కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా? అందుకు ఆధారాలు ఉన్నాయా?

hydroxychloroquine
బిబిసి| Last Modified బుధవారం, 8 ఏప్రియల్ 2020 (19:58 IST)
మలేరియా రోగులకు ఇచ్చే ఔషధానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. కరోనావైరస్‌ బాధితులకు తక్షణ చికిత్స కావాలని ప్రభుత్వాలు ఆశించడమే అందుకు కారణం. క్లోరోక్విన్‌తో పాటు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి ఔషధాలు కరోనావైరస్ చికిత్సకు పనిచేస్తాయని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అయినప్పటికీ, ఈ ఔషధాలపై అందరి దృష్టీ పడింది. ప్రస్తుతం కరోనావైరస్ చికిత్సలో ఈ మందుల పనితీరుకు సంబంధించి ఆధారం ఏంటి? వాటిని ఎవరు వాడుతున్నారు?

ఈ ఔషధాల గురించి మనకేం తెలుసు?
హైడ్రాక్సీ క్లోరోక్విన్ సామర్థ్యం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ప్రస్తావించారు. "మీరు కోల్పోయేది ఏముంది? అది వాడండి" అని ఇటీవల విలేకరుల సమావేశంలో అన్నారు. "హైడ్రాక్సీక్లోరోక్విన్ అన్ని చోట్లా బాగా పనిచేస్తోంది" అని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే, తప్పుడు సమాచారం వ్యాప్తిని నిరోధించే నిబంధనల కింద ఫేస్‌బుక్ ఆ వీడియోను తొలగించింది. మలేరియా చికిత్సలో భాగంగా జ్వరాన్ని, నొప్పిని తగ్గించేందుకు క్లోరోక్విన్ ఆధారిత మాత్రలను చాలాకాలంగా వాడుతున్నారు. ఆ మాత్రలే కరోనావైరస్‌ను కూడా నిరోధించగలవన్నది ఆశ.


"ప్రయోగశాలలో నిర్వహించిన అధ్యయనాల్లో కరోనావైరస్‌ను క్లోరోక్విన్ కట్టడి చేసినట్లు అనిపిస్తోంది. చికిత్స కోసం ఇది కొంతమేర సాయపడుతున్నట్లు కొన్ని ఆధారాలు కనిపించాయని కొందరు వైద్యులు తెలిపారు" అని బీబీసీ హెల్త్ కరస్పాండెంట్ జేమ్స్ గలాగర్ చెప్పారు.

క్లోరోక్విన్ ఆధారిత ఔషధాలను కోవిడ్-19 రోగులకు పూర్తిస్థాయిలో వాడొచ్చని చెప్పేందుకు ఇప్పటి వరకు పక్కా ఆధారాలు లేవు. ఈ మందుల వల్ల మూత్రపిండం, కాలేయం దెబ్బతినడంతో పాటు మరికొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా తలెత్తే ప్రమాదాలు కూడా ఉన్నాయి.


"ఈ ఔషధాల ప్రభావాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు ఇంకా విస్తృతంగా ర్యాండమ్‌ క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఉంది" అని ఆక్స్‌‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కోమ్ గిబినిగీ చెప్పారు. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, చైనా సహా 20కి పైగా దేశాల్లో ప్రస్తుతం ఈ ఔషధాలపై ట్రయల్స్ జరుగుతున్నాయి.

"మలేరియా నిరోధక ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా నిర్వహిస్తున్నాం. కోవిడ్-19ను అవి అడ్డుకోగలగుతున్నాయా లేదా అన్నది పరిశీలిస్తున్నాం" అని బ్రిటన్ మంత్రి మైఖేల్ గోవ్ చెప్పారు. కోవిడ్ -19 రోగులకు చికిత్స కోసం క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్ ఔషధాలను కలిపి వాడేందుకు అమెరికాలో ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

ఏ దేశాలు అనుమతించాయి?
కోవిడ్-19తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొద్దిమంది రోగులకు అత్యవసర చికిత్సలో భాగంగా ఈ ఔషధాలను పరిమితంగా ఇవ్వవచ్చు అని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ చెప్పింది. అయితే, దాని అర్థం, ఈ ఔషధాలు పక్కాగా పనిచేస్తాయని ఎఫ్‌డీఏ చెప్పినట్లు కాదు. ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే వీటిని ప్రభుత్వం నుంచి తీసుకుని వాడాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

జర్మనీకి చెందిన ఒక ఔషధ సంస్థ మూడు కోట్ల డోసుల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తమకు విరాళంగా ఇచ్చిందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. మిగతా దేశాలు కూడా ఈ మలేరియా నిరోధక మందులను కొంతమేర వాడుతున్నాయి. కోవిడ్-19 రోగులకు క్లోరోక్విన్ ఔషధాలను సిఫార్సు చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం వైద్యులకు అనుమతి ఇచ్చింది. అయితే, వాటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరించింది.

