సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:22 IST)

కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్: భూమి కంపించటం తగ్గిపోయింది

కోవిడ్-19 మీద పోరాటం కోసం ఆంక్షలు విధించటంతో ప్రపంచంలో కోట్లాది మంది జనం ఇళ్లకే పరిమితమై.. ఎన్నో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కార్లలో ప్రయాణాలు, రైళ్ల రాకపోకలు చాలా తగ్గిపోయాయి. ఫ్యాక్టరీలు నిలిచిపోయాయి. జనం కదలికలు తగ్గిపోవటం.. మన భూగోళం కదలికల మీద ప్రభావం చూపుతోంది. నిజానికి.. ఆరు కోట్ల కోట్ల (6,00,00,000) టన్నుల బరువుండే భూగోళం పైపొర మీద ప్రకంపనలు చాలా తగ్గిపోయాయి.

 
నాటకీయంగా పడిపోయాయి
ఇంత ఆశ్చర్యకరంగా ప్రకంపనలు తగ్గిపోవటాన్ని తొలుత బెల్జియంలోని రాయల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు గుర్తించారు. 1-20 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ భూ కదలికలు.. ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు మొదలు పెట్టినప్పటి నుంచి చాలా తగ్గిపోయాయని వారు చెప్పారు. ఈ మార్పులను ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పరిశోధకులు గుర్తించారు.

 
నేపాల్‌లోని భూకంప శాస్త్రవేత్తలు కూడా ఈ తగ్గుదలను గుర్తించారు. ఫ్రాన్స్ రాజధానిలో ఈ తగ్గుదల నాటకీయంగా ఉందని పారిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ ఫిజిక్స్ సిబ్బంది ఒకరు చెప్పారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో భూ ప్రకంపనలు పడిపోవటం చాలా తీవ్రంగా ఉందని కాల్ టెక్ యూనివర్సిటీ పరిశోధన ఒకటి అభివర్ణించింది.
 
నేపాల్‌లోని భూప్రకంపనలు పడిపోవటం ఈ గ్రాఫ్‌లో చూడొచ్చు.
స్వచ్ఛమైన గాలి.. ప్రశాంత సముద్రాలు
కరోనావైరస్ మన జీవితాలతో పాటు.. ప్రపంచ సహజ ప్రకృతి మీద కూడా ప్రభావం చూపుతోంది. వాతావరణంలోకి కార్లు, ట్రక్కులు, బస్సులు, విద్యుత్ ప్లాంట్లు విడుదల చేసే కాలుష్యకారక వాయువు నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి తగ్గిపోయినట్లు శాటిలైట్లు కనిపెట్టాయి.

 
ప్రపంచం మరింత నిశబ్దంగా కూడా మారింది. మన నగరాల్లో ప్రతి రోజూ వినిపించే నేపథ్య ధ్వనులను కొలిచే శాస్త్రవేత్తలు, సముద్రాల లోతులను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు.. ఈ శబ్దాల స్థాయి గణనీయంగా పడిపోయినట్లు గుర్తించారు.

 
స్పష్టంగా సంకేతాలు
ఈ కొత్త భూకంప పరిశోధనల్లో.. భూమి వణకటం పూర్తిగా ఆగిపోయినట్లు కనిపించలేదు. కానీ ప్రకంపనలు తగ్గిపోవటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మేలు చేసే విషయం కూడా. మానవ కార్యకలాపాల వల్ల పుట్టుకొచ్చే రణగొణధ్వనులతో.. భూమి సహజంగా ఏం చేస్తుంటుందనేది వినటం కష్టమవుతుంది.

 
‘‘పైభాగంలో ఈ ధ్వనులు తగ్గిపోతే.. భూమి నుంచి మరింత స్పష్టమైన సంకేతాలు అందుతాయి. వాటివల్ల ఇంకాస్త ఎక్కువ సమాచారం తెలుసుకోవటానికి వీలవుతుంది’’ అని భూకంప శాస్త్రవేత్త ఆండీ ఫ్రాసెటో వివరించారు. కొంత మంది పరిశోధకులు.. తమ ప్రాంతంలో ధ్వనులు తగ్గటానికి వాస్తవ కారణం ఏమిటనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోగలిగారు.
 
బ్రిటన్‌లో లండన్ – వేల్స్ మధ్య గల ఎం4 రహదారి మీద ట్రాఫిక్ రద్దీ తగ్గిపోవటం కారణమని.. ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకుడు స్టీఫెన్ హిక్స్ పేర్కొన్నారు. ‘‘తెల్లవారుజామునే ధ్వనులు పెరుగుతూ పోవటం చాలా తగ్గిపోయినట్లు గత కొన్ని రోజులుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఉదయపు రద్దీ తగ్గిపోవటమని నేను భావిస్తున్నా. ప్రయాణించే జనం తగ్గిపోయారు.. స్కూళ్లు నడవటం లేదు’’ అని ఆయన ట్విటర్‌లో రాశారు.

 
కాలానుగుణ మార్పులు
ఈ మార్పులు కనిపించటం ఇప్పుడే కొత్త కాదు. మానవ కార్యకలాపాలు రోజులో ఒక్కో సమయంలో మారుతుంటాయి. ప్రతి సంవత్సరం కూడా మారుతుంటాయి. కొన్ని సమయాల్లో తక్కువగా పని చేస్తుంటారు. పగటి సమయం కన్నా రాత్రి వేళ నిశబ్దంగా ఉంటుంది. పెద్ద పెద్ద పండుగలు, సెలవు రోజుల్లోనూ ఈ ధ్వనులు తగ్గిపోతుంటాయి.

 
కానీ.. సాధారణంగా క్రైస్తవ దేశాల్లో క్రిస్ట్‌మస్ సమయంలో కనిపించే ఈ పరిస్థితులు.. ఇప్పుడు ప్రపంచమంతటా వారాల తరబడి కొనసాగుతున్నాయి. ప్రజల కదలికలు, కార్యకలాపాలు ఆగిపోతున్నాయి. ఇలా కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశమూ ఉంది.