మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 12 మార్చి 2022 (16:33 IST)

పుతిన్‌ను అవమానిస్తే అణు యుద్ధం తప్పదా? అణు యుద్ధం ప్రమాదాన్ని అంచనా వేయడం ఎలా?

అణు యుద్ధం వచ్చే అవకాశాలు, దాని తీవ్రత గురించి పరిశోధకులు ఎలా లెక్కలు వేయచ్చు అనేగి విపత్తుల ప్రమాదాల నిపుణులు సేత్ బామ్ వివరించారు. "పోయిన వారం ఒక రోజు నేను ఉదయం లేచి సూర్యుడిని చూద్దామని కిటికీలోంచి చూశాను. న్యూయార్క్ నగరంలో మా కాలనీ అంతా ప్రశాంతంగా కనిపిస్తోంది.


హమ్మయ్య.. ఈ రాత్రి అణు యుద్ధం లేకుండా గడిపేశాం అనుకున్నా." నేను అమెరికాకు చెందిన గ్లోబల్ కాటస్ట్రోఫిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోసం పనిచేస్తాను. అక్కడ మానవాళికి భవిష్యత్తులో ఎదురయ్యే అత్యంత తీవ్రమైన ప్రమాదాల గురించి ఆలోచించడమే నా పని. అయితే, నేను ఆ తర్వాత రోజే అణ్వస్త్రాలతో పరస్పరం దాడులు చేసుకుంటారేమోనని ఆలోచిస్తూ పడుకున్నా.."

 
యుక్రెయిన్ మీద రష్యా దాడి మొదలైన తర్వాత మొదటి కొన్నిరోజులు, అది ఏకంగా అణు యుద్ధానికి దారితీస్తుందేమో అనేంత తీవ్రంగా జరిగింది. అమెరికా యుక్రెయిన్‌కు మద్దతివ్వడంతో అది మా దేశాన్ని కూడా రష్యా అణు దాడులకు ఒక లక్ష్యంగా మార్చేసింది. అదృష్టవశాత్తూ అలా జరగలేదు. యుక్రెయిన్ మీద దాడి లేదా వేరే ఏదైనా ఘర్షణలు అణు యుద్ధానికి దారితీస్తాయా అనేది ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఒక వ్యక్తికి "నేను ఎక్కడైనా సురక్షితమైన ప్రాంతంలో ఉండగలనా?, ఒక సమాజానికి "అణుయుద్ధం తర్వాత ఏర్పడే పరిస్థితులకు ప్రపంచ ఆహార ఉత్పత్తి వ్యవస్థలు సన్నద్ధంగా ఉన్నాయా? అనే ప్రశ్నలు వస్తాయి.

 
అలాంటి పరిస్థితులే వస్తే, అణు యుద్ధం వల్ల ప్రపంచ నాగరికతే నాశనమైపోవచ్చు. ఫలితంగా సుదూర భవిష్యత్తుకు పెనుముప్పు ముంచుకురావచ్చు. అయితే ఒక ఘర్షణ లేదా ఒక ఘటన వల్ల అణు యుద్ధం వస్తుందా అనేది సందిగ్ధంగా ఉంటుంది. నా పరిశోధనలో నేను ప్రధానంగా అణు యుద్ధం ముప్పును లెక్కలువేయడానికి ఉన్న ప్రాధాన్యం, అలా చేయడంలో ఉన్న కష్టాలపై ఫోకస్ పెట్టాను. అయితే అలాంటి అనిశ్చితి వరకూ మనం ఎలా చేరుకోగలం. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలకు దానిని ఎలా అన్వయించుకోగలం.

