ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శనివారం, 30 జులై 2022 (13:00 IST)

Single Women: దేశంలో ఒంటరి మహిళల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? వీరికి పెళ్లి మీద మనసు విరగడానికి కారణాలు ఏంటి?

single woman
"చిన్నప్పటి నుంచీ మా అమ్మ పడ్డ కష్టాలు చూశాను. పిల్లల్ని కనడం, కనకపోవడం మన చేతుల్లో ఉండదు. అలాంటి జీవితం వద్దనుకున్నాను. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఒక్కసారి కూడా రాలేదు. నాకు స్వేచ్ఛ కావాలి. పగలంతా ఉద్యోగం చేసి ఇంటికొచ్చిన తరువాత హాయిగా కప్పు టీ తాగి, నచ్చిన పని చేసుకోగలగాలి" హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న 39 ఏళ్ల భరణి మనసులోని మాటలవి. "పెళ్లి వద్దనుకోలేదు. నచ్చినవాడు దొరికితే తప్ప పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. అనుకూలమైన వ్యక్తి దొరకలేదు. ఎవరో ఒకరిని చేసుకోవాలనే ఆలోచన లేదు. ఈ సింగిల్ లైఫ్ హాయిగానే ఉంది" అంటున్నారు 39 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పూర్ణిమ.

 
"చిన్న వయసులోనే పెళ్లయిపోయింది. నా భర్త నన్ను చిత్రహింసలు పెట్టాడు. ఆ బంధం నుంచి బయటికొచ్చేశాను. మళ్లీ పెళ్లి మీదకు ధ్యాస మళ్లలేదు. నా చదువు, ఉద్యోగం నాకు బావుంది. అలాగని పెళ్లికి వ్యతిరేకం కాదు. నన్ను అర్థం చేసుకున్నవాడు దొరికితే మళ్లీ పెళ్లి అయినా, సహజీవనం అయినా ఓకే. లేకపోతే నాకిలాగే బావుంది" అన్నారు 37 ఏళ్ల షారోన్. ఒక మనదేశంలో ఇలా ఆలోచించేవారి సంఖ్య పెరుగుతోందని డాటా చెబుతోంది. భారతదేశంలో యువత పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారని ఇటీవల ఒక ప్రభుత్వ సర్వేలో తేలింది. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ జూలైలో విడుదల చేసిన 'యూత్ ఇన్ ఇండియా 2022' రిపోర్టులో, అన్ని వయసుల వారిలోనూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండే స్త్రీ, పురుషుల సంఖ్య పెరుగుతోందని వెల్లడైంది.

 
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 25-29 సంవత్సరాల వయసులో ఉన్నవారు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదని, 2011-2019 మధ్య అవివాహిత మహిళల శాతం దాదాపు రెండింతలు పెరిగిందని, పురుషుల్లో 12 శాతం పెరిగిందని ఈ సర్వే తెలిపింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన 'శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్ట్ 2019' ప్రకారం, దేశంలో ఒంటరి పురుషులు కేవలం 1.5 శాతం ఉండగా, ఒంటరి మహిళలు 5.2 శాతం ఉన్నారు. ఒంటరి మహిళలు అంటే విడాకులు తీసుకున్నవారు, భర్త చనిపోయినవారు లేదా పెళ్లయి వేరుగా ఉన్నవారు. రాష్ట్రాల ప్రకారం చూస్తే, ఒంటరి మహిళల శాతం కేరళ, తమిళనాడులలో ఎక్కువగా ఉంది. కేరళలో 9.2 శాతం, తమిళనాడులో 8.9 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 7.6, 7.0 శాతాలుగా నమోదైంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒంటరిగా ఉన్న పురుషుల సంఖ్య కన్నా మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది.

