర్పులకు, ప్రభుత్వ నిర్ణయాలకు నడుమ ఈ వివాదం ఏళ్లుగా నలుగుతోంది. ఆలయంలోకి 10-50 మధ్య వయసు మహిళలు ప్రవేశించకుండా 1991లో కేరళ హైకోర్టు నిషేధం విధించింది. దీనిపై వివాదం మొదలైంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్నీ అనుమతించాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. దీంతో మతాలపై చర్చజరగాలని పేర్కొంటూ ఈ కేసును ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కోర్టు బదిలీ చేసింది.