 
ఏదైనా ప్రతికూల ఘటన జరగబోతుంటే దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాన్ని సాధారణంగా అంచనావేస్తాం. ఒకవేళ ఆ ఘటన జరిగుంటే, దానితో పోల్చి తీవ్రతను లెక్కిస్తాం. సాధారణంగా ప్రమాదాలను అంతకు ముందు జరిగిన అలాంటి ఘటనల గణాంకాలను ఆధారంగా కొలుస్తారు. ఉదాహరణకు కారు ప్రమాదాల మనం చనిపోయే ముప్పును, గతంలో ఎన్నో కారు ప్రమాదాలకు సంబంధించిన డేటా, లేదా ఒక వ్యక్తి ఎలాంటి ప్రాంతంలో ఉన్నారు, వారి వయసెంత లాంటి వివరాలను బట్టి కొలవచ్చు. కారు ప్రమాదాల వల్ల చాలా మంది చనిపోయుంటారు కాబట్టి, వారికి సంబంధించిన ఆ డేటా మనకు ఆ ప్రమాదాల గురించి ఎక్కువ వివరాలను అందిస్తుంది. అలాంటి డేటా లేకుండా ఇన్సూరెన్స్ పరిశ్రమ కూడా తమ వ్యాపారం చేయడం సాధ్యం కాదు.

 
కానీ ఇదే పద్ధతిలో అణు యుద్ధంలో మనం చనిపోయే ముప్పును లెక్కగట్టడం కుదరదు. ఇంతకు ముందు ఒకే ఒక అణు యుద్ధం జరిగింది. అది రెండో ప్రపంచ యుద్ధం. ఇక్కడ ఒక డేటా పాయింట్ అనేది సరిపోదు. దానికితోడు హీరోషిమా, నాగసాకి మీద 77 సంవత్సరాల క్రితం అణు బాంబులు వేశారు. రెండో ప్రపంచ యుద్ధం మొదలైన సమయానికి, అణ్వాయుధాలను కనుగొనలేదు. జపాన్‌లో ఈ బాంబులు పేలినప్పుడు అణ్వాయుధాలు ఉన్న దేశం అమెరికా ఒక్కటే. అక్కడ దానికి ప్రతిఘటన లేదు, పరస్పరం అణు దాడులు జరుగుతాయనే భయమే లేదు. అణ్వాయుధాలు ఉపయోగించడంపై ఎలాంటి నిషేధంగానీ, వాటిని నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందాలుగానీ లేవు.

 
అణు యుద్ధం ముప్పు అంచనా వేయడానికి మనం రెండో ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకోవాలంటే, మనకు తెలిసినవి చాలా పరిమితంగానే ఉంటాయి. అక్కడ మనం ఆధారపడ్డానికి ఒకే ఒక డేటా ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన ఎంతో సమాచారం కూడా ఉంది. ఆ ప్రమాదం గురించి తెలుసుకోవడానికి దాని గురించి తెలిసినవారు మనకు సాయం చేయచ్చు.

 
పాక్షిక అణు యుద్ధానికి కారణమైన ఘటనల్లో క్యూబా అణు సంక్షోభం లాంటివి ఒక ఉదాహరణ. అసలు సిసలు అణు యుద్ధంగా మారకపోతే, ప్రస్తుతం యుక్రెయిన్ మీద రష్య దాడి కూడా అలాంటి మరో ఘటనగా మారవచ్చు. నాకు అలాంటి 74 పాక్షిక ఘటనల గురించి తెలుసు. అణు యుద్ధం వచ్చే అవకాశాల గురించి మా గ్రూప్ చేసిన ఒక అధ్యయనంలో మేం 59 సేకరించాం. మరో అధ్యయనంలో అదనంగా 15 ఘటనలు ఉన్నాయి. వాటిలో గ్రహశకలాల వల్ల జరిగే విస్పోటనాలను పొరపాటున అణు దాడిగా భావించడం లాంటివి కూడా ఉన్నాయి. పబ్లిక్ రికార్డుల్లో లేని కొన్ని ఘటనలు కలుపుకుంటే ఇలాంటివి కచ్చితంగా చాలా ఉంటాయి.

