ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 10 ఆగస్టు 2024 (19:41 IST)

మనీ యాప్ మోసాలు: రూ.74 వేలు కట్టాను. రూ. 20వేలే వెనక్కి, నమ్మించి మోసం చేశారు

mobile massage
ఆర్థిక లావాదేవీలను, సైబర్ మోసాలతో ముడిపెట్టి జరుగుతున్న నేరాల్లో ఇది కూడా ఒకటి. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే స్మార్ట్ ‌ఫోన్ యాప్ ద్వారా గొలుసుకట్టు పద్దతిలో ఎక్కువ మందిని మోసం చేసి డబ్బులు దోచుకోవడం. "అధిక మొత్తంలో రిటర్న్ ఇస్తామంటే ఆశపడి డబ్బులు పోగొట్టుకున్నాం’’ అని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అనేక మంది పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన పోలీసులు అదొక గొలుసు కట్టు విధానమని, మోసమని తెలిపారు. మల్టీలెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీముల తరహాలో ఈ మోసం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
 
బలహీనతే పెట్టుబడి
చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం... ‘‘డేటామీటర్ ఏఐ (Data meter AI) యాప్‌ను సంక్షిప్తంగా డాయ్ (DAAI) యాప్ అంటున్నారు. ఇదొక మనీ సర్క్యలేషన్ చైన్ లింక్ యాప్. ఇది ఆరు సంవత్సరాల నుంచి లావాదేవీలు నిర్వహిస్తోంది. దీని మెయిన్ బ్రాంచ్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంది. నోయిడాలో కూడా దీని లింకులు ఉన్నట్లు తెలిసింది. మీరు పెట్టిన డబ్బులు రెట్టింపవుతాయని యాప్ నిర్వాహకులు చెబుతారు. మీరు మరికొందరిని చేర్పిస్తే వాళ్ల ద్వారా మీకు కమీషన్ వస్తుందని నమ్మిస్తారు. ఇలా చిత్తూరుజిల్లా పలమనేరులో చాలా మంది అందులో డబ్బులు పెట్టాక చివరకు ఆ యాప్‌ను ఆపేశారు. దీంతో వందల మంది కోట్ల రూపాయల డబ్బును పోగొట్టుకున్నారు.
 
373 మంది బాధితులు దాదాపు రూ. 6 కోట్లు నష్టపోయినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇది తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. దేశంలోని చాలా ప్రాంతాలకు ఈ చైన్ నెట్‌వర్క్ విస్తరించింది. ఇందులో వి1 నుంచి వి7 వరకు వేర్వేరు లెవల్స్ ఉంటాయి. ఒక వ్యక్తి పది మందిని గ్రూపులో జాయిన్ చేయించి రూ.30 వేలు పెట్టుబడి పెట్టిస్తే ఆ వ్యక్తికి నెలకు రూ.1,000 కమీషన్ వస్తుంది. 60 మందిని జాయిన్ చేయిస్తే వీ3కి చేరుకుంటారు. గరిష్టంగా 500 మందిని జాయిన్ చేయించగలిగితే వీ7 లెవల్‌కి చేరుకుంటారు. అలా కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయిస్తే, ఆ వ్యక్తికి నెలకు రూ.లక్ష వరకు డబ్బులు ఇస్తామని ఆ యాప్‌లో రాశారు.’’
 
యాప్ గురించి ఎలా తెలిసింది?
పోలీసులకు ఫిర్యాదు చేసిన కొందరు బాధితులతో బీబీసీ మాట్లాడింది. వాళ్లందరూ తమకు తెలిసిన వ్యక్తుల నుంచి యాప్ గురించి తెలుసుకొన్నారు. ఆ వ్యక్తులు అప్పటికే అందులో డబ్బులు పెడుతూ వీరిని కూడా చేర్పించారు. ‘‘డాయ్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండదు. ఒక లింకు పంపితే దాని ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.’’ అని బాధితుడు సందీప్ బీబీసీకి చెప్పారు. పలమనేరులో వ్యాపారం చేస్తున్న సందీప్, సుమారు రూ.20 లక్షలు పోగొట్టుకున్నట్లు చెబుతున్నారు. ‘‘పేటిఎం ద్వారా రోజుకు రూ.99 వేల వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. అలా రీఛార్జ్ చేసుకున్న వెంటనే ఈ అమౌంట్ యాప్‌లో కనిపిస్తుంది. లక్ష రూపాయలు దాటితే వేరే అకౌంట్ నెంబర్లు ఇస్తారు’’ అని సందీప్ తెలిపారు.
 
‘‘రూ.99వేలు కడితే రోజూ రూ.3818 లెక్కన 15 రోజుల పాటు ఇస్తామని చెప్పారు. తర్వాత మనం కట్టిన డబ్బు వెనక్కి ఇస్తామని చెప్పారు. దాంతో నేను చేరాను. మరో 15 మందిని చేర్పించాను. వాళ్లకు కూడా రోజూ అమౌంట్ వచ్చేది. అలా జులై 19 వరకు లావాదేవీలు జరిగాయి. కమీషన్లు కూడా చెల్లించారు. జులై 20, 21న ఆఫర్లు పెట్టారు. రూ.15 వేలు కడితే రూ.30 వేలు అకౌంట్‌లో పడుతుందని చెప్పారు. అలా నమ్మి నేను రూ.74,000 పెట్టాను. 22వ తేదీ నుంచి విత్ డ్రాయల్ ఆగిపోయింది. 23వ తేదీ కల్లా మోసపోయామని తెలిసింది. మొత్తం మీద నాకు రూ.20,000 వెనక్కి వచ్చాయి. రూ.54,000 నష్టపోయా’’ అని వెంకటాచారి అన్నారు.
 