 
'పెళ్లిలో మహిళలకు ఎన్నో పరిమితులు, ఆంక్షలు'
పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, ప్రేమ వివాహమైనా స్త్రీలకు ఎన్నో పరిమితులు, ఆంక్షలు ఉంటున్నాయంటున్నారు భరణి. పెద్ద పెద్ద నగరాల్లో కొంత మార్పు వచ్చిందేమోగానీ, ఊళ్ళల్లో పరిస్థితి ఏమీ మారలేదు అంటున్నారామె. "మా అమ్మ, నాన్నలది ప్రేమ వివాహం. చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. మా నాన్న బాగా చదువుకున్న వ్యక్తి. మంచి ఉద్యోగం చేసేవారు. రోజూ తాగొచ్చి మా అమ్మని కొట్టేవారు. మా అమ్మ పిల్లల్ని కనడానికే అన్నట్టు ఉండేవారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తరువాత మళ్లీ మగపిల్లాడి కోసం ప్రయత్నించారు. నా చిన్న చెల్లిని చంకలో ఎత్తుకుని, ఏడునెలల గర్భంతో ఉన్న మా అమ్మని అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లాను’’ అని తన అనుభవాలను వివరించారు భరణి.

 
‘‘ఈ బాధలు భరించలేక మా నాన్నను వదిలేసి మేమంతా బయటికొచ్చేశాం. చిన్న వయసు నుంచే సంసార భారం నా మీద పడింది. దాంతో, నాకు పెళ్లి అంటేనే విసుగొచ్చింది. ఒక్కసారి కూడా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనగానీ, రొమాన్స్ వైపుగానీ దృష్టి వెళ్లలేదు" అన్నారామె. అప్పుడప్పుడూ ఒంటరితనం బాధిస్తుంది గానీ పెళ్లి చేసుకుని కష్టాలు పడడం కంటే ఒంటరితనమే నయమనిపిస్తుందని ఆమె అన్నారు. "నాకంటూ కొంత స్పేస్ కావాలి. పని చేసి వచ్చాక, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడమో, పాటలు పాడుకోవడమో.. నాకు నచ్చిన పని చేసుకోగలగాలి. నా వయసువాళ్లు, పెళ్లి చేసుకున్నవాళ్లని చాలామందిని చూశాను. ఈ కష్టాలు వద్దు అన్న భావన బలపడిందే తప్ప తగ్గలేదు’’ అన్నారు భరణి.

 
‘‘అమ్మ, నాన్నల మధ్య మనస్పర్థల వల్ల నా చిన్నతనమంతా ఒంటరితనంతోనే గడిచింది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. స్నేహితుల ఇంటికి వెళ్లే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. నాకు 18 ఏళ్లు వచ్చేవరకు మా అమ్మమ్మ వాళ్లను సరిగా కలిసింది లేదు. అన్ని పరిమితుల మధ్య పెరిగాను’’. ‘‘మా అమ్మకు కూడా ఏ స్వేచ్ఛా ఉండేది కాదు. మగపిల్లాడు పుట్టాలని మా నాన్న మంకుపట్టు పట్టారు. మా అమ్మకు 9-10 డెలివరీలు అయ్యాయి. ఆమె ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. ఇంట్లో నేనే పెద్దదాన్ని కాబట్టి, మా అమ్మ డెలివరీలకి నేనే పక్కన ఉండేదాన్ని. పెద్ద సంసారం వల్ల మా అమ్మకు రెస్ట్ కూడా ఉండేది కాదు. డెలివరీ అయిన మర్నాడే పొట్టకు గట్టిగా గుడ్డ కట్టుకుని పనులకు ఉపక్రమించేవారు. ఇవన్నీ చూసి విసుగొచ్చింది. యుక్తవయసుకు వచ్చిన తరువాత కూడా ఎప్పుడూ పెళ్లి ఆలోచనలు రాలేదు. ఒక్కరోజు రోజు కూడా మగ తోడు కోసం కలలు కన్నది లేదు.’’

 
‘‘నాకున్న లక్ష్యం ఒక్కటే.. బాగా చదువుకుని, సంపాదించి అమ్మని, చెల్లెళ్లని ఆ పంజరంలోంచి బయటకు తీసుకురావాలి. ఇదొక్కటే నా మనసులో ఉండేది. గృహహింసతో పాటు మహిళలకు ఎలాంటి హక్కులు, స్వేచ్ఛ లేకపోవడం, పిల్లల్ని కనాలా, వద్దా అనే నిర్ణయం స్త్రీల చేతుల్లో లేకపోవడం, మగపిల్లాడిని వంశోద్ధారకుడిలా చూడడం.. ఇవన్నీ చూశాక జీవితంలో పెళ్లి అనేదే వద్దు అనుకున్నా" అని భరణి చెప్పారు.