 
ఇలాంటి పరిస్థితుల్లో అణు యుద్ధం జరగవచ్చు అనే రకరకాల సినారియోలను మాపింగ్ చేయడం అనేది మరో కీలకమైన సమాచార వనరుగా మారుతుంది. వివరంగా చెప్పాలంటే ఇందులో రెండు రకాల సినారియోలు ఉంటాయి. ఒకటి అంతర్జాతీయ అణు యుద్ధం, అందులో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినట్లు ఒక పక్షం మొదటిసారి అణు దాడి చేయాలని నిర్ణయిస్తుంది. రెండోది అనుకోకుండా జరిగే అణు యుద్ధం, అందులో ఒక పక్షం తమపై అణు దాడి జరిగిందనుకుని పొరపాటున అణ్వాయుధం ప్రయోగిస్తుంది. ఉదాహరణకు 1983 ఏబుల్ ఆర్చర్ ఘటన. అప్పుడు సోవియట్ సైన్యం పొరపాటున నాటో సైనిక అభ్యాసాలను అణు దాడిగా భావించింది. 1995లో నార్వే రాకెట్ ప్రయోగించినపుడు, సోవియట్ దానిని క్షిపణిగా అనుకుంది.

 
చివరికి కొన్ని నిర్ధారిత ఘటనల సమాచారం మనకు దీనికి ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం యుక్రెయిన్‌లో జరుగుతున్న దాడి వ్లాదిమిర్ పుతిన్ మానసిక స్థితి గురించి ఒక ముఖ్యమైన పారామీటర్. ఆయన స్వభావాన్ని బట్టి, అంటే పుతిన్‌కు కోపం, ఉద్రేకం లాంటివి వచ్చినా అవమానం లాంటి పరిస్థితులు ఎదురైనా అణు యుద్ధం జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇతర కారణాలు చూస్తే రష్యా సైన్యంతో పోరాడ్డంలో యుక్రెయిన్ విజయవంతం అయినా, ప్రత్యక్ష సైనిక ఆపరేషన్లలో నాటో ప్రమేయం మరింత పెరిగినా, తప్పుడు హెచ్చరికలు వచ్చినా అణు యుద్ధం రావచ్చు.

 
వాటి గురించి మనకు ఎంత బాగా తెలుసు... ముఖ్యంగా ఇలాంటి ఘటనలు అణు యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంటుందా అనేది అర్థం చేసుకోడానికి ఇలాంటి వివరాలు మనకు చాలా విలువైనవిగా భావించాలి. పైన చెప్పినవన్నీ అణు యుద్ధం వచ్చే అవకాశాల గురించి చెప్పినవి. కానీ అణు యుద్ధం ప్రమాదాన్ని అంచనా వేయాలంటే మనకు దాని తీవ్రత కూడా తెలియాలి. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. మొదట స్వయంగా ఆ యుద్ధానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. అంటే, ఆ యుద్ధంలో ఎన్ని అణ్వాయుధాలు ప్రయోగించారు, ఎంత పేలుడు పదార్థం వాడారు, ఏయే ప్రాంతాల్లో, ఎంత ఎత్తులో వాటిని ప్రయోగించారు అనేది కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ అణు యుద్ధం వల్ల ప్రాథమికంగా ఎంత ముప్పు ఉంటుంది అనేది నిర్ధరిస్తాయి.

 
అణ్వాయుధాలు ప్రయోగించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది రెండో భాగం. సజీవంగా మిగిలినవారు ఆహారం, బట్టలు, ఆశ్రయం లాంటి కనీస అవసరాలు పొందగలిగారా. అణు బాంబులు పడిన తర్వాత పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయి. అన్ని రకాల ఒత్తిడులు భరించి బతికినవారు, ఆధునిక నాగరికతలో ఉన్నవారిలాగే కనిపించగలిగారా, లేక ఆ నాగరికత కుప్పకూలిందా. అది నాశనం అయ్యుంటే, ప్రాణాలతో ఉన్నవారు లేదా వారి వారసులు దానిని పునర్నిర్మించగలిగారా అనేవి. అణు యుద్ధం వల్ల జరిగిన మొత్తం, దీర్ఘకాలిక హానిని ఈ అంశాలన్నీ నిర్ధరిస్తాయి.

