మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 4 ఏప్రియల్ 2020 (13:34 IST)

అమెరికాను కరోనా వైరస్ ఎలా కాటేస్తుందో చూడండి, ఆ దేశం చేసిన తప్పులేంటి? ఒప్పులేంటి?

సుమారు రెండు నెలలు కన్నా ముందే అమెరికాలో తొలి కరోనావైరస్ కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి దేశమంతా అది విస్తరిస్తూ వచ్చింది. ఇప్పటికే సుమారు 2.77 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 7 వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

 
ప్రస్తుతం అమెరికా ప్రపంచంలో కరోనావైరస్‌కు కేంద్ర బిందువుగా మారింది. మొదట వైరస్ బయట పడ్డ చైనాలో పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. అటు యూరోప్‌లో ఇటలీ, స్పెయిన్ దేశాలు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు రానున్న రెండు వారాలు అమెరికాలో పరిస్థితులు దారుణంగా ఉండబోతున్నాయని సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో పాటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.

 
అయితే, ఈ వైరస్ విషయంలో అమెరికా వ్యవహరించిన తీరును చూస్తే కొన్ని లోపాలు, మరి కొన్ని సానుకూల అంశాలు ఇప్పటికే బయపడ్డాయి. అవేంటో ఓసారి చూద్దాం.

 
అమెరికా చేసిన తప్పులేంటి ?
అంతంత మాత్రంగా వైద్య పరికారల ఉత్పత్తి: మాస్కులు, గ్లౌజులు, గౌన్లు, వెంటిలేటర్లు. కరోనావైరస్ అనగానే చికిత్స చెయ్యాలంటే ఉండాల్సిన కనీస వస్తువులు ఇవి. అమెరికాలో వైద్యులకు, ఆస్పత్రులకు కొదవేం లేదు. కానీ ఈ వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిన ప్రాంతాల్లో మాత్రం చికిత్సకు అవసరమయ్యే కనీసం అవసరాలు అటు రోగులకు, ఇటు వైద్యులకు కరవయ్యాయి.

 
తగినంత సరఫరా లేకపోవడంతో సిబ్బంది ఉన్నవాటితోనే సర్దుకోవడం లేదా సొంతంగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వెంటిలేటర్ల కొరత కూడా తీవ్రంగానే ఉంది. ఫెడరల్ ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా చికిత్సకు అవసరమయ్యే పరికరాల కోసం పోటీ పడుతున్నాయని దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మంగళవారం న్యూయార్క్ గవర్నర్ అండ్రూ క్యూమో ఫిర్యాదు చేశారు. వెంటిలేటర్ కోసం 50 రాష్ట్రాలతో కలిసి ఈబేలో బిడ్డింగ్ వేసినట్టు పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

 
ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తగిన విధంగా సిద్ధం కావడంలో అమెరికా ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని జార్జి వాషింగ్టన్ యూనివర్శిటిలో హెల్త్‌ పాలసీ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జెఫ్రీ లెవీ విమర్శించారు. రోజు రోజుకీ సంక్షోభం ముదురుతున్నప్పటికీ ప్రభుత్వ ప్రతిస్పందన అంతంతమాత్రంగానే ఉందని అన్నారు.

 
“వ్యక్తిగత రక్షణకు అవసరమయ్యే వస్తువుల్ని అవసరం మేరకు సిద్ధం చేసుకోవడంలో ఇప్పటికే చాలా వారాలు వృథాగా గడిపేశాం. తగినంత ఉత్పత్తి జరిగేలా చూడటంలో ప్రభుత్వ అధికారులు తమకు ఉన్న అధికారాన్ని ఎప్పుడూ పూర్తి స్థాయిలో వినియోగించు కోలేదు.” అని జెఫ్రీ అన్నారు.

 
పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యం
ముందుగా మేల్కోవడంలో అమెరికా పూర్తిగా విఫలమయ్యిదంటున్నారు ప్రొఫెసర్ లెవి. దక్షిణ కొరియా, సింగపూర్‌లాంటి దేశాలు ముందుగానే సమస్య తీవ్రతను గుర్తించి పరీక్షలు ముమ్మరంగా నిర్వహించడంతో పరిస్థితి దిగజారకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ, అలా చెయ్యడంలో అమెరికా పూర్తిగా విఫలమైంది. దాంతో ఒక్కసారిగా సమస్య తీవ్రంగా మారింది.

