శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 4 మార్చి 2020 (18:54 IST)

కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనా వైరెస్ లక్షణాలు
ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలకు కరోనావైరస్ విస్తరించింది . అటు తెలంగాణలోనూ, దిల్లీలోనూ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో అసలు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వ్యాధి నుంచి మనల్నిమనం ఎలా కాపాడుకోవాలి ?

 
కరోనావైరస్ లక్షణాలు
కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం.

 
వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు. ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది. వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి.

 
కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది. కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు.

 
సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకినప్పటి నుంచి వ్యాధి బయట పడానికి సుమారు 14 రోజుల సమయం పడుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతుండగా కొందరు పరిశోధకులు మాత్రం 24 రోజుల వరకు సమయం తీసుకుటుందని చెబుతున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
కరోనావైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవాలి. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం ఒక మీటరు నుంచి మూడు మీటర్ల దూరంలో ఉండాలి.

 
ఆ రెండు లక్షణాలతో బాధపడుతున్నవారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా బట్ట అడ్డు పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి. ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతునే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకవద్దు.

 
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు
ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడదు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

 
ఎంత వేగంగా విస్తరిస్తోంది ?
మొదట్లో కేవలం చైనాకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప అన్ని ఖండాలకు విస్తరించింది. రోజూ వందలాదిగా కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. వ్యాధి లక్షణాలును ఇంకా నిర్ధారించని కేసులు ఎన్ని ఉంటాయన్న విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

 
కరోనావైరస్ సోకితే ప్రాణాలతో బయట పడగలమా?
సుమారు 56 వేల మంది రోగుల్ని పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాధి సోకిన వారిలో సుమారు 80 శాతం మందిలో కొద్ది పాటి లక్షణాలు కనపించాయని పేర్కొంది. కేవలం 14 శాతం మందిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండగా, 6 శాతం రోగుల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని తెలిపింది. ఇక ఈ వ్యాధి కారణంగా మరణించిన వారు 1 నుంచి 2 శాతం మంది మాత్రమేనని డబ్ల్యుహెచ్ఓ స్పష్టం చేసింది. అయితే వ్యాధి తీవ్రత రోజు రోజుకూ ముదురుతున్న ఈ పరిస్థితుల్లో ఈ లెక్కలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని కూడా చెప్పలేం.