 
'ఆత్మీయ స్పర్శ కావాలి గానీ.. ఆ బాధలు పడలేను'
పిల్లల్ని కనడం అంటే ఒక రకమైన భయం ఏర్పడిందని, శారీరక సంబంధం అంటే వణుకు పుట్టిందని అన్నారు. ఇంట్లో పెద్దవాళ్లు పెళ్లి సంబంధాలు తీసుకొచ్చారు కానీ, పిల్లలని కనడం ఇష్టం లేదని చెప్పగానే మగపెళ్లివారు వెనక్కి వెళ్లిపోయేవారని చెప్పారు. "చిన్నతనంలో నేను చూసిన లైంగిక హింస, గృహ హింస వలన శారీరక సంబంధం అంటే ఆసక్తి పోయింది. నా స్నేహితుల ద్వారా విన్న విషయాలు మనసులో బలంగా నాటుకుపోయాయి. స్వేచ్ఛ ఉండదని, సంపాదించిన ప్రతి పైసా భర్తకు ఇవ్వాలని, నచ్చినట్టు బతికే అవకాశం ఉండదని చెబుతూ ఉండేవారు. దాంతో, నాకు ఏ దశలోనూ పెళ్లి మీదకు ధ్యాస మళ్లలేదు. నాకు తండ్రి ప్రేమ దక్కలేదు. పెళ్లి చేసుకుంటే నాకన్నా పెద్దవారు, నన్ను ఆత్మీయంగా చూసుకునేవారు కావాలని కోరుకున్నా. నాకొక ఆత్మీయ స్పర్శ కావాలి. అంతకు మించి ఇంకేం వద్దు. అయితే, ఆ ప్రేమ కోసం స్వేచ్ఛ వదులుకోవాలి, బాధలు పడాలి అంటే మాత్రం కష్టం. జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడమే మేలు. ఇది నేను స్వయంగా తీసుకున్న నిర్ణయం. నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను" అని చెప్పారు భరణి.

 
'పొద్దున్నంతా సీతాకోకచిలుకలా ఉండేదాన్ని.. రాత్రి ముడుచుకుపోయేదాన్ని'
పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న దళిత అమ్మాయి షారోన్‌ది మరో కథ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల షారోన్ ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా పనిచేస్తున్నారు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన అబ్బాయిని 17 ఏళ్లకే వివాహం చేసుకున్నారు. కానీ, రోజూ తనను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని వెల్లడించారామె. "నేనొక చిన్న పల్లెటూర్లో పుట్టాను. అక్కడ దళిత కమ్యూనిటీలో ఆడపిల్లలు చదువుకోవడం అరుదు. కానీ, మా అమ్మ, నాన్నలు నన్ను మా చెల్లెళ్లను చదివించారు. అయితే, ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేసేయాలనే ఒత్తిడి వాళ్లపై ఉండేది. దాంతో, నాకు మరీ చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. నేనంటే ఇష్టమని ఒక అబ్బాయి నా వెనక పడేవాడు. మా ఇంట్లో మాట్లాడమని చెప్పాను. తనది వేరే కులం. అయినా ఏ ఇబ్బందీ రాలేదు.

 
అన్నీ కుదరడంతో 17 ఏళ్లకే పెళ్లయిపోయింది. కానీ, శారీరకంగా తనకు దగ్గర కాలేకపోయాను. ఏదో తెలియని భయం ఉండేది. దాంతో అతడు నన్ను రేప్ చేయడం ప్రారంభించాడు. మారిటల్ రేప్ అంటారు కదా. అలా రోజూ నాపై అత్యాచారం చేసేవాడు. దాంతో, నేను గర్భవతిని అయ్యాను. తనకు తాగుడు అలవాటు ఉండేది. రోజూ రాత్రి కొట్టేవాడు. నాకు బాబు పుట్టి రెండేళ్లు వచ్చేవరకు దెబ్బలు తినని రోజు లేదు. నా ఒంటి మీద గాయాలు బయటకు కనిపించేవి. అందరూ పట్టి పట్టి చూసేవారు. గుసగుసలాడుకునేవారు. ఇప్పటికీ నా మనసుపై పడిన గాయాల గుర్తులు మానలేదు.

