బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 26 నవంబరు 2022 (14:30 IST)

నూరా, ఆదిలా: లెస్బియన్ జంటకు పెళ్లి కళ.. వెడ్డింగ్ ఫొటోషూట్‌కు అభినందనల వెల్లువ

Lesbian couple
‘‘ఇప్పుడు స్వేచ్ఛ లభించింది. మా కలల జీవితాన్ని మేం జీవింవచ్చు.’’ కేరళకు చెందిన ఆదిలా నసరీన్, ఫాతిమా నూరాలు ఇటీవల పతాక శీర్షికల్లోకి ఎక్కారు. ఈ ఇద్దరు మహిళలు స్వలింగ సంపర్కులు (లెస్బియన్స్). సహజీవనం చేస్తున్న ఈ జంటను వారి వారి తల్లిదండ్రులు బలవంతంగా విడదీశారు. వీరు కోర్టును ఆశ్రయించగా.. సహజీవనం చేసే పూర్తి స్వేచ్ఛ వారికి ఉందంటూ కోర్టు వారిని మళ్లీ కలిపింది.

 
ఈ ఇద్దరూ ఇప్పుడు మళ్లీ పతాక శీర్షికల్లోకి ఎక్కారు. ఇరువురూ వధువులుగా మారి ఈసారి వెడ్డింగ్ ఫొటోషూట్‌లో పాల్గొనటం విపరీతంగా ఆకట్టుకుంది. వెండి ఆభరణాలు, నగిషీలు అద్దిన గోధుమ రంగు, నీలి రంగు లెహంగాలు ధరించి ముస్తాబైన ఈ మహిళలు.. ఎర్నాకులం జిల్లాలోని సముద్ర తీరంలో అందమైన పందిరి కింద ఉంగరాలు, గులాబీ దండలు మార్చుకున్నారు. ఫాతిమా నూరా (23) ఈ ఫొటోలను తన ఫేస్‌బుక్‌లో ‘టుగెదర్ ఫరెవర్’ అంటూ షేర్ చేయటంతో.. నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

 
‘‘ఫొటోషూట్ ఆలోచన ఆసక్తిగా అనిపించటంతో ఆ పని చేశాం’’ అని నసరీన్ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో ఈ మహిళల తరహాలో పలు జంటలు ఇలాంటి ఫొటోషూట్‌లలో పాల్గొన్నాయి. ‘‘మేం ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ ముందు ముందు పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాం’’ అని నసరీన్ తెలిపారు. భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించటాన్ని 2018లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎల్‌జీబీటీక్యూ ప్లస్ బృందాలు, ఉద్యమకారులు దశాబ్దాల పాటు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఈ మార్పు వచ్చింది.

 
లింగ వైవిధ్యత గురించి, ఎల్‌జీబీటీ క్యూ ప్లస్ సముదాయాల గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. అయితే ఇప్పటికీ సమాజంలో వీరి పట్ల వివక్ష, విముఖతలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ విషయం నసరీన్, నూరాలకు బాగా తెలుసు. నూరా కుటుంబం నుంచి తమకు ఇంకా బెదిరింపులు వస్తూనే ఉన్నాయని ఈ జంట చెప్తోంది. భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లేదు. ఈ పెళ్లిళ్లకు కూడా చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లు దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల పరిశీలనలో ఉన్నాయి. ఆ విషయం ఇంకా అలా ఉండగా.. చాలా గే జంటలు వేడుకగా నిశ్చితార్థాలు చేసుకుంటున్నాయి.

 
నూరా, నసరీన్‌లు సహజీవనం చేయటానికి కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది కానీ.. పెళ్లయిన దంపతులకు ఉండే హక్కులు, అధికారాలు వారికి లేవు. ‘‘మేం ఏదైనా దరఖాస్తు నింపినపుడు.. ఒక భార్య, ఒక భర్త పేరు రాయాలని, లేదంటే తండ్రి పేరు రాయాలని అడుగుతున్నారు. నేను పని చేసే దగ్గర, వేరే చోట్ల ఇంకా నా తండ్రి పేరునే వాడుతున్నాను. ఇటీవల మేం ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ మేమిద్దరం మా తండ్రుల పేర్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇది చాలా నిస్పృహను కలిగిస్తోంది’’ అని నసరీన్ వివరించారు. ఈ మహిళలకు తమ కుటుంబాలతో సత్సంబంధాలు లేకపోవటంతో వారి తండ్రుల పేర్లు ఇవ్వటం మరింత కష్టమైన విషయంగా మారింది.

