బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (17:28 IST)

ఇండోపాక్ సరిహద్దుల్లో శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహరా... ఆ అనుభవం ఎలా ఉంటుంది?

వివాదాస్పద కశ్మీర్ భూభాగంలో ఇండియా, పాకిస్తాన్‌లు దాదాపు 10 లక్షల మంది సైనికులను మోహరించాయి. భూమి మీద అత్యధికంగా సైనిక మోహరింపు ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి. ఈ భూమి కోసం గత 70 ఏళ్లలో మూడు యుద్ధాలు జరిగాయి. చాలా ప్రాంతాల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు భారీగా ఆయుధాలు ధరించి చాలా దగ్గరగా పహరా కాస్తుంటారు. ఒక విధంగా ఈ సైనికులు కళ్లతోనే ఒకరిమీద మరొకరు యుద్ధం చేస్తుంటారు. అత్యంత ఉత్కంఠ భరిత పరిస్థితుల్లో వారు విధి నిర్వహణ చేస్తుంటారు. అలాంటివారి అనుభవాలు ఎలా ఉంటాయి? అది తెలుసుకోవడానికి మేం అక్కడి ఇద్దరు సైనికులతో మాట్లాడాం.
 
''మొదట మేం లైట్ మెషీన్‌ గన్లు, మీడియం మెషీన్ గన్లతో ఒకరి మీద మరొకరం కాల్పులు జరుపుతాం. దీని తర్వాత సాధారణంగా మోర్టార్ యుద్ధం సాగుతుంది. ఇటీవలి కాలంలో ఇరువైపులా మందు గుండును ఉపయోగించటం చూశాం. పరిస్థితి ముదిరితే... ఉద్రిక్తతను తగ్గించటానికి మా సీనియర్ కమాండర్లు రంగంలోకి దిగి.. పాకిస్తాన్ కమాండర్లతో మాట్లాడతారు.'' కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ దగ్గర తన సైన్యానికి, పాకిస్తానీ సైన్యానికి మధ్య ఘర్షణల గురించి.. పదవీ విరమణ చేసిన భారత సైనికాధికారి ఒకరు వివరించిన విషయం ఇది.
 
అణ్వాయుధాలు గల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్తాన్‌ దేశాలు.. ఈ వివాదాస్పద ప్రాంతంలో దాదాపు పది లక్షల మంది సైనికులను మోహరించాయి. ఇరు దేశాల సైనికుల మధ్య దూరం చాలా తక్కువగానే ఉంటుంది. శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాల పాటు విధులు నిర్వర్తించటం, తినటం, నిద్రపోవటం ఎలా ఉంటుందనే విషయాన్ని... ఇండియా నుంచి ఒకరు, పాకిస్తాన్ నుంచి ఒకరు - ఇద్దరు మాజీ సైనికాధికారులు బీబీసీకి వివరించారు.
 
''అందరూ శాంతిని ప్రేమిస్తారు. కానీ.. శాంతి అనేది ఒక ఊహాజనిత సిద్ధాంతం. కొన్నిసార్లు శాంతిని సాధించటానికి యుద్ధం చేయాల్సి ఉంటుంది'' అంటారు పాకిస్తాన్ మాజీ సైనికాధికారి. 
 
''నువ్వు చంపాలి లేదా చావాలి. సావధానంగా ఆలోచించటానికి ఏమీ ఉండదు'' అని అంటారు భారత మాజీ సైనికాధికారి.
 
ఘర్షణలు 
''సరిహద్దులో పరిస్థితి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇది ప్రమాదకరం. ఎప్పుడూ మారిపోతుంటుంది. వారి పోస్టుల మీద పై చేయి సాధించటానికి మేం ప్రయత్నిస్తాం. మమ్మల్ని పట్టుకోవటానికి వారు ప్రయత్నిస్తారు'' అని తెలిపారు భారత మాజీ సైనికాధికారి కల్నల్ మురుగనాథన్. ఆయన పూంచ్ సెక్టార్‌లో పనిచేశారు.
 
''ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పైచేయి నిరంతరం మారుతుండే ఈ ఘర్షణ ఎన్నడూ ఆగదు. ఎత్తైన ప్రదేశాన్ని ఆక్రమించిన వారికి ఆ ప్రాంతం మీద ఆధిపత్యం లభిస్తుంది'' అని ఆయన చెప్పారు.
 
కశ్మీర్‌లో పాకిస్తాన్ పాలనలోని భూభాగాన్ని, భారత పాలనలోని భూభాగాన్ని విభజించే నియంత్రణ రేఖ వెంట కాపలా కాయటానికి యువకుడైన మురుగనాథన్ సెకండ్ లెఫ్టినెంట్‌గా విధుల్లోకి వచ్చారు.
 
''అది 1993వ సంవత్సరం. ఆ కాలంలో తీవ్రవాదులను ఇండియాలోకి చొప్పించటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుండేది. సరిహద్దులో వారిని ఆపటం మా విధి. ఎదుటి పక్షం ఎప్పుడైనా కాల్పులు ప్రారంభించిందంటే.. అది తీవ్రవాదులకు కవర్ అందించటానికి చేస్తున్న ప్రయత్నమని మాకు తెలుసు. కాబట్టి మేం మరింత అప్రమత్తంగా ఉంటూ తీవ్రవాదుల కోసం గాలించేవాళ్లం'' అని వివరించారు.
 
అప్రమత్తం 
పాకిస్తాన్ తొలుత తాము తీవ్రవాదులకు కేవలం నైతిక మద్దతు మాత్రమే అందించామని చెప్పింది. అయితే, అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావటంతో భారతదేశం మీద ఉగ్రవాద దాడికి బాధ్యులైన వ్యక్తులు, సంస్థల మీద చర్యలు చేపట్టటానికి అంగీకరించింది.
 
''కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నపుడు నన్ను కశ్మీర్‌లో విధులు నిర్వర్తించటానికి పంపించారు. అయినా మేం పూర్తి అప్రమత్తంగా ఉన్నాం'' అని పాకిస్తాన్ సైనిక మాజీ కల్నల్ ఒకరు బీబీసీతో చెప్పారు. ఆయన తన పేరు వెల్లడించవద్దని కోరారు.
 
పాకిస్తాన్.. తన మాజీ సైనికాధికారుల్లో 26 మంది మినహా మిగతా వారు ఎవరూ మీడియాతో మాట్లాడరాదని ఇటీవల నిషేధించింది. ఆ 26 మందిలో ఒకరితో మాట్లాడటానికి పాకిస్తాన్ సైన్యం ద్వారా బీబీసీ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు.
 
అయితే.. ఒక మాజీ సైనికాధికారి కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో 2006 - 2008 మధ్య బెటాలియన్‌ కమాండింగ్ విధి నిర్వహణలో తన అనుభవాలను పంచుకోవటానికి సంతోషంగా అంగీకరించారు. అయితే.. తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరారు.
 
''కొన్ని (భారత సైనిక) పోస్టులు బయటికి కనిపించకుండా చక్కగా మోహరించి ఉండేవి. కానీ అవి ఉన్న విషయం మాకు తెలుసు. కొన్ని పోస్టులు చాలా దగ్గరగా ఉండేవి. ఒక నిర్దిష్ట ప్రాంతంలో అయితే, భారత - పాకిస్తాన్ పోస్టుల మధ్య కేవలం 25 మీటర్ల దూరం మాత్రమే ఉండేది'' అని ఆయన తెలిపారు.
 
శత్రువుకు ఎదురుగా... 
శత్రువుకు అంత దగ్గరగా జీవించటం చాలా ఒత్తిడికి గురిచేసే విషయం.
 
భారత సైన్యంలో సైనికులు, యువ అధికారులు సరిహద్దులో శత్రువుకు ఎదురుగా సాధారణంగా ఒక నెల లేదా రెండు నెలలు విధుల్లో ఉంటారు.
 