 
స్కూల్లో ఉన్నంతవరకు ఒక సీతాకోకచిలుకలా ఉండేదాన్ని. ఇంటికి రాగానే ముడుచుకుపోయేదాన్ని. మానసికంగా చాలా వేదన అనుభవించాను. అతడు పెట్టే హింస భరించలేక అతడి నుంచి వేరుగా వచ్చేశాను. నాకు 18 ఏళ్లకే టీచరుగా ఉద్యోగం వచ్చింది. ఆ ఏడాది బ్యాక్‌లాగ్ పోస్టులు రిక్రూట్ చేశారు. రిజర్వేషన్ ఉండడం వలన నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ధైర్యంతో బయటకి వచ్చేశా. మా అమ్మ, నాన్న నన్ను సపోర్ట్ చేశారు. నువ్వు బతికుంటే చాలు అన్నారు. అందుకే వేరుపడ్డాను" అని షారోన్ చెప్పారు. షారోన్ తన భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్నా, అప్పుడప్పుడూ ఇంటి మీదకొచ్చి గొడవపెడుతూ ఉండేవారు. వీధిలో అందరికీ తెలిసేలా కేకలు వేసేవారు. దాంతో, ఎవరికీ చెప్పకుండా తన చెల్లిని తీసుకుని హైదరాబాదు వచ్చేశారు షారోన్.

 
పెద్ద చదువులు చదువుకుని, సివిల్ సర్వీసులోకి వెళ్లాలని షారోన్ చిన్నప్పుడు కలలు కనేవారు. అవేమీ తీరకుండానే ఆమెకు పెళ్లయిపోయింది. హైదరాబాదు వచ్చాక ఆ కలలు నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు. బీ.ఈడీలో జాయిన్ అయి టీచింగ్ కోర్సు పూర్తి చేశారు. జర్నలిజంలోకి అడుగుపెట్టి శిక్షణ తీసుకున్నారు. మరో పక్క సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. "జర్నలిజంలోకి అడుగుపెట్టాక నా ఆలోచనల్లో ఎంతో మార్పు వచ్చింది. నాకు శిక్షణ ఇచ్చిన గురువులు ఎంతో ఆదరించారు. అప్పుడే నాకు మానవ హక్కుల కార్యకర్తలతో పరిచయం అయింది. నా భర్త నుంచి విడాకులు తీసుకుని స్వేచ్ఛగా బతకవచ్చు అనే ఆలోచన వచ్చింది. అప్పటికే నేను సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. విడాకుల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక పోలీసు అధికారి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 'నీ భర్త మీద ప్రతీకారం దిశగా ఆలోచించవద్దు. నీకు మంచి ఉద్యోగం ఉంది, చదువుకుంటున్నావు, విడిపోయి నీ బతుకు నువ్వు బతుకు' అంటూ నాకు సర్ది చెప్పారు. ఆయన మాటలు సబబుగా అనిపించాయి. పరస్పర అంగీకారంతో విడాకులు వచ్చేలా ఆయన సహాయం చేశారు. అలా చట్టబద్ధంగా విడిపోయాం" అని షారోన్ చెప్పారు.

 
'అప్పుడప్పుడూ ఒంటరితనం బాధిస్తుంది'
ఆర్థిక ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, మానసికంగా అలసిపోయినప్పుడు ఒక తోడు కావాలనిపిస్తుందని షారోన్ అన్నారు. "బాబు కోసం అన్నీ నేనే చేయాల్సి వచ్చినప్పుడు, బాగా అలిసిపోయినప్పుడు ఎవరైనా తోడు ఉంటే బాగుండును అనిపిస్తుంది. బాబు ఎప్పుడైనా చికెన్ కావాలని అడిగితే మాంసం కొట్టుకెళ్లి నేనే తెచ్చేదాన్ని. అక్కడ అందరూ నన్ను వింతగా చూసేవారు. వాడిని సినిమాకు తీసుకెళ్లేదాన్ని. అక్కడా పదిమంది చూపులు నా మీదే ఉండేవి. ఇలాంటి సందర్భాల్లో వాడికి నాన్న ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నా మాజీ భర్త కాదు. అతడిని నేను మళ్లీ కలవను. ఇంకెవరైనా నాకు తోడుగా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. ఎప్పుడైనా విసుగొచ్చి, మానసికంగా అలిసిపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంతే తప్ప నేను వైవాహిక జీవితాన్ని ఏం మిస్ అవ్వట్లేదు. నేను హాయిగానే ఉన్నాను" అన్నారు షారోన్. తన బాబు తనకు పెద్ద ఆస్తి అని, ఎంతో అర్థం చేసుకుండాని షారోన్ చెప్పారు.