 
తమ కుటుంబాల నుంచి కానీ, తాము పెరిగిన సమాజం నుంచి కానీ మద్దతు లేకపోవటంతో.. ఈ మహిళలు ఒకరిపై ఒకరు ఆధారపడుతున్నారు. వనజ కలెక్టివ్ వంటి ఎల్‌జీబీటీక్యూ ప్లస్ బృందాల సాయం తీసుకుంటున్నారు. కుటుంబాలు విడదీసినపుడు వీరు కోర్టుకు వెళ్లి సహజీవనం చేయటానికి అనుమతి పొందటానికి ఆ స్వచ్ఛంద సంస్థ సాయపడింది. నూరా, నసరీన్‌లు హైస్కూలులో కలిశారు. అప్పటి నుంచే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. స్కూలు నుంచి బయటకు వచ్చాక వీరిద్దరూ మూడేళ్ల పాటు కేరళలోనే వేర్వేరు జిల్లాల్లో విడివిడిగా ఉన్నారు. తమ కుటుంబాలతో నివసిస్తూ డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలో వీలుదొరికినపుడు ఫోన్లలో మాట్లాడుకోవటం, చాట్ చేయటం చేసేవారు.

 
ఆ సమయంలో సాయం కోసం వీరు ఎల్‌జీబీటీక్యూ ప్లస్ మద్దతు బృందాలను సంప్రదించారు. ‘ముందు చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకోండి’ అని ఆ బృందాలు వీరికి సలహా ఇచ్చాయి. ఇప్పుడు సాయం కోసం తమను సంప్రదిస్తున్న వారికి ఈ జంట అదే సలహా ఇస్తోంది. తాము కలిసి ఉండటానికి తమ కుటుంబాలను విడిచి బయటకు రావటం సులభం కాదని అప్పుడు తమకు తెలుసునని నసరీన్ చెప్పారు. ‘‘మా కమ్యూనిటీలో చాల మందికి మంచి చదువు లేదు. ఇతరులు ఉద్యోగాలు పొందటానికి సాయం చేయాలని ప్రయత్నించేటపుడు వారికి తగిన చదువు లేకపోవటం అవరోధంగా మారుతోంది’’ అని ఆమె వివరించారు.

 
అందువల్లనే తమ లాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా ఆర్థికంగా స్వతంత్రులు కావాలని వీరు సూచిస్తున్నారు. ‘‘మీ బతుకు మీరు బతకటానికి ఒక ఉద్యోగం ఉండటం చాలా ముఖ్యం. ఆర్థిక భద్రత ఉందంటే.. మీరు మరొకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు’’ అని నూరా పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఈ జంటకు లభించిన స్వేచ్ఛ వారు సోషల్ మీడియాలో షేర్ చేసుకునే తమ జీవిత విశేషాలు చాటి చెప్తున్నాయి. ఒకప్పుడు.. కలిసిన తమ చేతులను, లేదంటే వెనుక నుంచి తమ తలల ఫొటోలను మాత్రమే షేర్ చేసిన ఈ జంట.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఆడిపాడుతూ, స్నేహితులతో కబుర్లు చెప్తూ, కలిసి పెంచుకుంటున్న కుక్కను చూపుతూ షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు.. వీరు ఉమ్మడిగా నిర్మించుకుంటున్న జీవితాన్ని చాటుతున్నాయి.

 
‘‘చేదు గతం ముగిసిపోయినట్లుగా ఉంది. ఇప్పుడు అంతా బాగుంది’’ అని చెప్పారు నూరా. ప్రజల నుంచి తమకు లభిస్తున్న మద్దతు తమను ఎంతగానో కదిలిస్తోందని ఈ జంట చెప్తోంది. వీరు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక ప్రముఖ మహిళల మేగజీన్‌లో కనిపించారు. ఒక టీవీ షోలో పాల్గొన్నారు. వారి కథ ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆ కథనాలు కీర్తించాయి. ‘‘ఇప్పుడు మేం మాస్కు ధరించినా, కళ్లజోడు పెట్టుకున్నా జనం మమ్మల్ని గుర్తిస్తారు’’ అని నసరీన్ తెలిపారు. ఇప్పటివరకూ ప్రజల స్పందన ఆదరంగా, ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు.

 
అయితే తమ కుటుంబాలు ఇప్పటికీ తమ బంధాన్ని ముందుముందు కరిగిపోయే దశగానే పరిగణిస్తున్నాయని, తమ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలలోనూ అప్పుడప్పుడూ ఇలాంటి కామెంట్లు కనిపిస్తుంటాయని వీరు తెలిపారు. వీరికి అభినందనలు చెప్తూ మద్దతు తెలిపే శ్రేయోభిలాషులతో పాటు.. వీరు తప్పు చేస్తున్నారని, మగాళ్లని పెళ్లి చేసుకోవాలని చెప్పే వ్యతిరేకులు కూడా ఉన్నారు. ఈ కామెంట్లలో ఘోరంగా ఉన్న కొన్ని వ్యాఖ్యలకు నూరా, నసరీన్‌లు అప్పుడప్పుడూ స్పందిస్తుంటారు. అయితే వారి ప్రతిస్పందనలు హాస్యభరితంగా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ వీరి లైంగికత ఒక దశ మాత్రమేనని, ఎందుకంటే 40 ఏళ్లు దాటిన స్వలింగ సంపర్కులు ఎవరినీ తాను చూడలేదని కామెంట్ చేశాడు. దీనికి వీరు స్పందిస్తూ ‘‘మాకు 40 ఏళ్లు వచ్చే వరకూ నిరీక్షించండి’’ అని బదులిచ్చారు.