''మా మధ్య దూరం కేవలం 150 మీటర్లు మాత్రమే. వాళ్లు వారి ఆయుధాలను శుభ్రం చేసుకోవటాన్ని నేను చూడగలిగేవాడిని. మరో చోట విధులు నిర్వర్తిస్తున్నపుడు మేం ఉన్న పోస్టు దిగువ ప్రాంతంలో ఉండేది. వాళ్లని నేను చూడలేకపోయినప్పిటికీ.. వాళ్లు మమ్మల్ని నిరంతరం గమనిస్తున్నారని నాకు తెలుసు'' అని కల్నల్ మురుగనాథన్ గుర్తుచేసుకున్నారు.
 
''భయం అనేది సాధారణంగానే ఉన్నప్పటికీ.. నేను స్థిమితంగా ఉండటానికి సైనిక శిక్షణ తోడ్పడింది. నాలోని భయం నేను కమాండ్ చేస్తున్న సైనికులకు కనపడనివ్వకూడదు. ఏం జరిగినా సరే మనం పోస్టును వదలకూడదని వారికి చెప్పేవాడిని'' అని వివరించారు.
 
''భారత సైనికులకు ఎదురుగా ఉన్న ఒక పోస్టులో నేను ఒక రాత్రి ఉన్నాను. నా మీద నా సైనికుల బాధ్యత ఉంది. దానివల్ల ఒత్తిడి ఇంకా ఎక్కువవుతుంది. అయితే.. ఆ వాతావరణానికి ఒకసారి అలవాటుపడితే అది మనల్ని మరింత బలోపేతం చేస్తుంది'' అని పాకిస్తాన్ కల్నల్ చెప్పారు.
 
ఉద్రిక్తతలు... 
బలమైన ఆయుధ సామాగ్రి, మంచి శిక్షణ ఉన్న రెండు సైన్యాలు.. సరిసమానమైన పరస్పర విద్వేషంతో ఉన్నపుడు.. వారిని ఎదురుబొదురుగా మోహరిస్తే.. పరిస్థితులు చాలా సులభంగా అదుపుతప్పుతుంటాయి.
 
''ఒక సందర్భంలో.. పాకిస్తాన్ సైనికుల మెషీన్ గన్ కాల్పుల్లో మా సైనికుల్లో ఒకరు చనిపోయారు'' అని కల్నల్ మురుగనాథన్ తెలిపారు.
 
''బెటాలియన్‌లో విచారం ఆవరించింది. అది ప్రతీకార రూపంలోకి మారింది. మేం అధికారులం వారి ఆగ్రహావేశాలను శాంతింప చేశాం. తప్పకుండా ప్రతిస్పందిస్తామని సైనికులకు హామీ ఇచ్చాం'' అని వివరించారు.
 
''సమీపంలోని ఒక పోస్టు నుంచి ప్రతి దాడికి ప్రణాళిక రచించాం. వారివైపు ప్రాణనష్టం కలిగించాం'' అని చెప్పారు.
 
ఇలా సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుంటాయి.
 
సరిహద్దు పోస్టులో తను ఉన్నపుడు పరస్పర కాల్పుల ఘటన జరగలేదని పాకిస్తాన్ కల్నల్ చెప్పారు. అయితే.. తన సైనికులు తరచుగా భావోద్వేగానికి లోనయ్యేవారని తెలిపారు.
 
''భారత ఆధీనంలోని కశ్మీర్‌లో అత్యాచారాల గురించి మేం దుర్వార్తలు విన్నపుడల్లా.. మా సైనికుల్లో అసహనం ఆగ్రహం పెరిగేవి. వారు మళ్లీ సాధారణ స్థితికి రావటానికి కొన్ని రోజులు పట్టేది'' అని చెప్పారు.
 
వాతావరణం... 
సరిహద్దులో కాపలా కాసే సైనికులకు శత్రువు నుంచే కాదు.. వాతావరణం నుంచీ ముప్పు పొంచే ఉంటుంది. మంచు దుప్పటి కప్పుకుని అందంగా కనిపించే హిమాలయ పర్వత ప్రాంతం సైనికుల పట్ల ఏమంత దయ చూపదు.
 
''న్యుమోనియా, ఛాతీలో అలర్జీలు సైనికులు ఎదుర్కొనే పెద్ద సవాళ్లు. ఒక సైనికుడు జబ్బుపడితే.. అతడిని అక్కడి నుంచి ఖాళీ చేయించటానికి మరో నలుగురి ప్రాణాలను ప్రమాదంలోకి పంపించాల్సి ఉంటుంది'' అంటారు పాకిస్తాన్ అధికారి.
 
