టీమిండియా చీఫ్ కోచ్ ఎంపిక.. ఆగస్టు 15 తర్వాతేనా?
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ కోచ్ ఎంపిక ఇంకాస్త ఆలస్యం కానుంది. మొదట్లో ఈ నెల 13, 14లో ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని భావించినా, ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి కాలేదు. దీంతో ఇండిపెండెన్స్ డే (ఆగస్టు 15) తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని బౌలింగ్ లెజెండ్ కపిల్‌దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామితో కూడిన కమిటీ తెలిపింది.
అయితే దీనికి సంబంధించి కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా.. ఒకే రోజులో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నాయి. చీఫ్ కోచ్ కోసం ఆరు మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం.
''కపిల్ కమిటీ టాప్–3ని ఎంపిక చేస్తుంది. ఇందులో నెంబర్‌వన్‌లో ఉన్న వారితో బీసీసీఐ మాట్లాడుతుంది. అతను అన్ని నిబంధనలకు ఓకే చెబితే కోచ్‌గా బాధ్యతలు అప్పగిస్తుంది'' అని బోర్డు వర్గాలు తెలిపాయి.
మరోవైపు బ్యాటింగ్ కోచ్ రేసులో మాజీ ప్లేయర్లు విక్రమ్ రాథోర్, ప్రవీణ్ ఆమ్రే ముందున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.