మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 24 సెప్టెంబరు 2020 (13:19 IST)

బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?

ప్రొద్దుటూరు.. ఓ వ్యాపార కూడలి. పత్తి నుంచి పుత్తడి వరకూ ఇక్కడ భారీ స్థాయిలో వ్యాపారం సాగుతుంది. వస్త్ర వ్యాపారంలో కూడా ఈ పట్టణానికి ప్రముఖ స్థానం ఉంది. బంగారం మార్కెట్‌ విషయంలో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖమైన స్థాయికి చేరింది ప్రొద్దుటూరు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లను తలదన్నేలా ఈ పట్టణం పేరు గడించింది. అందుకే, ప్రొద్దుటూరును రెండో ముంబై అని కూడా పిలుస్తుంటారు. ప్రొద్దుటూరుకు ఈ ప్రత్యేకత ఎలా వచ్చిందో తెలియాలంటే వందేళ్ల చరిత్రను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

 
కేంద్ర ప్రభుత్వం నుంచే బంగారం కొన్నారు
ప్రొద్దుటూరులోని కొన్ని వీధుల్లో పూర్తిగా బంగారం అమ్మకాలే సాగుతూ ఉంటాయి. ఎటూ చూసినా ఆభరణాల తయారీదారులు కనిపిస్తుంటారు. ప్రొద్దుటూరుకు బంగారం కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల నుంచి కూడా జనం వస్తుంటారు.

 
దక్షిణ భారతదేశంలో బంగారం అమ్మకాల విషయంలో ప్రొద్దుటూరు ప్రథమస్థానంలో ఉంటుందని స్థానికులు చెప్పుకుంటుంటారు. అందుకు తగ్గట్టుగానే వివిధ సందర్భాల్లో ప్రొద్దుటూరు పేరు దేశమంతా వినిపించింది.

 
''1979లో కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న బంగారంలో కొంత భాగం వేలం వేసింది. ఆర్‌బీఐ ద్వారా టెండర్లలో బంగారం అమ్మకాలు జరిపింది. ప్రభుత్వం నుంచి బంగారం కొనుగోళ్లు చేస్తే, పూర్తిగా నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని కొందరు వెనకడుగు వేశారు. లావాదేవీలు పూర్తిగా బ్యాంకుల ద్వారానే సాగాలి. కానీ, అలాంటి సమయంలోనూ కేంద్రం వేలం వేసిన బంగారంలో 70 శాతం ప్రొద్దుటూరు వ్యాపారులు కొనుగోలు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దేశమంతా ఆశ్చర్యపోయేలా, అప్పట్లోనే ప్రొద్దుటూరు గురించి పెద్ద చర్చ సాగింది. అంతకుముందే బంగారం వ్యాపారంలో పలువురు లైసెన్సులు పొంది ఉండడంతో ప్రొద్దుటూరును సిరిపురిగా పలువురు ప్రస్తావించేవారు" అని ఏపీ గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.రామ్మోహన్ వివరించారు.

 
స్వాతంత్ర్యానికి ముందు నుంచే
ప్రొద్దుటూరుని కొందరు స్వర్ణపురి అంటారు. బంగారం వ్యాపారానికి ఇక్కడ స్వాతంత్ర్యానికి పూర్వమే బీజాలు పడ్డాయి. అప్పట్లో ప్రొద్దుటూరు ప్రాంతంలో నీలిమందు వ్యాపారం జరిగేది.

 
ఆ వ్యాపారాల్లో ఉన్నవారు బర్మా (మయన్మార్), సిలోన్, ముంబయి సహా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారని ప్రొద్దుటూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వనం దత్త ప్రసాద్ శర్మ బీబీసీతో అన్నారు.

 
నీలిమందు తర్వాత పత్తి వ్యాపారంలో కూడా ప్రొద్దుటూరు ప్రాంతీయులు నైపుణ్యం సాధించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. తమ ప్రాంతం నుంచి సరుకును ఇతర మార్కెట్లకు తరలించిన క్రమంలో అక్కడి నుంచి చౌకగా బంగారం కొనుగోలు చేసి తీసుకురావడం ద్వారా ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం ఎక్కువైందని వివరించారు.