భారత సైనికాధికారి కూడా దీనితో ఏకీభవించారు.
 
''అది సముద్రమట్టానికి చాలా ఎత్తైన ప్రాంతం. అదోవిధమైన భయాన్ని కలిగిస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే.. ఒక వ్యక్తి ఆరు రోజుల పాటు ఆ వాతావరణానికి అలవాటు పడేలా శిక్షణనివ్వాల్సి ఉంటుంది'' అని చెప్పారు.
 
''మా సైనికుల మరణాల్లో దాదాపు సగానికి కారణం.. వాతావరణమే. మంచుతిమ్మిరి వంటి వాటివల్ల చనిపోతుంటారు'' అని వివరించారు.
 
పిడుగులు... 
ఈ పర్వతాల్లో వాతావరణం అనూహ్య మలుపులు తిరుగుతుంటుంది.
 
1997లో కల్నల్ మురుగనాథన్ షాంసా బారీ పర్వాతాల మీద విధులు నిర్వహిస్తున్నారు. అది పాకిస్తాన్ పాలనలోని కశ్మీర్‌లో గల లీపా లోయకు పైభాగంలో ఉంటుంది.
 
''దీపావళి రోజున అకస్మాత్తుగా భీకరమైన ఉరుములు, పిడుగులు రావటం నాకు ఇంకా గుర్తుంది. నా పోస్ట్ సముద్ర మట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో ఉంది. అంత ఎత్తులో ఆ ఉరుముల శబ్దం చాలా భయంగొలుపుతుంది'' అని ఆయన తెలిపారు.
 
''అప్పుడు పడిన పిడుగులతో పర్వత శిఖరం మీద మంటలు చెలరేగాయి. మేం వెంటనే మా జనరేటర్లన్నిటినీ ఆపేశాం. మా రేడియో పరికరాలను డిస్కనెక్ట్ చేశాం. మా బంకర్లలోకి వెళ్లిపోయాం. నియంత్రణ రేఖకు అవతల పాకిస్తాన్ సైనికులు కూడా ఇలాగే చేయటం మేం చూశాం'' అని వివరించారు.
 
మద్దతు... 
అది చాలా ఎత్తుపల్లాలు, రాళ్లూ రప్పలతో నిండివున్న పర్వత ప్రాంతం కావటం వల్ల చాలా పోస్టులకు రోడ్లతో అనుసంధానం లేదు. హెలికాప్టర్లు, కంచరగాడిదల సాయంతో అక్కడికి చేరుకుంటుంటారు. అవసరమైన పరికరాలు, ఆయుధాలను కూడా అక్కడికి అలాగే రవాణా చేస్తుంటారు.
 
''కశ్మీర్‌లో రోడ్ చాలా ఇరుకుగా అధ్వాన్నంగా ఉంటుంది. మా వాహనాలు పడిపోవటం వల్ల మరణాలు కూడా సంభవించిన ఘటనలు ఉన్నాయి'' అని చెప్పారు పాకిస్తాన్ కల్నల్.
 
''నేను విధుల్లో ఉన్నపుడు నా సైనికులు ఇద్దరు ఇలా వాహన ప్రమాదాల్లో చనిపోయారు'' అని తెలిపారు.
 
సరిహద్దుల్లో మోహరించటం సైనికులకు చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే వాళ్లు తమ కుటుంబాలకు నెలల తరబడి దూరంగా ఉండాల్సి వస్తుంది. కుటుంబాల్లో ముఖ్యమైన సందర్భాలకు కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది.
 
శత్రువు కాల్పుల పరిధిలో ఉండే పోస్టుల్లో సైనికులను నెల రోజులకు మించి విధుల్లో ఉంచరని.. తరచుగా మారుస్తుంటారని కల్నల్ మురుగనాథన్ చెప్పారు. ఇక 3,500 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండే ప్రాంతాల్లోని పోస్టుల నుంచి బెటాలియన్లను మూడు నెలలకు ఒకసారి మారుస్తుంటారని తెలిపారు.
 