 
"చిన్నవాడు కదా, తండ్రి లేడని స్కూలో ఏడిపిస్తారేమోననే భయం ఉండేది. వాడు మాత్రం ధైర్యంగా 'మా అమ్మ విడాకులు తీసుకుంది అని చెప్తా. అందులో తప్పేముంది మమ్మీ' అంటాడు. నా గురించి బాగా పట్టించుకుంటాడు. ఫాదర్స్ డే నాడు నన్ను విష్ చేస్తాడు. 'మై మామ్ ఈజ్ మై ఫాదర్' అని రాసి గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. మా అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. విడాకులు తీసుకోవడం పెద్ద నేరంలా ఎవరూ చూడరు. నా కుటుంబం నాకు పెద్ద అండ. నాకే లోటూ లేదు" అని చెప్పారు షారోన్. అయితే, ఒక స్త్రీగా తనకు లైంగిక హక్కులు ఉంటాయని, ఆ ఆనందం పొందకుండా ఎందుకు ఉండాలనే ప్రశ్న అప్పుడప్పుడూ వస్తుందని ఆమె అన్నారు. "నన్ను ఇష్టపడి, గౌరవించేవాడు దొరికితే మళ్లీ పెళ్లి లేదా సహజీవనానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ, అలాంటివాళ్లు ఎవరూ కనబడలేదు. ఎవరో ఒకరిని చేసుకోవాలనే ఆలోచన లేదు. మంచివాడు దొరికితే సరే, లేదంటే ఈ జీవితమే బాగుంది నాకు నాకు" అన్నరామె.

 
'కావాలని తీసుకున్న నిర్ణయం కాదు.. అలా జరిగింది'
ఐటీ ప్రొఫెషనల్ పూర్ణిమకు నచ్చిన వ్యక్తి దొరకకపోవడం, ఇంట్లో చూసిన సంబంధాలు కుదరకపోవడంతో పెళ్లి జరగలేదు. నేను సంతోషంగా ఉన్నానా, లేదా అనేది నలుపు, తెలుపుల్లా గీతలు గీసి చెప్పే విషయం కాదు అంటున్నారు 39 ఏళ్ల పూర్ణిమ. పెళ్లి అయినవారికి, కానివారికి కూడా జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయని, సుఖదుఃఖాలు కలిసే ఉంటాయని అంటున్నారామె. "ఇది నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. పెళ్లి జరగలేదు. నాకు 27-28 ఏళ్లు వచ్చేసరికే ఇంక నాకు పెళ్లి కాదు అనే నిశ్చయానికి వచ్చేశా. నా చుట్టూ ఉన్నవారు కూడా, అప్పటికే బాగా ఆలస్యమైపోయిందనే ఆలోచన నా బుర్రలో పెట్టారు. అయితే, ఒక విషయంలో మాత్రం నేను కచ్చితంగా ఉన్నాను. ఆలస్యమవుతోందని ఎవరినో ఒకరిని చేసుకునే ఉద్దేశం లేదు. ఆ వ్యక్తి పూర్తిగా నచ్చి, మా ఇద్దరి మధ్య అవగాహన ఉంటే తప్ప పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదనుకున్నా. నాకు 35-36 ఏళ్లు వచ్చేవరకు ఏదో రకంగా నాకు పెళ్లి జరుగుతుందని అందరూ ఊహిస్తూ ఉండేవారు.ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసేవారు. కానీ, కుదరలేదు" అంటూ చెప్పారు పూర్ఠిమ.

