శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 12 మే 2020 (17:25 IST)

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఏపీలో ప్రజలకు కరెంటు బిల్లుల షాక్, అదనపు భారం వేయలేదు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ బిల్లుల భారం తమపై విపరీతంగా మోపారంటూ కొందరు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలలకు వచ్చిన బిల్లు ఎప్పుడూ వచ్చే దానికి రెట్టింపు స్థాయిలో ఉందని అంటున్నారు. ప్రభుత్వం వాదన మాత్రం దీనికి భిన్నంగా ఉంది. వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగి తదనుగుణంగా బిల్లులు వచ్చి ఉంటాయని, ఈ విషయంలో అపోహలు అవసరం లేదని అంటోంది.

 
ఏపీలో ప్రస్తుతం మూడు డిస్కంల ద్వారా విద్యుత్ పంపిణీ జరుగుతోంది. అందులో ఏపీఈపీడీసీఎల్ ద్వారా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు. ఎపీసీపీడీఎల్ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ సరఫరా సాగుతోంది. ఇక రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ జరుగుతోంది.

 
రాష్ట్ర వ్యాప్తంగా 1.3 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహావసరాలు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలతో పాటు వివిధ సర్వీసులకు విద్యుత్‌ను అందిస్తున్నారు. మొత్తం విద్యుత్ కనెక్షన్లలో 82 శాతం గృహాలవి ఉన్నాయి. సుమారుగా 1.04 కోట్ల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్టు ఏపీఈఆర్సీ నివేదికలు చెబుతున్నాయి.

 
2020 ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 5,684 మిలియన్ యూనిట్లుగా ఉంటే, అందులో గృహ అవసరాల వాటా 1,040 మిలియన్ యూనిట్లు ఉన్నట్లు నివేదికలో తెలిపారు. సగటున ఏడాది మొత్తం వినియోగంలో గృహ అవసరాలకు అందుతున్న విద్యుత్ 24 శాతంగా ఉంటోంది.

 
2017-18 సంవత్సరానికిగాను రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 986 యూనిట్లుగా ఉంది. ఉత్పత్తవుతున్న విద్యుత్‌లో థర్మల్ విద్యుత్ 28 శాతం, జల విద్యుత్ 21 శాతం, గ్యాస్ ఆధారిత విద్యుత్ 20 శాతం, కేంద్రం వాటా కింద వచ్చే విద్యుత్ 17 శాతం ఉన్నట్టు ఏపీఈఆర్సీ నివేదికలో ఉంది.

 
లాక్‌డౌన్‌తో నిలిచిన ప్రక్రియ
ప్రతి నెలా మొదటి, రెండవ వారాల్లో విద్యుత్ మీటర్ల రీడింగ్ తీసి వినియోగదారులకు బిల్లులు అందిస్తారు. ఇంటింటికీ తిరిగి ప్రైవేటు ఆపరేటర్లు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత 15 రోజుల సమయంలో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం మరో 10 రోజుల తర్వాత విద్యుత్ సరఫరా నిలిపిసేందుకు గడువు నిర్ణయిస్తారు. బిల్లు చెల్లింపుల్లో జాప్యం చేసిన వారు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

 
అయితే, మార్చి నెలలో విద్యుత్ బిల్లులు వచ్చిన తర్వాత చెల్లింపులు చేయడంలో వినియోగదారులకు సమస్య వచ్చింది. మార్చి 22న జనతా కర్ఫ్యూ, అనంతరం లాక్‌డౌన్‌తో చెల్లింపులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. లాక్‌డౌన్ అలాగే కొనసాగడంతో ఏప్రిల్‌లో విద్యుత్ రీడింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.

 
దీంతో మార్చి నెల బిల్లు ఎంత మొత్తం వచ్చిందో, ఏప్రిల్‌కు కూడా చెల్లించాలంటూ ఏపీ ట్రాన్స్‌కో ద్వారా ఆదేశాలు వచ్చాయి. దానికి అనుగుణంగా డిస్కంల వారీగా వినియోగదారులకు మెసేజ్‌లు వచ్చాయి. ఆన్‌లైన్లో బిల్లు చెల్లించాలని సూచిస్తూ, దాని గురించి ప్రచారం కూడా చేశారు. వినియోగదారుల్లో చాలా మంది ఈ బిల్లులు చెల్లించారు.

 
దాదాపు రెండు నెలల విరామం అనంతరం మే నెల మొదటి వారంలో మళ్లీ విద్యుత్ బిల్లుల రీడింగ్ మొదలయ్యింది. ఇప్పుడు వచ్చిన బిల్లును చూసి కొందరు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల మొత్తం రీడింగ్ ఒకే బిల్లుగా పరిగణించడం వల్ల తమ శ్లాబ్ మారి, యూనిట్ ధర కూడా పెరుగుతోందని, ఫలితంగా తమపై అదనపు భారం పడుతోందని వాళ్లు అంటున్నారు.