 
“మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు గమనించడం ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవడంలో అత్యంత ప్రధానం. ఏం జరుగుతోంది? ఎక్కడ జరిగిందన్న విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి.” అని లెవీ అన్నారు. మున్ముందు కోవిడ్-19కి ఏ ప్రాంతం కేంద్ర బిందువు కాబోతోందన్న సమాచారం లేకుండా ప్రభుత్వ ఆరోగ్య విభాగం గుడ్డిగా పని చేసుకుంటూ వెళ్లింది.

 
ఈ వైఫల్యానికి ట్రంప్ ప్రభుత్వానిదే బాధ్యత అని లెవీ వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో తగిన ప్రణాళికల్ని రచిచంచడంలో విఫలమైందన్నారు. “నిజానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతలకు ప్రభుత్వంపై ఏ మాత్రం నమ్మకం లేదు. ఉన్న వనరుల్ని ఉపయోగించుకునే విషయంలో వాళ్లకు అడ్డు పడింది ఇదే. ఫెడరల్ ప్రభుత్వం ఇలాంటి సమయంలో తగిన విధంగా స్పందించి ఉండాల్సింది. ” అని లెవీ అభిప్రాయపడ్డారు.

 
ఇక పరీక్షల విషయానికొచ్చేసరికి మార్చి నెల మధ్య నాటికి సుమారు 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మార్చి 30 నాటికి కనీసం పది లక్షల మందికి కూడా పరీక్షలు నిర్వహించ లేకపోయింది. నిజానికి ఇతర దేశాలతో పోల్చితే అమెరికా చేసింది ఎక్కువే. కానీ, అక్కడున్న సుమారు 32 కోట్ల 90 లక్షల జనాభాతో పోల్చితే అది చాలా చాలా తక్కువ.

 
ఒకేసారి భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడంతో మొదట్లో ల్యాబొరేటరీలకు వాటన్నింటినీ విశ్లేషించి నివేదికలివ్వడం ఆలస్యమయ్యింది. అది జరగకుండా వీలైనంత వేగంగా పరీక్ష ఫలితాలు వచ్చి ఉంటే కనీసం పాజిటివ్ వచ్చిన రోగులైనా కనీస జాగ్రత్తలు తీసుకొని ఉండేవారు. ఫలితంగా అది మరింత విస్తరించకుండా ఉండేది.

 
ట్రంప్ చేసిన తప్పేంటి ?
మార్చి 31 మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యావత్ దేశంలో నెలకొన్న భయానక పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. “మున్ముందు కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ప్రతి అమెరికన్ సిద్ధంగా ఉండాలి.” అని అన్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కనీసం లక్ష మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ట్రంప్ ప్రభుత్వ వైద్య సలహాదారులు వెల్లడించారు.

 
అయితే ఇదే ట్రంప్ సరిగ్గా వారం రోజుల క్రితం ఏప్రిల్ రెండో వారం నాటికి పరిస్థితులు కుదుటపడతాయని, అన్ని కార్యకలాపాలు తిరిగి మొదలవుతాయని వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చైనాలో తలెత్తిన పరిస్థితి, ఆపై ఇటలీలో కరోనా సృష్టించిన కల్లోలాన్ని చూస్తూ కూడా అమెరికా అధ్యక్షుడు మాత్రం తమ దేశానికి ఎదురుకాబోయే ముప్పు తీవ్రతను ఎప్పటికప్పుడు తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు.

 
మొదట్లో కొద్ది సంఖ్యలో కేసులు నమోదైనప్పుడు పరిస్థితి అంతా అదుపులోనే ఉందని వేసవి నాటికి అంతా కుదుట పడుతుందని మసి పూసి మారేడుకాయ చేసేందుకు ట్రంప్ ప్రయత్నించారు.

 
సామాజిక దూరం పాటించడంలో వైఫల్యం
వసంతాన్ని ఆహ్వానించే పేరుతో కాలేజీ విద్యార్థులు ఫ్లోరిడా సముద్ర తీరంలో విచ్చల విడిగా తిరుగుతూ వచ్చారు. ఇక న్యూయార్క్ సబ్ వేలు అన్నీ కార్లతో నిండిపోయాయి. లూసియానాలో ఓ చర్చి పాస్టర్ ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించి వేలాది మందికి ఆహ్వానం పలుకుతునే ఉన్నారు.