 
పెళ్లి కాని అమ్మాయిలకు సమాజం ఏ రకమైన సపోర్ట్ అందించదని, బంధువులు పెట్టే టార్చర్ భరించలేమని అన్నారు. "చుట్టాలు, బంధువులు ఊరుకోరు. మా అమ్మ, నాన్నల బుర్రల్ని కూడా పాడుచేశారు. మా నాన్న చాలా ప్రోగ్రెసివ్. నేను, మా చెల్లి బాగా చదువుకోవాలి. ఉద్యోగం చేసి సంపాదించిన తరువాతే పెళ్లి చేసుకోవాలనేవారు. మమ్మల్ని బాగా చదివించారు కూడా. అలాంటి నాన్న కూడా నా పెళ్లి విషయంలో బెంగ పెట్టేసుకున్నారు. వాళ్ల నుంచి కూడా నాకు సపోర్ట్ కరువయింది. దాంతో, నేను మానసికంగా బాగా దిగులుపడిపోయాను. డిప్రెషన్ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అయినా సరే, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకోలేదు. నచ్చినవాడు దొరికితేనే పెళ్లి అనుకున్నా. అది నా నిర్ణయం. కాబట్టి ఆ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను.

 
పెళ్లి, సంసారం అంటే అదో అందమైన జీవితం అన్న భావన నాకెప్పుడూ కలగలేదు. ఎందుకంటే, నాతోటి స్నేహితులు పెళ్లి చేసుకుని కష్టాలు పడడం చూశాను. బాధలు పడుతున్నా, ఆ వివాహ బంధంలోంచి బయటకు రాలేక నలిగిపోతున్నవారు ఉన్నారు. బయటికొస్తే ఒంటరిగా జీవితం గడపాలనే భయం, విడాకులు తీసుకున్న మహిళలను సమాజం చిన్నచూపు చూస్తుందనే భయం. ఇవన్నీ చూశాక, పెళ్లయితే అంతా బావుంటుందన్న భావన నాకెప్పుడూ కలగలేదు" అన్నారు పూర్ణిమ.

 
'పెళ్లి కాని అమ్మాయిలకు ఇళ్లు అద్దెకివ్వరు'
పెళ్లి కాని అమ్మాయిలకు ఇళ్లు అద్దెకు దొరకడం గగనం అంటున్నారు భరణి. హైదరాబాదు పేరుకే నగరమైనా మనుషుల మనస్తత్వాలు మారలేదని, పెళ్లి అవ్వలేదు అనగానే అనుమానపు చూపులు చూస్తారని, ఇళ్లు అద్దెకు ఇవ్వరని చెప్పారామె. "ఇంటి కోసం వెళితే ముందు 'పెళ్ళయిందా, లేదా?" అని అడుగుతారు. అవ్వకపోతే ఎందుకు అవ్వలేదని ఆరా తీస్తారు. ఒకవేళ ఇల్లు అద్దెకు ఇచ్చినా, చుట్టుపక్కల వాళ్ల చూపులన్నీ నా మీదే ఉంటాయి. మగ స్నేహితులను గానీ, నాతో పనిచేసే కలీగ్స్‌ను గానీ ఇంటికి ఆహ్వానించలేను. అమెజాన్, స్విగ్గీ వాళ్లు వచ్చినా అనుమానంగా చూస్తారు. నాకు సీసీటీవీ కెమెరా అక్కర్లేదు. చుట్టుపక్కల వాళ్ల చూపులే చాలు" అంటూ జోక్ చేశారు భరణి. తనకూ ఇలాంటి అనుభవాలే ఉన్నాయని చెప్పారు పూర్ణిమ. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమెకు ఇల్లు వెతుక్కోవడానికి దాదాపు 3-4 నెలలు పట్టిందని చెప్పారు. అంత మహా నగరంలో, ధనికులు ఉండే ప్రాంతాల్లో కూడా సింగిల్ అయితే ఇల్లు అద్దెకు ఇవ్వమని నిర్మొహమాటంగా చెప్పేస్తారని పూర్ణిమ అన్నారు.