పలమనేరు మెప్మాలో పనిచేస్తున్న రాజేశ్ అనే ఉద్యోగి వల్ల ఈ యాప్ గురించి తమకు తెలిసిందని సందీప్, వెంకటాచారి, డాక్టర్ సంయుక్త చెప్పారు. ‘‘ఇది జెన్యూన్ యాప్. మీరు పెట్టే సొమ్ముకు నాది బాధ్యత అని రాజేశ్ చెప్పాడు’’ అని పలమనేరుకు చెందిన డాక్టర్ సంయుక్త బీబీసీతో అన్నారు. తనతోపాటు తన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నవారు మొత్తం కలిపి కోటి రూపాయల దాకా నష్టపోయామని బెంగళూరులో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఈశ్వర్ రెడ్డి బీబీసీతో చెప్పారు. ఆయన స్వస్థలం పలమనేరు.
 
‘‘రాజేశ్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వీళ్ళందర్నీ అందులో జాయిన్ చేశారు. ఏడాదిగా ఇది నడుస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ పేరు ఫైనాన్స్ మేనేజర్‌గా, నోయిడాకు చెందిన బాలసుబ్రమణ్యం మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నట్లు విచారణలో తెలిసింది. హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా చాలామంది మోసపోయారు.’’ అని ఎస్పీ మణికంఠ చెప్పారు. ప్రస్తుతం రాజేశ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయనకు ఫోన్ చేస్తుంటే స్విచాఫ్ అని వస్తోంది.
 
‘కింద స్థాయి వారు నష్టపోతారు’
ఇదొక చైన్ సిస్టమ్. అంటే కింద చేరే వ్యక్తులు డబ్బులు కడుతుంటే పైన ఉన్న వ్యక్తులకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఇలాంటి పిరమిడ్ స్కీముల వ్యవస్థలో డబ్బులను ఒకచోట పెట్టుబడిగా పెట్టి తద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యులకు పంచడం అనేది ఉండదు. కొత్తగా చేరే వారు చెల్లించే డబ్బుల నుంచే కమీషన్లు లేదా ప్రతిఫలం చెల్లిస్తుంటారు. ఇటువంటి స్కీములను ప్రారంభించే వారి ఉద్దేశం డబ్బులను దోచుకోవడమే తప్ప ఇందులో వ్యాపారం, లాభ నష్టాల లాంటివేమీ ఉండవు. అందుకే తక్కువ సొమ్ము పెట్టుబడి పెడితే అధిక మొత్తం చెల్లిస్తామని ఆశ చూపిస్తుంటారని పోలీసులు తెలిపారు.
 
ఇలాంటి స్కీముల్లో స్వల్పకాలంలోనే రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని వల విసురుతారు. ‘‘యాప్‌లో మీ డబ్బులు ఇంత ఉన్నాయని చూపిస్తారు. కానీ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ కావు. యాప్ నిర్వాహకులు డబ్బులన్నీ తీసుకుని ఆ తర్వాత యాప్‌ను బ్యాన్ చేస్తారు. దీంతో కొత్తగా అందులో జాయిన్ అయిన వారందరూ నష్టపోతారు’’ అని చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అవగాహనతో ఉండాలని సూచించారు.
 
ఎలా ఫిర్యాదు చేయాలి?
డబ్బులు నష్టపోకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. సులభంగా డబ్బులు వస్తున్నాయంటేనే అందులో ఏదో తప్పు లేదా మోసం ఉందని అర్థం చేసుకోవాలి. తక్కువ కాలంలో రెట్టింపు లాభాలు, వడ్డీ ఇస్తామని ఎవరు చెప్పినా కచ్చితంగా అనుమానించాలి.
తెలిసినవాళ్లు, స్నేహితులు, బంధువులు చెప్పారని కాకుండా సొంతంగా పరిశోధించి తెలుసుకోవాలి. అత్యాశకు పోయి డబ్బులు పెడుతూ పోతే ఏదో ఒక రోజు కచ్చితంగా మోసపోతారు. ఇంటర్నెట్‌లో ఇటువంటి మోసాల నివారణకు సంబంధించి చాలా సమాచారం అందుబాటులో ఉంది. వాటిని చదివి తెలుసుకోవచ్చు. ఒకవేళ మోసపోతే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1903కి ఫోను చేసి ఫిర్యాదు చెయ్యాలి. సైబర్ నేరాల్లో తొలి గంట చాలా ముఖ్యం అని పోలీసులు చెబుతున్నారు. మోసపోయినట్లు గుర్తించిన వెంటనే పోలీసులను సంప్రదించాలి. దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చెయ్యాలని వారు సూచించారు.