 
‘సాయం చేసి, బిల్లు వేస్తారా?’
ప్రతి నెలా రూ. 800కు అటూఇటుగా తమకు విద్యుత్ బిల్లు వస్తుందని, మార్చిలో రూ.870 బిల్లు చెల్లించామని విజయవాడకు చెందిన సింగిరెడ్డి సురేశ్ బీబీసీతో చెప్పారు. ‘‘ప్రభుత్వ సూచన ప్రకారం మార్చి నెల వచ్చిన బిల్లు మొత్తాన్నే ఏప్రిల్‌కు కూడా చెల్లించాం. కానీ ఇప్పుడు రీడింగ్ తీసి, ఏప్రిల్, మే నెలలకు రూ. 2700 బిల్లు వేశారు. ఏప్రిల్‌కు ఇదివరకే చెల్లించిన రూ. 870 పోగా, రూ. 1830 చెల్లించాలని అంటున్నారు. పోయిన ఏడాది ఏప్రిల్‌లో మాకు రూ. 1143 బిల్లు వచ్చింది. ఒకే ఏడాదిలో రూ. 700 తేడా రావడం ఏంటి? చేయని తప్పుకు మాపై భారం ఎలా వేస్తారు? అసలే లాక్‌డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్నాం’’ అని ఆయన వాపోయారు.

 
తమకు ఎప్పుడూ వచ్చే బిల్లుకు రెండింతలు విద్యుత్ బిల్లు ఈసారి వచ్చిందని పి.కృష్ణవేణి బీబీసీతో చెప్పారు. ఇంటి పని చేసే ఆమె, రెండు నెలలుగా ఖాళీగానే ఉంటున్నారు. ఆమె భర్త విశాఖ పోర్టులో దినసరి కూలీ. ఆయన కూడా పనుల్లేక ఇంట్లోనే ఉంటున్నారు. ఆదాయం లేక బాధపడుతున్న తమకు రెండింతలైన విద్యుత్ బిల్లు మరింత భారంగా మారిందని కృష్ణవేణి అన్నారు.

 
‘‘ఇదెక్కడి న్యాయం. నెలనెలా మాకు కరెంట్ బిల్లు రూ. 400 లోపు వచ్చేది. ఇంట్లో ఫ్యాన్ తప్ప ఏసీ లాంటివి ఏమీ లేవు. వేసవిలో మాత్రమే బిల్లు రూ.400 వరకూ వచ్చేది. మార్చి నెలలో రూ.312 వచ్చింది. కట్టాం. ఏప్రిల్ నెలకూ అంతే కట్టాం. ఇప్పుడు ఏప్రిల్, మే నెలల బిల్లు రూ.1147 వచ్చింది. ఇదివరకు కట్టిన రూ.312 తీసేసి మిగతా మొత్తం కట్టమంటున్నారు. బిల్లు రెండింతలైంది. అసలే పనుల్లేవు. ఆదాయం లేదు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యంతో గడుపుతున్నాం. లాక్‌డౌన్ కోసం వెయ్యి రూపాయలు సాయం చేసి, కరెంట్ బిల్లు 800 రూపాయలు పెంచేస్తే మే ఏం చేయాలి’’ అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

 
కృష్ణవేణిలాగే విద్యుత్ బిల్లులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు చాలా మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. రెండు నెలల బిల్లు ఒకే సారి రీడింగ్ తీయడంతో కొత్త టారిఫ్ వర్తిస్తోందని, ఇదే భారం పడటానికి కారణమని కొందరు అంటున్నారు. ఇదివరకు 75 యూనిట్ల లోపు వినియోగం ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు కేటగిరీ మారిపోవడంతో యూనిట్ ఛార్జ్‌పై అదనంగా చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు.

 
టారిఫ్ ఎలా ఉందంటే...
2020 మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకూ విద్యుత్ టారిఫ్ వేరుగా ఉంది. ఏప్రిల్ నుంచి కొత్త శ్లాబ్ విధానం అమల్లోకి వచ్చింది. అది కూడా ప్రస్తుత విద్యుత్ బిల్లుల మోతకు ఓ కారణమని పలువురు భావిస్తున్నారు. వినియోగదారుల ఫోరం ప్రతినిధి పి.రమేశ్ కుమార్ ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు. పాత శ్లాబ్లో 200 యూనిట్స్ వినియోగం వరకూ గ్రూప్-ఏలో ఉండేదని, కొత్త శ్లాబ్‌లో దాన్ని 75 యూనిట్లకే పరిమితం చేశారని ఆయన అన్నారు.

