గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 25 నవంబరు 2020 (14:11 IST)

లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?

గమనిక: లవ్ జిహాద్ అనే పదానికి ప్రస్తుతమున్న చట్టాల్లో ఎలాంటి నిర్వచనమూ లేదు. ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదైనట్లు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థా వెల్లడించలేదు. వార్త మొదట్లోనే గమనిక అంటూ ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ఒక కారణముంది. లోక్‌సభలో ఫిబ్రవరి 4న ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి దీన్ని చెప్పారు. సాధారణంగా ఇలాంటి గమనికలు వార్తకు చివర్లో ఉంటాయి. కానీ, ఇక్కడ మొదట్లోనే ఎందుకు రాశామంటే, మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్ర ఉపయోగించిన ఈ పదాన్ని సందర్భానుసారంగా మీరే అర్థం చేసుకోవాలి.

 
బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ''ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2020''ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీంతో ఇలాంటి చట్టాలను తీసుకొస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా చేరింది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, హరియాణా, అసోం ఇలాంటి బిల్లుల్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిల్లులోని నిబంధనలు, దీన్ని తీసుకురావాల్సిన ఆవస్యకతపై నరోత్తమ్ మిశ్ర.. బీబీసీతో మాట్లాడారు.

 
''ప్రేమ(లవ్) ముసుగులో ఎవరైనా పెళ్లి చేసుకొని బలవంతపు మాత మార్పిడికి పాల్పడినా, జిహాదీ (జిహాద్) కార్యక్రమాలకు తెగబడినా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తాం. దీన్ని కాగ్నిజబుల్ నేరంగా పరిగణిస్తాం. అంటే దీని కింద కేసులు నమోదైతే బెయిలు కూడా ఇవ్వరు. అంతేకాదు, ఈ నేరానికి పాల్పడిన వారితోపాటు దీనికి సహకరించిన స్నేహితులు, కుటుంబ సభ్యులకూ శిక్షలు విధించేలా నిబంధనలు సిద్ధం చేస్తున్నాం. మొత్తం దోషులందరికీ ఒకేలా శిక్షలు ఉంటాయి''అని బీబీసీతో ఆయన చెప్పారు.

 
లవ్ జిహాద్ అంటే?
మొదట్లో లవ్ జిహాద్ పదాన్ని ఉపయోగించేందుకు నరోత్తమ్ మిశ్ర తటపటాయించారు. రెండు పదాలను విడివిడిగా చెప్పారు. ఎందుకు ఈ పదాలను విడిగా పలికారు? వీటిని ఎందుకు కలిపి పలకలేదు? అని ప్రశ్న ఆయన్ను అడిగినప్పుడు ''లవ్ జిహాద్ కేసులనూ ఈ చట్టం పరిగణలోకి తీసుకుంటుంది. నేను ఎక్కడ తటపటాయించాను?''అని ఆయన అన్నారు. అందుకే, ''లవ్ జిహాద్'' అనే పదాన్ని ఏ భారత చట్టంలోనూ నిర్వచించలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇలాంటి కేసులు నమోదైనట్లు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థా వెల్లడించలేదు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 4న లోక్‌సభలో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

 
కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పడానికే అంగీకరించని పదాన్ని రాష్ట్ర హోం మంత్రి ఎలా ఉపయోగించగలరు? ఆయన దృష్టిలో ఆ పదానికి ఉన్న నిర్వచనం ఏమిటి?

 
ఈ ప్రశ్నకు నరోత్తమ్ స్పందించారు. ''కొందరు ప్రేమ, పెళ్లి ముసుగులో బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి పెళ్లిళ్ల తర్వాత ఆడపిల్లలు ఎంతో వేదనను అనుభవిస్తున్నారు. ఇలాంటి కేసులనే మీడియాలో లవ్ జిహాద్‌గా పిలుస్తున్నారు''అని ఆయన చెప్పారు. త్వరలో జరగబోతున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మతమార్పిళ్లపై బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మధ్య ప్రదేశ్‌లో ఇప్పటివరకు వెలుగుచూస్తున్న కేసులన్నీ ఒక మతానికి సంబంధించినవి మాత్రమే వెలుగుచూస్తున్నాయని నరోత్తమ్ చెప్పారు. అయితే, తమ చట్టం అన్ని మత మార్పిళ్లకూ వర్తిస్తుందని వివరించారు.