 
పైగా ఆయన ఓ స్థానిక టీవీ చానెల్లో మాట్లాడుతూ “ఈ వైరస్ రాజకీయ పార్టీల సృష్టేనని మేం నమ్ముతున్నాం. మా మతపరమైన కార్యక్రమాల హక్కుల్ని మేం కాపాడుకుంటాం. ఎవ్వరు ఏమనుకున్నా మనం అందరం కలవబోతున్నాం.” అని చెప్పుకొచ్చారు. సామాజిక దూరం పాటించాలంటూ ప్రభుత్వ వైద్య వర్గాలిచ్చిన పిలుపును అమెరికన్లు ఏమాత్రం పట్టించుకోలేదనడానికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి.

 
మార్చి రెండో వారంలో సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడిన ఓ యువకుడు నాకు కరోనా వస్తే రానీయండి... నేను పార్టీ చేసుకోవడాన్ని అది ఏ మాత్రం ఆపలేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి దృష్టాంతాలు చూస్తుంటే ఈ విషయంలో జనం ఎంత నిర్లక్ష్యం వహించారో అర్థం చేసుకోవచ్చు. కొన్ని సార్లు వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు కూడా దారుణమైన ఫలితాల్నే ఇచ్చాయి. ఉదాహరణకు న్యూయార్క్‌ లో సబ్‌వేలను మూసివేయడం వల్ల బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి.

 
అలాగే, అన్ని యూనివర్సిటీలు తమ విద్యార్థుల్ని ఒకేసారి ఇంటికి పంపడం వల్ల కూడా వారి ద్వారా వైరస్ ఒక చోట నుంచి మరో చోటుకు విస్తరించేందుకు కారణమయ్యింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇరుగుపొరుగు వారి మధ్య రాకపోకలు సాగుతునే ఉన్నాయి. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఇంకా కనిపించడం లేదు.

 
యూరోపియన్ దేశాల నుంచి అమెరికా వచ్చే వారిని అడ్డుకునే విషయంలో అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టత కరవైంది. ఫలితంగా విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి. దాంతో చాలా చోట్ల స్క్రీనింగ్ పరీక్షలు సరిగ్గా జరగలేదు. ఫలితంగా వైరస్ సోకిన రోగులు చాలా సులభంగా దేశంలో ప్రవేశించగలిగారు.

 
విజయాలు - ఉద్దీపన ప్యాకేజీ
అత్యంత క్లిష్టమైన ఈ పరిస్థితుల మధ్య గత వారంలో 2 ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. అందులో భాగంగా చాలా మంది నేరుగా నగదు చెల్లించడంతో పాటు మరింత మంది నిరుద్యోగులకు సాయాన్ని అందించడం, రాష్ట్రాలకు సాయం చెయ్యడం, తగిన వైద్య సౌకర్యాలను కల్పించడం, ఇతర ప్రజా అవసరాలను తీర్చడం, తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమలను ఆదుకోవడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను అందించడం ఇలా అనేక చర్యలు తీసుకుంది. నిజానికి ఇది చరిత్రాత్మక నిర్ణయం.

 
“వాస్తవానికి ఇది ఉద్దీపన బిల్లు కాదు. బతికి బట్టకట్టేందుకు తీసుకొచ్చిన బిల్” అని 'ది వూల్ఫ్ ఎట్ ది డోర్: ది మీన్స్ ఆఫ్ ఎకనమిక్ ఇన్‌ సెక్యూరిటీ అండ్ హౌటు ఫైట్ ఇట్' పుస్తక రచయత గ్రెట్జ్ వ్యాఖ్యానించారు. ఖర్చుతో కూడుకున్న వైద్యం, అందరికీ వైద్యం అందుబాటులో లేకపోవడం, వైద్య పరికరాల ఉత్పత్తుల తగిన స్థాయిలో లేకపోవడం ఇలా అమెరికా వైద్య విధానాల్లో ఉన్న ఎన్నో లోపాలను ఎత్తి చూపింది ఈ కరోనా మహమ్మారి.

 
అయితే, అదే సమయంలో వైద్య పరిశోధనలకు, ఔషధాల తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో అమెరికాకున్న బలాన్ని కూడా ఈ మహమ్మారి హైలెట్ చేసింది. ఔషధ ఉత్పత్తి సంస్థలు, వైద్య పరిశోధకులు ఈ వైరస్‌ను నిర్మూలించడంలో భాగంగా మరింత లోతుగా పరిశోధనలు చెయ్యడం ద్వారా సరికొత్త విషయాలను తెలుసుకుంటున్నారు.