 
రానురాను ప్రొద్దుటూరులో అన్ని వ్యాపారాల కన్నా బంగారానికే ఆదరణ పెరిగింది. నాణ్యమైన బంగారం అమ్మడంతో పాటుగా ధరల విషయంలో కూడా ప్రొద్దుటూరు అందుబాటులో ఉండటంతో అనేక మంది ఇక్కడే కొనుగోళ్లకు మొగ్గుచూపుతూ వచ్చారు. వ్యాపారులు కూడా బంగారం అమ్మకాల వైపే మొగ్గుచూపారు. ప్రస్తుతం అమ్మవారి శాల వీధిగా పిలుస్తున్న ప్రాంతమంతా పూర్తిగా బంగారం దుకాణాలే కనిపిస్తాయి.

 
పని నాణ్యంగా ఉంటుందన్న పేరు
బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరుకు ప్రత్యేక గుర్తింపు రావడంలో బంగారం పనిచేసేవారిదే పెద్ద పాత్ర అని స్థానికులు, వ్యాపారులు కూడా అంగీకరిస్తారు. నాణ్యమైన బంగారాన్ని నైపుణ్యంతో ఆభరణాలు తయారు చేస్తూ ప్రొద్దుటూరు స్వర్ణకారులు అందరి దృష్టిని ఆకర్షించారు. వివిధ రకాల మోడళ్లలో బంగారం వస్తువులను తయారుచేస్తూ గుర్తింపు పొందారు.

 
ప్రొద్దుటూరు బంగారం మార్కెట్ విస్తరణలో తయారీదారుల పాత్ర ప్రధానమైనదని బంగారం వర్తకుల సమాఖ్య అధ్యక్షుడు బూశెట్టి రామ్మోహన్ రావు బీబీసీతో అన్నారు. బంగారం నాణ్యతలో రాజీపడకుండా ప్రొద్దుటూరు వ్యాపారులు చాలా కాలం క్రితం నుంచే 92% బంగారం అమ్ముతున్నారు. ప్రస్తుతం హాల్ మార్క్ గురించి చర్చ సాగుతుండగా కొన్ని దశాబ్దాల క్రితమే ప్రొద్దుటూరులో 93 మార్క్ టచ్‌తో ఆభరణాలు తయారైనట్లు వ్యాపారులు చెబుతున్నారు.

 
బంగారం అమ్మకాల్లోనే కాకుండా ఆభరణాల తయారీ విషయంలోనూ ప్రొద్దుటూరు మార్కెట్‌కు ప్రత్యేకత ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రావడానికి అదే ప్రధాన కారణం. ఆభరణాలను సకాలంలో, అందంగా తీర్చిదిద్ది ఇస్తారన్న పేరు ఇక్కడివారికి ఉంది.

 
అయితే.. ప్రస్తుతం రెడీమేడ్ ఆభరణాల వైపు జనం ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. నాణ్యత కన్నా నగిషీలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే ప్రొద్దుటూరు బంగారం మార్కెట్‌లో స్థానికులు ఆభరణాలు తయారీ చేయడం తగ్గిపోతోంది. మంచి నైపుణ్యం ఉన్న స్వర్ణకారులు కూడా ఖాళీగా ఉంటున్నారు. మార్కెట్ నిండా తాము కూడా రెడీమేడ్ ఆభరణాలను నింపాల్సి వస్తోందని స్థానిక వ్యాపారులు అంటున్నారు.

 
ప్రత్యేకత కోల్పోతోంది
ప్రొద్దుటూరు బంగారం వ్యాపారం ఒకప్పుడు స్థిరంగా ఉండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని ప్రొద్దుటూరు స్వర్ణకారుల సంఘం కార్యదర్శి గౌస్ పీర్ అంటున్నారు. అనేక ప్రాంతాలకు భిన్నంగా ప్రొద్దుటూరులో కేవలం విశ్వ బ్రాహ్మణులు మాత్రమే కాకుండా ఇతర కులాలకు చెందిన వారు కూడా స్వర్ణకార వృత్తిలో ఉండటం విశేషం. ముస్లింలు, తోటక్షత్రియ వర్గాలు కూడా బంగారు ఆభరణాల తయారీలో ప్రావీణ్యత గడించారు. రాళ్ల పనిలో, సాదాపనిలో బంగారు ఆభరణాల తయారీలో కీలకమైన ఇలా వివిధ విభాగాల్లో నైపుణ్యం గలవారు ప్రొద్దుటూరులో ఉన్నారు.

 
''కరోనాతో పాటుగా బంగారం ధరలు అస్థిరంగా మారుతుండడం వల్ల స్వర్ణకారుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. కరోనాతో తగిన వైద్యం అందకపోవడంతో 20 మంది వరకూ ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రొద్దుటూరులో కేవలం ఈ వృత్తి మీద ఆధారపడి 6,000 మంది జీవిస్తున్నాం. అనేక కుటుంబాలకు ఆధారంగా ఉన్న స్వర్ణాభరణాల తయారీలో కష్టకాలం దాపురించింది. తిరుమల వెంకటేశ్వర స్వామికి, కనకదుర్గ అమ్మవారికి కూడా కిరీటాలు చేసిన ఘనత ఉన్న ప్రొద్దుటూరు స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఓవైపు ఉపాధి తగ్గిపోవడం, మరోవైపు మిషనరీతో ఆభరణాలు తయారీ చేసే అవకాశం లేకపోవడంతో కొత్తతరం ఈ వృత్తికి దూరమవుతున్నారు. భవిష్యత్తులో ప్రొద్దుటూరికి బంగారంతో ఉన్న బంధం తెగిపోతుందా అనే ఆందోళన కనిపిస్తోంది'' అని గౌస్ పీర్ బీబీసీతో అన్నారు.

 
బంగారం కోసం డ్రైనేజీల్లో వెతుకులాట
ప్రొద్దుటూరులో బంగారు ఆభరణాల తయారీదారులతో కళకళలాడిన బజార్లలో డ్రైనేజీలను శుభ్రం చేస్తూ కొందరు జీవనం సాగిస్తున్నారు. ఈ పనిని మసికట్టుగా పిలుస్తారు. బంగారం తయారు చేసిన తర్వాత ఆ మట్టి, ఇతర రూపాల్లో కొద్ది మేర బంగారం వృథాగా పోతుందని భావిస్తారు. అలాంటి వృథా అయిన కొద్దిపాటి బంగారాన్ని సేకరించేందుకు కొందరు దళిత వర్గాలకు చెందిన వారు ఈ మసికట్టు పని సాగిస్తున్నారు.

 
బంగారం షాపులు, తయారీ కేంద్రాల వద్ద బజార్లు మొత్తం ఊడ్చి, డ్రైనేజీల్లో మట్టిని కూడా సేకరించి దానిలో బంగారాన్ని వెతుకుతూ ఉంటారు. అలా చేస్తూ కొద్ది పాటి ఆదాయంతో జీవితాన్ని వెళ్లదీస్తున్న కుటుంబాలు 50కి పైగా ఇక్కడ ఉన్నాయి.

 
''తెల్లవారు జామునే బంగారం అంగళ్ల దగ్గరకు వెళ్లి మట్టి సేకరిస్తాం. దానిని ఎండబెట్టిన తర్వాత అనేకసార్లు ఒడపోస్తూ అందులో ఏదైనా కొద్ది భాగం బంగారం ఉంటే దానిని సేకరిస్తాం. గతంలో ఆదాయం కొంత ఉండేది. క్రమేపీ తయారుదారులే ఈ మట్టిని సేకరించి, కమిషన్ పద్ధతిలో మాకు అప్పగిస్తున్నారు. గ్రాము బంగారం సేకరిస్తే మాకు కొంత కమిషన్ వస్తుంది. కొన్ని సార్లు అలా దొరుకుతుంది. ఇంకొన్ని సార్లు మా ప్రయత్నాలు వృథానే అవుతున్నాయి. మా తాతలు, తండ్రుల నాటి పని కాబట్టి అందులోనే కొనసాగుతున్నాం. కానీ, మా కుటుంబ పోషణ భారంగా మారుతోంది. కరోనాలో లాక్‌డౌన్‌తో షాపులు మూసేస్తున్న సమయంలో మాకు ఆకలి తప్పడం లేదు'' అని మసికట్టు కార్మికుడు నాగేంద్ర కుమార్ బీబీసీతో అన్నారు.

 
రానురాను మారుతున్న పోటీ వాతావరణంలో ప్రొద్దుటూరు స్వర్ణకారుల పరిస్థితి దిగజారుతోంది. మసికట్టు కార్మికులకు కూడా కష్టాలు పెరుగుతున్నాయి. ప్రొద్దుటూరు ప్రత్యేకతను నిలుపుకోవాలంటే మళ్లీ చేతితో తయారయిన బంగారు ఆభరణాలకు ఆదరణ పెరిగితేనే మార్గం ఉంటుంది. లేదంటే మెషీన్లతో ఆభరణాల తయారీలో స్థానికులు నైపుణ్యం పెంచుకోవాల్సి ఉంటుంది.