 
ఎన్ని కేసులు వచ్చాయి?
ఎన్నికేసులు వచ్చాయన్నా ప్రశ్నపై స్పందిస్తూ.. హరియాణాలో రెండు కేసులు వచ్చాయని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌లలోనూ కేసులు వచ్చాయని వివరించారు. కేవలం బలవంతపు మత మార్పిళ్లే కాదు.. హత్యలు కూడా జరుగుతున్నాయని అన్నారు. గత ఏడాదిలో ఎన్ని కేసులు మధ్యప్రదేశ్‌లో వెలుగు చూశాయని ఆయన్ను బీబీసీ ప్రశ్నించింది. గణాంకాలు ఏమైనా ఉంటే ఇవ్వమని కోరింది. అయితే, ప్రస్తుతం తన దగ్గర గణాంకాలు లేవని ఆయన చెప్పారు. రెండు, మూడేళ్లలో ఈ కేసులు వందల సంఖ్యలో ఉంటాయని చెప్పారు. తాము తీసుకొస్తున్న ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2020 కిందకు వచ్చే నేరాలు, ప్రస్తుతం ఎక్కువ నమోదు కావడంలేదని నరోత్తమ్ అంగీకరించారు.

 
ఇక్కడ కొన్ని మతపరమైన చట్టాలున్నాయి..
మధ్య ప్రదేశ్‌లో కొన్ని మతపరమైన చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి.
మత మార్పిడికి సంబంధించి కూడా వీటిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి.

 
బలవంతపు మత మార్పిడికి విధించే జరిమానాను పది రెట్లకు పెంచుతూ 2013లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మత మార్పిడి చట్టానికి సవరణ చేసింది. మరోవైపు జైలు శిక్షను కూడా ఒకటి నుంచి నాలుగేళ్లకు పెంచింది. అంతేకాదు మత మార్పిడికి ఇక్కడ జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధన కూడా తీసుకొచ్చారు. ఈ చట్టంపై అప్పట్లో రాష్ట్రంలోని క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

 
2006లోనూ మత మార్పిడి బిల్లుకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకసారి సవరణ చేసింది. అయితే, అప్పట్లో దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు. ఇప్పుడు కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించగా.. ప్రస్తుతమున్న చట్టాలకు సవరణ చేస్తూ కొత్త బిల్లును తీసుకొస్తామని నరోత్తమ్ చెప్పారు.

 
ప్రత్యేక వివాహ చట్టం
దేశంలో వివాహాల నమోదుకు ప్రత్యేక వివాహ చట్టాలున్నాయి. అయితే వీటి కింద ఒకే మతానికి చెందిన దంపతుల వివాహాలను నమోదుచేస్తారు. ఒకవేళ వేరే మతాలకు చెందిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలంటే, ఇద్దరిలో ఒకరు రెండోవారి మతానికి మారాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌-1951ను కేంద్రం తీసుకొచ్చింది. దీని కింద వేరే మతంలోకి మారకుండానే చట్టపరంగా పెళ్లి చేసుకోవచ్చు.