 
ఇప్పటికే ఓ సంస్థ అత్యంత వేగంగా ఫలితాన్నిచ్చే విధానాన్ని కనుగొంది. ఫలితంగా వైరస్‌ను మోసుకెళ్లే వారిని తక్షణం గుర్తించవచ్చు. పరీక్షలు నిర్వహించడంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి స్వస్తి పలకవచ్చు. ప్రభుత్వాధికారులకు ఈ విధానాన్ని అనుసరించడానికి అనుమతిస్తే కొత్తగా ఏ ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోందో గుర్తించి తక్షణం ఆ ప్రాంతాల్లో ఉండేవారిని క్వారంటైన్‌కు తరలించవచ్చు.

 
“వ్యాక్సిన్‌ తయారీ, చికిత్సకు సంబంధించిన జరుగుతున్న ప్రయత్నాల్లో అభివృద్ధి చాలా ప్రోత్సాహకరంగా ఉందని లెవీ అన్నారు. సైన్స్ ఆ పని పూర్తి చేసే ప్రయత్నంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఫలితాలు వెలువడేందుకు కొద్ది నెలలు లేదా అంతకన్నా ఎక్కువ మాత్రమే పడుతుందని చెప్పారు.

 
బహుశా మరో ఏడాదికల్లా వ్యాక్సీన్ అందుబాటులోకి రావచ్చని యూఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సంస్థ డైరక్టర్ అంథోని పౌచీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రోజు వచ్చేంత వరకు వైరస్ వ్యాప్తిని వీలైనంత వరకు కట్టడి చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు.

 
ఎవరి దారి వారిదేనా ?
అమెరికా రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రాలకు విస్తృత స్థాయిలో అధికారాలను కట్టబెట్టడం కొంత వరం మరికొంత శాపం కూడా. అంతా బాగానే ఉన్నప్పుడు ప్రజా వైద్య విధానాలకు బంధించి స్థానిక నేతలు ఎవరికి వారు రక రకాల ప్రయోగాలు చేస్తుంటారు.

 
ఆ ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన వారి విధానాలను స్వీకరించి దేశ వ్యాప్తంగా కూడా అమలు చేస్తుంటారు. కానీ ఇలా ప్రాణాంతక మహమ్మారి తలెత్తే సమయంలో మాత్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చర్యలు తీసుకుంటే సరిపోదు. అలా చెయ్యడం వల్ల తీవ్రమైన ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 
“ప్రతి గవర్నర్ తనకు తాను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొందరి నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వవచ్చు. మరి కొందరి నిర్ణయాలు ఇవ్వకపోవచ్చు” అని లెవీ అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్, కాలిఫోర్నియా గవర్నర్‌లను అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఒకరు తీసుకున్న ముందు జాగ్రత్తల కారణంగా బాధితుల సంఖ్య వందల్లో ఉండగా మరొకరి నిర్లక్ష్యం కారణంగా బాధితులు వేలల్లో ఉన్నారు.

 
దేశంలోని ప్రస్తుతం న్యూయార్క్‌ లో నెలకొన్న పరిస్థితే మున్ముందు మెజార్టీ మెట్రో నగరాల్లో ఏర్పడనుందని ఆరోగ్యశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. న్యూయార్క్ పరిస్థితి చూస్తున్న కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రానికి అలాంటి దుస్థితి ఎదురుకాకుండా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, మిగతా రాష్ట్రాలు ఆ స్థాయిలో ప్రయత్నించడం లేదు. ఫలితంగా ఆయా రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని లెవీ హెచ్చరించారు.

 
“అమెరికాలో ఉన్న సమస్య ఇదే. ఒక్కో రాష్ట్రం స్పందించే తీరు ఒక్కేలా ఉంటుంది. అందుకు కారణం ప్రజారోగ్యం విషయంలో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో కేటాయింపులు చేస్తుంటారు.” అని చెప్పుకొచ్చారు. అంతే కాదు, మొత్తంగా దేశంలో బలహీన రాష్ట్రాలకు ఏపాటి రక్షణ ఉందో తమకు కూడా అంతే రక్షణ ఉందని ప్రొఫెసర్ లెవీ చేసిన వ్యాఖ్య అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోంది.