1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 10 మే 2023 (21:34 IST)

గ్రహాన్ని నక్షత్రం ఎలా మింగేస్తుందో చూడండి, భూమికి మరణం వుందా?

Sun
నక్షత్రం గ్రహాన్ని మింగేస్తుందా? గ్రహానికి మరణం ఉంటుందా? భూమికి కూడా అలాగే జరగబోతోందా? ఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ, ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వంలో గుర్తించిన విషయాలు అది నిజమేనని చెబుతున్నాయి. విశ్వంలో ఇంతకుముందెన్నడూ ప్రత్యక్షంగా చూడలేని ఒక ఖగోళ అద్భుతాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక గ్రహం మరణాన్ని వారు గుర్తించగలిగారు. ఒక నక్షత్రం, ఒక గ్రహాన్ని మింగేస్తున్న ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా గమనించారు.
 
భూమి నుంచి సుమారు 12 వేల కాంతి సంవత్సరాల దూరంలో, అక్విలా నక్షత్ర రాశికి సమీపంలోని పాలపుంతలో నక్షత్రం గ్రహాన్ని మింగేసిన ఘటన సంభవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రహాలను నక్షత్రాలు తమలో కలిపేసుకోవడం లాంటి ఘటనలు గతంలో జరిగినా, ఎప్పుడూ వాటిని ప్రత్యక్షంగా గుర్తించలేకపోయారు. అంటే, ఒక గ్రహం నక్షత్రంలో కలిసిపోయిన తర్వాత, లేదంటే కలిసిపోక ముందు మాత్రమే గమనించగలిగారు. కానీ ఈసారి నక్షత్రం గ్రహాన్ని మింగేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడే గుర్తించగలిగారు. ఒక నక్షత్రం తన శక్తిని కోల్పోయినప్పుడు, తన చుట్టూ తిరుగుతున్న గ్రహాలు అందులో కలిసిపోతాయి. దీనినే గ్రహాన్ని నక్షత్రం మింగేయడంగా చెబుతున్నారు. భూమికి కూడా మరణం ఉంది. అయితే అందుకు కొన్ని బిలియన్ల సంవత్సరాల సమయం ఉంది.
 
గ్రహాల మరణం ఎలా?
గ్రహాన్ని నక్షత్రం మింగేయడాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ పరిధిలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన పరిశోధకుల బృందం గుర్తించింది. విశ్వంలో జరిగిన ఈ పరిణామాన్ని ఖగోళ విషయాలపై అధ్యయనం చేస్తున్న ఈ బృందం అనూహ్యంగా గుర్తించింది. ఒక నక్షత్రం కేవలం పది రోజుల్లో సాధారణ స్థాయి కంటే వంద రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా వెలిగిపోతుండడాన్ని ఈ బృందం తొలుత గుర్తించింది. నక్షత్రం మింగేయడంతో విశ్వం నుంచి కనుమరుగైన ఆ గ్రహం దాదాపు గురుగ్రహం అంత పెద్దగా ఉంది. ఉపరితలంపై వాయువులతో నిండిపోయి(గ్యాస్ జియాంట్) ఉందని గుర్తించారు.
 
నక్షత్రానికి దగ్గరగా ఉన్న ఆ గ్రహం ఒక్క రోజులోనే ఒక కక్ష్యను పూర్తి చేసిందని పరిశోధకుల బృందం గుర్తించింది. గ్రహాన్ని తనలో కలిపేసుకున్న ఆ నక్షత్రం పోలికలో సూర్యడికి దగ్గరగా ఉందని, సుమారు వంద రోజుల వ్యవధిలో ఆ నక్షత్రం గ్రహాన్ని మింగేసినట్లు గుర్తించారు. నక్షత్రంలో గ్రహం విలీనమయ్యే ముందు భారీగా దుమ్ము వ్యాపించడాన్ని గమనించారు. చివరి పది రోజుల్లో గ్రహం పూర్తిగా నక్షత్రంలో కలిసిపోయే క్రమంలో భారీ పేలుడు సంభవించినట్టుగా ప్రకాశవంతంగా కనిపించడాన్ని పరిశోధక బృందం గుర్తించింది.
 
భూమికి మరణం ఎప్పుడు?
భూమికి కూడా అలాంటి అంతం ఒకటి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే 500 కోట్ల సంవత్సరాల వరకు అలా జరిగే అవకాశం లేదని, సూర్యుడు కూడా మండిపోతూ సౌరవ్యవస్థలోని గ్రహాలను మింగేస్తాడని అంచనా వేస్తున్నారు.