మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 17 డిశెంబరు 2024 (22:55 IST)

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

vote
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో దాదాపు ఎప్పుడూ ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. సుమారు 100 కోట్లమంది ఓటర్లున్న దేశం ఇది. ఇక్కడ ఎన్నికలనేవి ఒక నిరంతర ప్రక్రియలా కొనసాగుతుంటాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, గత కొన్నేళ్లుగా ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ నినాదాన్ని వినిపిస్తూ వస్తోంది. అంటే, రాష్ట్రాల అసెంబ్లీలకు.. జాతీయ స్థాయిలో పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది ఈ ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను పార్లమెంటులో ఆమోదింపజేసి, అమలు చేయడం కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో మరోసారి రాజకీయ చర్చ మొదలైంది.
 
ఈ తరహా ఎన్నికల వల్ల ప్రచార ఖర్చులు తగ్గుతాయని, పరిపాలనలో అవరోధాలుండవని, పాలన క్రమబద్ధీకరణ జరుగుతుందని ఈ ఎన్నికలను సమర్ధించే వాళ్లు వాదిస్తున్నారు. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సిఫార్సులు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిదిమంది సభ్యుల హైలెవెల్ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నాయకత్వం వహించారు. దీనిని ‘గేమ్ చేంజర్’గా ఆయన అభివర్ణించారు. ఇది దేశ జీడీపీని 1.5% వరకు పెంచగలదని ఆర్థికవేత్తలను ఉటంకిస్తూ ఆయన పేర్కొన్నారు. అయితే, ఇది భారత సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని, కేంద్రంలో అధికార కేంద్రీకరణతోపాటు, రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.
 
ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది
భారతదేశలో ప్రజాస్వామ్య వ్యవస్థ వివిధ స్థాయిల్లో పని చేస్తుంది. ప్రతి వ్యవస్థకూ ఒక ఎన్నికల చక్రం ఉంటుంది. పార్లమెంటు సభ్యులను ఎన్నుకోవడానికి సాధారణ ఎన్నికలు (జనరల్ ఎలక్షన్స్), రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రజాప్రతినిధుల మరణం, అనర్హత, రాజీనామాల సమయంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. సాధారణంగా ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి. అయితే, ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారిగా జరుగుతున్న ఎలక్షన్లను ఒకేసారి జరిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
 
ఈ ఏడాది మార్చిలో రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని హైలెవెల్ కమిటీ 18,626 పేజీలతో నివేదిక రూపొందించి రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. అవి జరిగిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపాలని సిఫార్సు చేసింది ఈ కమిటీ. ఒక ప్రభుత్వం కూలిపోతే, అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, దాని కాలపరిమితి మాత్రం ముందుగా నిర్ధరించిన సమయం వరకే ఉండాలని ఈ కమిటీ సూచించింది. దీనిపై ప్రస్తుతం ఇంతగా చర్చ జరుగుతున్నప్పటికీ, దేశమంతటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం భారతదేశానికి కొత్తేమీ కాదు. 1951లో జరిగిన మొదటి జనరల్ ఎలక్షన్స్ నుంచి 1967 వరకు, రాజకీయ తిరుగుబాట్లు, రాష్ట్రాల అసెంబ్లీల రద్దు వంటి ఘటనలు జరిగినప్పటికీ 1967 వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. 1983లో ఎన్నికల సంఘం, 1999లో లా కమిషన్, 2017లో నీతి ఆయోగ్‌లు ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చాయి.
 
భారతదేశానికి ఒకే ఎన్నిక అవసరమా?
ఒకే ఎన్నిక ఎందుకు నిర్వహించాలన్న దానికి ఈ ప్రతిపాదన మద్దతుదారులు చెబుతున్న అతి పెద్ద కారణం ఖర్చులు తగ్గించుకోవడం. దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ అంచనా ప్రకారం 2019 జనరల్ ఎలక్షన్ల కోసం భారత ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. అప్పటికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎలక్షన్ అది. అయితే, ఈ విధానాన్ని వ్యతిరేకించేవాళ్లు మాత్రం ఈ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, భద్రతా దళాలు, అధికారుల జీతభత్యాలు, రవాణా తదితరాల కోసం వనరులు పెద్ద ఎత్తున అవసరమవుతాయి.
 
కేంద్ర లా అండ్ జస్టిస్ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ 2015లో రూపొందించిన నివేదిక ప్రకారం, భారత ప్రభుత్వం కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కోసం రూ. 4500 కోట్లను ఖర్చు చేస్తోంది. అదే ఒకేసారి ఎన్నికలు జరిగితే, ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌ మెషీన్‌ల కోసం రూ. 9200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఈ కమిటీ పేర్కొంది. వీవీప్యాట్ మెషీన్‌లను ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి ఉంటుందని చెప్పింది. ఈ ఖర్చులు భారీగా ఉంటాయని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై. ఖురేషీ ఆందోళన వ్యక్తం చేశారు. ఖర్చులు తగ్గుతాయని చెబుతున్న కోవిడ్ కమిటీ నివేదికలో ఈ విషయం చర్చించి ఉండాల్సిందని ఖురేషీ అభిప్రాయపడ్డారు.
 
సవాళ్లేంటి?
ఒక దేశం-ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులలో కొన్నింటికి దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ, కొన్ని సవరణలకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఆ కూటమికి అంత మెజారిటీ లేదు. కోవింద్ కమిటీ దక్షిణాఫ్రికా, స్వీడన్, ఇండోనేషియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేసి, భారత దేశానికి సరిపడే కొన్ని సూచనలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఒక దేశం-ఒకే ఎన్నిక ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది.
 
ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన రెండు బిల్లులకు గత గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం నాడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో ఒక బిల్లు సమాఖ్య, రాష్ట్ర ప్రభుత్వాలకు జమిలి ఎన్నికలకు ప్రతిపాదిస్తే, రెండోది దిల్లీ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నిలతోపాటు నిర్వహించడం లక్ష్యంగా రూపొందింది. బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు, ఏకాభిప్రాయం కోసం రాజకీయ పార్టీలను సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది.
 
మద్దతు ఎవరు, వ్యతిరేకిస్తున్నది ఎవరు?
ఈ అంశంపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ అన్ని రాజకీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరిపింది. 47 రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలపగా, 15 పార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. మద్దతిచ్చిన పార్టీలలో ఎక్కువ పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలు లేదా అనుకూలమైనవి. ఈ పార్టీలన్నీ సమయం, డబ్బు, వనరుల పొదుపు గురించే మాట్లాడాయి. ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి పథకాలను నిలిపేయాాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, గత ఐదేళ్లలో 800 రోజులపాటు పాలన నిలిచిపోయిందని బీజేపీ వాదిస్తోంది.

"తరచూ ఎన్నికలు దేశ ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి.’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి ఒక దేశం- ఒకే ఎన్నిక విధానం ‘అప్రజాస్వామికం’ అని అభివర్ణించింది. ఈ తరహా ఎన్నికల విధానం దేశం పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను బలహీనపరుస్తుందని వాదించింది. ఎన్నికల ఖర్చుల గురించిన ఆందోళనలను పరిష్కరించడానికి ఖర్చులలో పారదర్శకతను పెంచడం ఒక మంచి పరిష్కారమని కొన్ని పార్టీలు సూచించాయి.