 
చిన్నదే అయినప్పటికీ ఏ అణు యుద్ధం అయినా అది జరిగిన ప్రాంతాలకు పెను విపత్తుగా మారుతుంది. ఒకే ఒక్క పేలుడుతో జరిగిన నష్టం వల్ల అణ్వాయుధాలు అంటే ఆందోళన వ్యక్తం చేయడం లేదు. ఆ ఒక్క పేలుడే భారీగా ఉండవచ్చు. కానీ, ఆ పేలుడును సంప్రదాయ, నాన్ న్యూక్లియర్ బాంబు పేలుళ్లతో జరిగిన నష్టంతో పోల్చి చూడవచ్చు. రెండో ప్రపంచ యుద్ధాన్నే ఉదాహరణగా తీసుకుంటే, ఈ యుద్ధంలో దాదాపు ఏడున్నర కోట్ల మంది చనిపోయారు, వీరిలో అణ్వాయుధాల వల్ల చనిపోయిన వారు రెండు లక్షల మందే. బెర్లిన్, హాంబర్గ్, డ్రెస్డెన్ లాంటి నగరాలపై జరిగిన కార్పెట్ బాంబింగ్ వల్ల భారీ వినాశనం జరిగింది. అణ్వాయుధాలు భయంకరమైనవే. కానీ సంప్రదాయ ఆయుధాలు కూడా భారీగా ఉపయోగిస్తున్నారు.

 
చాలా సులభంగా భారీ వినాశనం సృష్టించవచ్చు కాబట్టే అణ్వాయుధాల పట్ల తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క లాంచ్ ఆదేశం వల్ల అవతలి దేశానికి రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టం కంటే ఎన్నో రెట్లు ముప్పు కలగవచ్చు. ఒక్క సైనికుడిని కూడా సరిహద్దుకు పంపించకుండా, అణు వార్‌హెడ్స్ ఉన్న ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించడం ద్వారా ఇది చేయవచ్చు. కానీ, అదంత సులభం కాదు. సామూహిక వినాశనం చాలా కాలం సాధ్యమైంది. కానీ అదెప్పుడూ అంత సులభంగా జరగలేదు.

 
అందుకే, అణ్వాయుధాల వినియోగంపై నిషేధం అనేది చాలా ముఖ్యం. దేశాలు తాము అణ్వస్త్రాలు ఉపయోగించాలనే ఉద్రిక్త పరిస్థితికి చేరకుండా అడ్డుకోడానికి ఈ నిషేధం సాయం చేస్తుంది. ఒక అణ్వస్త్రం ఉపయోగించడానికి సరే అంటే, తర్వాత అది రెండింటికి, మూడింటికి లేదా నాలుగుకు... అలా ప్రపంచ వినాశనం జరిగేవరకూ కొనసాగుతూనే వెళ్తుంది. ఇక దీనివల్ల తలెత్తే ముప్పు విషయానికి వస్తే ఆ అణు యుద్ధం చిన్నదా, పెద్దదా అనే వ్యత్యాసం చాలా ముఖ్యమైనది.