 
‘‘300 యూనిట్ల వినియోగం వరకూ పాత శ్లాబ్‌లో గ్రూప్-బీ ఉండేది. ఇప్పుడు 76 యూనిట్ల నుంచి 225 యూనిట్ల మధ్య వినియోగించేవారు దాని పరిధిలోకి వస్తున్నారు. వినియోగం 300 యూనిట్స్ దాటితే పాత శ్లాబ్ గ్రూప్ సీ వర్తించేది. కొత్త శ్లాబ్‌లో 225 యూనిట్స్ పైన వినియోగించే వారంతా గ్రూప్ సీలోకి వచ్చేశారు. తక్కువ వినియోగించే వారు కూడా రెండు నెలల వాడకం కలిపితే గ్రూప్ మారిపోతున్నారు. కొత్త శ్లాబ్‌లో పై గ్రూప్‌ల పరిధిలోకి వస్తున్నారు. దీంతో యూనిట్ ధర మారిపోయి, అదనంగా చెల్లించాల్సి వస్తోంది’’ అని రమేశ్ కుమార్ చెప్పారు.

 
విద్యుత్ బిల్లుల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయానికి వినియోగదారులపై అదనపు భారం మోపడం సరికాదని అన్నారు.

 
‘500 యూనిట్ల వరకూ పెంపు లేదు’
500 యూనిట్ల వరకూ వినియోగించేవారికి విద్యుత్ ఛార్జీలను పెంచలేదని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సత్య నారాయణ రెడ్డి బీబీసీతో చెప్పారు. ‘‘ఏపీఈఆర్సీ ప్రతిపాదనలు ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చాయి. కానీ 500 యూనిట్ల లోపు వినియోగదారులకు పాత ధరలే వర్తిస్తున్నాయి. కేటగిరీ 1లో గ్రూప్ సీ వినియోగదారులు 401 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకూ వినియోగిస్తే గతంలో రూ. 8.50 టారిఫ్ ఉండేది. ఇప్పుడు కూడా అంతే. కానీ 500 యూనిట్లకు పైన వినియోగించేవారికి గతంలో రూ. 9.05 టారిఫ్ ఉండేది. ఇప్పుడది రూ.9.95కి పెరిగింది. ఈ గ్రూపులోకి వచ్చే వినియోగదారులు చాలా స్వల్పంగా ఉంటారు. కాబట్టి కొత్త టారిఫ్ వల్ల భారం పడుతుందనే వాదన సరికాదు’’ అని ఆయన అన్నారు.

 
ఏప్రిల్, మే నెలల విద్యుత్ వినియోగం కలపలేదని, విడివిడిగానే శ్లాబ్‌లు వర్తింపజేశామని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ చెప్పారు.

 
‘‘ఏటా వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ప్రధానంగా గృహ అవసరాలకు వాడే విద్యుత్ అధికం. ఈ ఏడాది అంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల అది బాగా పెరిగింది. దాంతో బిల్లులో కొంత వ్యత్యాసం రావచ్చు. అంతకుమించి అదనపు భారం ఏమీ లేదు. మార్చి నెలలో బిల్లు చేసిన తేదీ నుంచి ప్రస్తుత బిల్లు తేదీవరకు వినియోగించిన మొత్తము యూనిట్‌లను రెండు నెలలకు భాగించి ఏప్రిల్, మే నెలలకు ఆయా శ్లాబ్ల్లో బిల్లులు వేస్తున్నాం. ఏప్రిల్ నెలలో ఇచ్చిన తాత్కాలిక బిల్లు(ప్రొవిజనల్ బిల్) మొత్తం తీసేసి, మిగతా ఎంత మొత్తం కట్టాలో వివరిస్తున్నాం. ఏమైనా అనుమానాలు, సమస్యలు ఉంటే వివరణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి కాల్ చేయవచ్చు. అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మవద్దు. అలాంటివి ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని అన్నారు.

 
‘వెసులుబాటు ఇవ్వాలి’
రెండు నెలల బిల్లులు ఒకేసారి చెల్లించడం పేదలకు భారంగా ఉంటుందని పట్టణ పేదల సమాఖ్య ప్రతినిధి చిగురుపాటి బాబూరావు అన్నారు. కొత్త టారిఫ్ అమలు వాయిదా వేయాలని కోరారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నట్టే పేదలందరికీ 200 యూనిట్ల లోపు విద్యుత్‌ని ఈ రెండు నెలల పాటు ఉచితంగా ఇవ్వాలి. వారి బిల్లులను రద్దు చేయాలి. సర్వీస్ చార్జి పేరుతో రెండు నెలల బిల్లు వసూలు చేస్తున్నారు. 

 
ఏప్రిల్‌లో రీడింగ్ తీయకుండా సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారు. బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని వేసే జరిమానాలు, కనెక్షన్ పునరుద్దరణ పేరుతో విధించే చార్జీలు వసూలు చేయడం ఆపాలి. లాక్‌డౌన్‌లో ప్రజలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మూడు నెలల పాటు ఎప్పుడైనా బిల్లు చెల్లించే వెసులుబాటు ఇవ్వాలి. ప్రజలు ఆందోళనలో ఉన్నప్పుడు వారికి నచ్చజెప్పేందుకు తగ్గట్టుగా ట్రాన్స్ కో, ప్రభుత్వం ప్రయత్నించాలి. బెదిరించడం సరికాదు’’ అని బాబూరావు వ్యాఖ్యానించారు.