 
'ఎందుకు మమ్మల్ని మాలా బతకనివ్వరు?'
వీధిలో నడిచి వెళుతుంటే మెడలో తాళి ఉందా, పాపిట కుంకుమ ఉందా అని గుచ్చి గుచ్చి చూస్తారని, బుర్ర దించుకుని నడవాల్సి వస్తుందని భరణి వాపోయారు.
సోషల్ మీడియాలో సింగిల్ స్టేటస్ చూసి వెకిలి వేషాలు వేసేవాళ్లు చాలామంది ఉంటారని, వారి నుంచి తప్పించుకోవడం మరో యాతన అని ఆమె అన్నారు. "ఓసారి ఎంత వెతికినా ఇల్లు దొరకలేదు. చివరకు ఒక అబద్ధం ఆడాల్సి వచ్చింది. నిజం తెలిసాక వాళ్లు నన్ను ఇల్లు ఖాళీ చేయమన్నారు. సోషల్ మీడియాలో వేధింపులు తప్పించుకోవాలంటే 'మ్యారీడ్' అని అబద్ధం రాయాలి. నేనెందుకు అబద్ధం చెప్పాలి? ఎందుకు నా బతుకు నన్ను బతకనివ్వరు?" అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు.

 
‘నా ప్రతీ నవ్వుకు నేనెందుకు లెక్క చెప్పాలి?’
పూర్ణిమకు తన కెరీర్ అంటే చాలా మక్కువ. దానితో పాటు కథలు రాయడం, పెయింటింగ్, పలు భాషలు నేర్చుకోవడంపై ఆమెకు చాలా ఆసక్తి. తన అభిరుచులను మెరుగుపరుచుకుంటూ, ఎప్పుడూ బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. "నా పనుల్లో నేను బిజీగా ఉంటూ, సంతోషంగా ఉన్నాను. ఒకవేళ ఎప్పుడైనా బాధ కలిగినా, ఏడ్చి కళ్లు తుడుకుని, మళ్లీ నవ్వుకుంటూ ముందుకు వెళతాను. నా నవ్వు చూసి చాలామందికి అనేక సందేహాలు, ప్రశ్నలు. పెళ్లి కాకుండా నేనెలా సంతోషంగా ఉన్నానని అడుగుతారు. నా ప్రతీ నవ్వుకు లెక్క చెప్పాలంటే ఎలా?" అని అడుగుతున్నారు పూర్ణిమ. ఆఫీసులో కలీగ్స్ చూపించే వివక్ష, స్నేహితుల దెప్పిపొడుపులు మరో రకంగా ఉంటాయని వివరించారామె.

 
"నేను వంట చేసుకుంటాను. రోజూ లంచ్ బాక్స్ తీసుకెళతాను. అదో పెద్ద ఆశ్చర్యం వీళ్లకి. ఒక్కర్తికీ వంట ఎలా చేసుకోబుద్ధేస్తుంది? అంటూ కనుబొమలు ఎగరేస్తారు. నేను అవివాహితను కాబట్టి నాకు పెళ్లి కార్డులు ఇవ్వరు. ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, వాళ్ల సంసార విషయాలు ఏవో చెబుతారు. నాకు చెప్పడానికి ఏమీ ఉండదు. పైగా ఇవన్నీ నీకర్థం కావులే అంటారు. అలా నాలో గిల్టీ ఫీలింగ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. కొత్తగా పరిచయమైన వారు కూడా రెండుసార్లు కలవగానే పెళ్లి ఎందుకు కాలేదు, కారణాలేంటి అని ఆరా తీస్తారు. లేదా అతి చనువు తీసుకుని, దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు" అని పూర్ణిమ చెప్పారు. ఒక మనిషిని కలవగానే పెళ్లి గురించి ఎందుకు అడుగుతారని, జీవితంలో పెళ్లికి ఇచ్చే విలువ ఇతర అంశాలకు ఎందుకు ఇవ్వరని ఆమె ప్రశ్నిస్తున్నారు.