 
ఉదాహరణకు అణు యుద్ధంలో ఒక అణ్వాయుధాన్ని ప్రయోగించడానికి బదులు, వెయ్యి అణ్వాయుధాలు ఉపయోగించడం వల్ల ప్రాణనష్టం భారీగా ఉండవచ్చు. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినట్లు ఒక యద్ధంలో ఒక అణ్వాయుధం లేక కొన్ని అణ్వాయుధాలను ఒక మొత్తం నాగరికత మాత్రమే తట్టుకోగలదు. అణ్వాయుధాలను ఎక్కువ సంఖ్యలో ప్రయోగిస్తే ఆ ప్రభావాలు వాటిని తట్టుకోగలిగే నాగరికతకు పరీక్ష పెడుతుంది. ప్రపంచ నాగరికత విఫలమైతే, తర్వాత ఆ ప్రభావాలు మరింత తీవ్రమైన పరిణామాలకు కారణమవుతాయి. అదే పరిస్థితిని విపులంగా చూస్తే మానవాళి సుదీర్ఘ జీవన సామర్థ్యం తగ్గిపోతుంది.

 
ఈ అనిశ్చితుల దృష్ట్యా ఈ రిస్క్ అనాలసిస్ దేనికి తగినది అనేది పరిశీలించడం మంచిది. ఈ సందర్భంలో నా గ్రూప్ అణు యుద్ధంపై చేసిన పరిశోధనలో రెండు విమర్శలు వచ్చాయి. కొంతమంది ఇది మరీ పరిమాణాత్మకంగా ఉందంటే, మిగతా వారు అది తగినంత పరిమాణాత్మకంగా లేదని చెప్పారు. మరీ పరిమాణాత్మకం అన్న వారు అణు యుద్ధాన్ని అంతర్గతంగా లెక్కలు వేయలేని ముప్పుగా, లేదా దాని తీవ్రతను లెక్కించడానికి తగిన కొలమానాలు లేవని చెప్పారు. అందుకే దానికి ప్రయత్నించడం కూడా తప్పేనన్నారు.

 
ఇది అంత పరిమాణాత్మకంగా లేదన్నవారు, బలమైన నిర్ణయం తీసుకోవాలంటే ప్రమాదాన్ని అంచనా వేయడం కీలకం అని వాదించారు. కొన్ని అంచనాలు లోపభూయిష్టంగా, సందేహాస్పదంగా ఉన్నప్పటికీ అదే మంచిదన్నారు. నా దృష్టిలో రెండు కోణాలకూ కాస్త విలువ ఉంది. అణు యుద్ధం ముప్పుపై ఈ విశ్లేషణలో అవి నా విధానాన్ని తెలియజేశాయి. అణ్వాయుధాలున్న దేశాలు తమ ఆయుధాలను ఎలా మానేజ్ చేస్తాయి, నిరాయుధీకరణవైపు ఎలా ముందుకెళ్తాయి లాంటి ముఖ్యమైన నిర్ణయాలపై కూడా అణు యుద్ధం ప్రమాదం ఆధారపడి ఉంటుంది.

 
ఇలాంటివి అణు యుద్ధం ప్రమాదాన్ని లెక్కించడానికి మనకు బలమైన కారణాలను ఇస్తాయి. కానీ ఆ ప్రయత్నంలో వినయంగా ఉంటూ, ఈ ముప్పు గురించి నిజానికి మనకు తెలిసినదానికంటే ఎక్కువ తెలుసని చెప్పుకోకూడదు. అణు యుద్ధం ముప్పును సరిగా అంచనా వేయకపోవడం అనేది కూడా ప్రమాదమే. అంటే, సరిగా అంచనా వేయకపోతే, తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. దీనిపై అంచనాలు అనూహ్యంగా ఉండడంతో మేం దాన్ని సరిగా పొందడం చాలా ముఖ్యం.

 
ఇక ప్రస్తుత యుక్రెయిన్ మీద రష్యా దాడి అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందా అనేది చూస్తే.. ఎన్నో అనిశ్చితులు, పరిస్థితులు వేగంగా మారుతుండడం వల్ల నేను మీకు కచ్చితంగా ఏదీ చెప్పలేను. ఇది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని చెప్పగలను. (సేథ్ బామ్ గ్లోబల్ కాటస్ట్రోఫిక్ రిస్క్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇది అస్తిత్వ ప్రమాదంపై దృష్టిపెట్టిన ఒక థింక్ టాంక్.)