 
రాజ్యాంగం నుంచి..
రాజ్యాంగంలో పొందు పరిచిన నిబంధనల ప్రకారం.. ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు. తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మత మార్పిడి సమయంలో అమ్మాయిల అనుమతి తీసుకున్నారో లేదో చట్టం సాయంతో ఎలా చూడగలరు?. ''ఇష్టపూర్వకంగా మతం మార్పిడి చేసుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. దీని కోసం వారు జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి. దీనిపై విచారణకు మెజిస్ట్రేట్ ఆదేశిస్తారు. ఇందులో ఏదైనా తేడాగా అనిపిస్తే, పెళ్లికి అనుమతి ఇవ్వం. పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మాయిల కుటుంబం ఫిర్యాదు చేస్తే, చర్యలు తీసుకుంటాం. ఇవే అంశాలను చట్టంలో పొందుపరిచాం''అని నరోత్తమ్ చెప్పారు.

 
''రాజ్యాంగంలో పొందుపరిచిన మతపరమైన స్వేచ్ఛ, నచ్చినవారిని ఎంచుకునే హక్కులతో తాజా చట్టం ఎక్కడా విభేదించదు. మత మార్పిడి ఎలా జరిగింది? అనే అంశంపై మేం విచారణ చేపడతాం. వంద కేసులు నమోదైతే.. వాటిలో 90 కేసుల్లో ఏదో తేడా ఉన్నట్లు తెలుస్తోంది. మత మార్పిడి అనంతరం అమ్మాయిలు చాలా బాధపడుతున్నట్లు తేలుతోంది''అని ఆయన వివరించారు.

 
విపక్షాలు ఏమంటున్నాయి?
అన్వర్ అనే వ్యక్తి అనిల్ అని పేరు మార్చుకొని హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అలాంటి పెళ్లిపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలి కదా? అని నరోత్తమ్ ప్రశ్నించారు. నరోత్తమ్ ఉదాహరణను పరిశీలిస్తుంటే.. ముస్లింలు అబ్బాయిలు మోసంచేసి, హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడాన్ని, బలవంతంగా మత మార్పిడి చేయడాన్ని లవ్ జిహాద్‌గా చెబుతున్నట్లు అనిపిస్తోంది. లవ్ జిహాద్ పేరుతో వివాదాలు, చర్చలు లేవనెత్తడాన్ని నవంబరు 20న రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రశ్నించారు.

 
ఈ విషయంపై ఆయన వరుసగా మూడు ట్వీట్లు చేశారు. ''దేశాన్ని విభజించేందుకు, మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు లవ్ జిహాద్ అనే పదాన్ని బీజేపీ సృష్టించింది''అని ఆయన వ్యాఖ్యానించారు. ''పెళ్లి అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. దీనిపై చట్టాన్ని తీసుకురావడం రాజ్యాంగ వ్యతిరేకం. ఈ చట్టం ఏ కోర్టులోనూ నిలబడదు. ప్రేమలో జిహాద్‌కు స్థానంలేదు''అని ఆయన అన్నారు.

 
మరోవైపు బీజేపీ నాయకులు కూడా ఇతర మతాల వారిని పెళ్లి చేసుకున్నారు కదా? వారిని ఏమంటారు అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ వ్యాఖ్యానించారు. ఆ పెళ్లిళ్లు కూడా లవ్ జిహాద్ కిందకు వస్తాయా? అని అడిగారు. కాంగ్రెస్ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై నరోత్తమ్ మాట్లాడారు. ''కాంగ్రెస్ నాయకులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. వీరు పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు పలుకుతారు. దేశాన్ని విభజించాలనే వారిని కలవడానికి రాహుల్ గాంధీ వెళ్తుంటారు''అని ఆయన అన్నారు.

 
ఒకవేళ అమ్మాయి ముస్లిం, అబ్బాయి హిందు అయితే? ఈ కేసులను కూడా లవ్ జిహాద్ కింద పరిగణిస్తారా? ''అమ్మాయి లేదా ఆమె కుటుంబం ఫిర్యాదు చేస్తే.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. లవ్ జిహాద్ కేసుల్లో ఎవరు దోషులుగా తేలినా..చర్యలు తీసుకుంటాం'' అని ఆయన అన్నారు.