మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 26 జనవరి 2021 (14:35 IST)

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ పురస్కారం

భారత ప్రభుత్వం ఈ ఏడాది వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ అవార్డులు ప్రకటించింది. తెలుగు సినీ గాయకుడు, గత ఏడాది సెప్టెంబర్ 25న కరోనాతో తుది శ్వాస విడిచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.

 
భారతరత్న తరువాత అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ప్రభుత్వం ఈ ఏడాది ఏడుగురిని ఎంపిక చేసింది. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో ఆబెతో పాటు కర్నాటక నుంచి వైద్య రంగంలో సేవలు అందించిన డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డె, పురాతత్వవేత్త బీబీ లాల్, కళల విభాగంలో ఒడిషాకు చెందిన సుదర్శన్ సాహూ, సైన్స్ - టెక్నాలజీ విభాగంలోకర్నాటకకు చెందిన నరీందర్ సింగ్ కపానీ, ఆధ్యాత్మిక రంగంలో దిల్లీకి చెందిన మౌలానా వహీదుద్దన్ ఖాన్‌‌లకు ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది.

 
వీరిలో ఎస్పీ బాలు, నరీందర్ సింగ్‌లకు ఈ గౌరవం మరణానంతరం లభించింది. భారతీయ భాషల్లో వేలాది సినీ గీతాలు ఆలపించడమే కాకుండా, నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీపతి పండితారాధ్యుల బాలుసుబ్రహ్మణ్యంకు తమిళనాడు రాష్ట్రం తరఫున ఈ అవార్డు లభించింది.

 
ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే నాడు పద్మ అవార్డులను ప్రకటిస్తారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే వేడుకలో విజేతలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందుకుంటారు. భారత రాష్ట్రపతి ఈ ఏడాది మొత్తంగా 119 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించారు. ఇందులో ఒక అవార్డును ఇద్దరికి కలిపి ఇచ్చారు.

 
వీటిలో ఏడు పద్మవిభూషణ్, 10 పద్మభూషణ్ 102 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. పురస్కారాలకు ఎంపికైన వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. విదేశీ/ఎన్ఆర్ఐ విభాగంలో 10 మందికి అవార్డులు లభించాయి. 16 మందికి మరణానంతర పురస్కారాలు ప్రకటించారు. ఒక ట్రాన్స్‌జెండర్ కూడా ఈ గౌరవం దక్కించుకున్న వారిలో ఉన్నారు.

 
తెలుగు పద్మాలు...
ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. రామస్వామి అన్నవరపు (కళారంగం), ప్రకాశ్ రావు అసవడి (సాహిత్యం, విద్య), నిడుమోలు సుమతి (కళలు) ఏపీ నుంచి అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి కనకరాజును కళారంగంలో పద్మశ్రీ వరించింది.