బంకర్లు... 
సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని పోస్టులను సైనిక ఇంజనీర్లు డిజైన్ చేసి.. కాంక్రీట్, స్టీల్ షీట్లను ఉపయోగించి నిర్మిస్తారు. అవి చిన్నపాటి ఆయుధాల కాల్పులను తట్టుకోగలవు.
 
శాశ్వత పోస్టుల్లో చాలా వరకూ అంతర్గతంగా నిర్మించిన బంకర్లు ఉన్నాయి.
 
అయితే.. తాత్కాలిక పోస్టులకు రాళ్లు, ఇసుక బస్తాలతో అదనపు రక్షణ ఏర్పాటు చేస్తారు. వీటిలో కొన్ని బంకర్లలో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మెషీన్ గన్ ఆపరేటర్లకు మాత్రమే చోటు ఉంటుంది.
 
పోటీ... 
పూర్తిస్థాయిలో ఆయుధాలు ధరించిన సంసిద్ధంగా ఉండే శత్రు సైనికులు ఎదురెదురుగా ఉన్నపుడు.. అతి చిన్న విషయాలు కూడా భారీ ప్రమాదాలకు దారితీయగలవు.
 
''ఒకసారి మా సైనికులకు భారత ఔట్‌పోస్ట్‌లో ఒక చిన్న డిష్ కనిపించింది. అది మా సైనికుల కదలికలను పసిగట్టటానికి ఉపయోగించే రాడార్ అని మేం అనుమానించాం'' అని తెలిపారు పాకిస్తాన్ సైనిక అధికారి.
 
''మేం వారిని సమావేశానికి పిలిచాం. వారు పెట్టిన డిష్ ఏమిటని అడిగాం. అది శాటిలైట్ టీవీ డిష్ అని వాళ్లు చెప్పారు. అప్పుడు ఏం చేయటమనేది నాకు అర్థం కాలేదు. దీంతో దానికన్నా పెద్ద శాటిలైట్ డిష్ తెప్పించి మా వైపు సరిహద్దు పోస్ట్‌లో స్థాపించాను'' అని ఆయన వివరించారు.
 
వివాదాస్పద భూభాగం... 
1997లో భారత విభజన సమయంలో కశ్మీర్ వివాదం పుట్టుకొచ్చింది. అది 1989 నుంచి సాయుధ తిరుగుబాటు రూపం తీసుకుంది. ప్రపంచ అట్లాస్ వివరాల ప్రకారం.. కశ్మీర్‌లోని 45.1 శాతం భూభాగం భారత ఆధీనంలో ఉంటే.. 38.2 శాతం భూభాగం పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. మిగతా ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది.
 
ఇండియా - చైనాల మధ్య లదాఖ్ ప్రాంతంలో వివాదాస్పద సరిహద్దు వద్ద గత దశాబ్దంలో సైనిక మోహరింపులు భారీగా పెరిగాయి. అయినప్పటికీ.. 1962 సరిహద్దు యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో హింసాత్మక సంఘర్షణలేవీ చోటుచేసుకోలేదు.
 
కానీ.. భారత - పాకిస్తాన్ సైన్యాలు ఎదురెదురుగా ఉండే నియంత్రణ రేఖ వెంట మాత్రం పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయి.
 
గడచిన 30 ఏళ్లలో సరిహద్దు వెంట సైనిక సంఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన వందలాది మంది సైనికులు చనిపోయారు.
 
''విధి నిర్వహణలో కొన్నిసార్లు చనిపోవాల్సి ఉంటుంది. దేశభక్తి, రెజిమెంట్ ఆత్మగౌరవం, కశ్మీర్ పట్ల నిబద్ధత మాకు స్ఫూర్తినిస్తుంటాయి. సైన్యంలోని సహోదరతత్వం మమ్మల్ని చాలా ధైర్యవంతుల్ని చేస్తుంది'' అని పాకిస్తాన్ కల్నల్ చెప్పారు.
 
భారత కల్నల్‌ది కూడా అదే భావోద్వేగం.. ఆయన మాటల్లో ''అఖండ భారత్ ఆలోచన మాకు స్ఫూర్తి''.