కోవిడ్-19 నివారణ చికిత్సలో భాగంగా వైద్య సిబ్బంది హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడొచ్చని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ఒకవేళ వైద్యులు సిఫారసు చేస్తే, ఆ మేరకు కరోనావైరస్ రోగులు కూడా ఈ మందులను తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగని, ఎవరూ వీటిని విచ్చలవిడిగా వాడకూడదని భారత వైద్య పరిశోధనా సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతానికి “ఇది ప్రయోగాత్మకం మాత్రమే, అందుకే అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలి” అని చెప్పింది.

పశ్చిమాసియా దేశాల్లో చాలావరకు ఈ ఔషధాల వినియోగానికి అనుమతి ఇచ్చాయి. ఇంకా అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇచ్చిన మొట్టమొదటి దేశాలలో బహ్రెయిన్ ఒకటి. మొరాకో, అల్జీరియా, ట్యునీషియాలలో కూడా ఈ మందుల వాడకానికి అనుమతి ఉంది.


భారీ డిమాండ్
కోవిడ్-19 చికిత్సకు కొంతమేర సాయపడుతుందన్న వార్తలు రావడంతో ఈ ఔషధాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అమాంతం పెరిగింది. మలేరియా నివారణ కోసం క్లోరోక్విన్‌తో పాటు దాని ఆధారిత ఔషధాలు చాలా దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మందుల దుకాణాల్లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.

నిజానికి మలేరియాకు ఈ ఔషధాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతోంది. దాంతో, మలేరియాపై ఈ మందుల ప్రభావం క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ, ఈ మందులకు డిమాండ్ తగ్గడంలేదు. ప్రజలు ముందస్తుగా ఎక్కువ మొత్తంలో కొని నిల్వ ఉంచుకోడాన్ని అడ్డుకునేందుకు మందుల దుకాణాల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమ్మకాన్ని జోర్డాన్ ప్రభుత్వం నిషేధించింది.


ప్రైవేట్ దుకాణాల్లో ఉన్న ఈ మందులను వెనక్కి తీసుకోవాలని, ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంచాలని కువైట్ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. క్లోరోక్విన్ అమ్మకాలను కెన్యా ప్రభుత్వం నిషేధించింది. ప్రస్తుతం వైద్యులు సిఫార్సు చేస్తేనే దుకాణంలో ఈ ఔషధాన్ని అమ్ముతారు.

ఈ మలేరియా నిరోధక ఔషధాల ఉత్పత్తిలో భారతదేశం అత్యంత కీలకంగా ఉంది. అయితే, వీటి ఎగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన భారత ప్రభుత్వం, తాజాగా ఆ నిషేధాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. తాము ఆర్డర్ ఇచ్చిన డోసుల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరిస్తూ భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటన చేసింది.

నైజీరియాలో ఎగబడుతున్న జనాలు
మలేరియాపై ఈ ఔషధాల ప్రభావం తగ్గుతున్నందున వైద్యుల సిఫార్సు లేకుండా ఎవరూ వీటిని వాడకూడదంటూ 2005లో నైజీరియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినా, నైజీరియాలో ఇప్పటికీ చాలామంది మలేరియా చికిత్స కోసం క్లోరోక్విన్ ఆధారిత మాత్రలను క్రమం తప్పకుండా వాడుతున్నారు.


కరోనావైరస్ చికిత్స కోసం క్లోరోక్విన్ వాడకంపై చైనాలో జరిగిన పరిశోధనల గురించి ఫిబ్రవరిలో వార్త వచ్చింది. అప్పటి నుంచి నైజీరియావాసులు పెద్దఎత్తున ఈ ఔషధాన్ని కొని నిల్వ చేసుకోవడం ప్రారంభించారు. అది కరోనావైరస్ చికిత్సకు పనిచేస్తోందని డోనల్డ్ ట్రంప్ పేర్కొన్న తర్వాత, ఈ ఔషధం కోసం జనాలు మరింత ఎగబడుతున్నారు. చూస్తుండగానే, దుకాణాల్లో స్టాక్ ఖాళీ అయిపోయింది.

కానీ, ప్రజలు ఈ మాత్రల వాడకాన్ని మానేయాలని నైజీరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సూచిస్తోంది. "#COVID19 చికిత్స కోసం క్లోరోక్విన్ వాడకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించలేదు. కాబట్టి ప్రజలు ఈ ఔషధాన్ని వాడొద్దు" అని తెలిపింది. ఈ దేశంలోని లాగోస్ రాష్ట్రంలో అధిక మోతాదులో హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకుని పలువురు అనారోగ్యానికి గురయ్యారని అధికారులు చెబుతున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

దీనిపై మరింత చదవండి :