 
"స్త్రీ అయినా, పురుషుడు అయినా పెళ్లి ఒక్కటే జీవిత పరమార్థం కాదు కదా. పెళ్లయిందా, పిల్లలున్నారా అని ఎందుకు అడుగుతారు? మన మొహం చూసి మన వయసు గురించి ఒక అంచనాకు వస్తారు. ఇక విశ్లేషణ మొదలుపెడతారు. కొత్తగా పరిచయమైనప్పుడు ఏం చదువుతున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు, సినిమాలు చూస్తావా, ప్రయాణాలు చేస్తుంటావా ఇలా ఏదైనా అడగవచ్చు. పెళ్లి, పిల్లల ప్రస్తావన తీసుకు రాకూడదనే అవగాహన సమాజానికి రావాలి" అంటారు పూర్ణిమ. సమాజంలో కొన్ని భావాలు పాతుకుపోయాయని, గ్యాస్ బిగించడం, కరెంటు పోతే ఫ్యూజ్ వేయడం లాంటి పనులు ఆడవాళ్లూ చేయగలరని, నేర్చుకుంటే అన్ని పనులూ అందరికీ వస్తాయని చెబుతున్నారామె. అలాగే, మన వయసును అంచనా వేసి, మనల్ని అడగకుండా మిసెస్ అని రాసేస్తారని, తనకు ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చేరినప్పుడు ఈ అనుభవం ఎదురైందని, మళ్లీ అన్ని పత్రాల్లో మిస్ అని మార్పించుకోవాల్సి వచ్చిందని, ఈ వైఖరి మారాలని అన్నారు.

 
కోవిడ్ లాక్‌డౌన్ వల్ల ఆలోచనల్లో మార్పులు వచ్చాయా?
ప్రత్యేకంగా కోవిడ్ లాక్‌డౌన్ వల్ల తనకెలాంటి సమస్యలూ రాలేదని, తన కొడుకు, తల్లిదండ్రులు, చెల్లి తోడుగా ఉండడం వల్ల ఒంటరితనం బాధించలేదని షారోన్ చెప్పారు. భరణి మాత్రం కోవిడ్ లాక్‌డౌన్ బాధించిందని చెప్పారు. ఆ సమయంలో మరీ ఒంటరిగా అనిపించిందని చెప్పారు. "లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ క్లాసులు కావడంతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. అప్పుడు మాత్రం కనీసం మాట్లాడేందుకు ఇంట్లో ఒక మనిషి ఉంటే బాగుంటుంది అనిపించింది. అర్థరాత్రి నాకేదైనా అయితే ఎలా అన్న ప్రశ్న వచ్చేది. నాకు భయమేస్తే, శ్వాస ఆడకపోతే కనీసం మంచినీళ్లు ఇచ్చేవారు లేరే అనుకున్నా. కానీ, ఆ కాస్త స్పర్శ కోసం జీవితాంతం లేనిపోని బాధలు పడాలా అని మరోపక్క అనిపించేది. ఒంటరితనం కన్నా నా స్వేచ్ఛ పోతుందనే భయమే ఎక్కువ నాకు" అని ఆమె చెప్పారు.

 
కోవిడ్ వలంటీర్‌గా పనిచేశారు పూర్ణిమ. నిజానికి కోవిడ్ లాక్‌డౌన్‌తో తన వైఖరి పాజిటివ్‌గా మారిందని చెప్పారామె. "వలంటీర్‌గా పనిచేస్తూ చాలా చూశాను. ఎంతోమంది జీవితాలు కోల్పోయారు. రేపు అన్నది ఉంటుందో లేదో తెలీదు. ఇవాల్టి రోజే లెక్క. ఆ అనుభవం నాలో సానుకూల దృక్పథం పెంచింది. ఉన్నది ఒకటే జీవితం. వాళ్లమనుకుంటారు, వీళ్లేమనుకుంటారు అని ఆలోచించకుండా నచ్చినట్టు బతకడం ముఖ్యం అన్న జ్ఞానోదయం కలిగింది. డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యలున్నా, వాటిని అధిగమించి జీవితాన్ని హాయిగా గడపాలనే నిర్ణయానికొచ్చాను. ఇప్పుడు నేను ఇంకా సంతోషంగా ఉన్నాను" అని చెప్పారు పూర్ణిమ.

 
స్టేటస్ సింగిల్
గత దశాబ్ద కాలంగా భారతదేశంలో సింగిల్ వుమెన్ సంఖ్య పెరుగుతూ వస్తోందని, దేశంలో ప్రస్తుతం, ఎప్పుడూ లేనంతగా ఏడు కోట్లకు పైగా ఒంటరి మహిళలు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరి కోసం ఫేస్‌బుక్ ‌లో 'స్టేటస్ సింగిల్' అనే గ్రూపు కూడా ఉంది. దీన్ని 2020లో క్రియేట్ చేశారు. 7.4 కోట్ల ఒంటరి మహిళల కథలు వినిపించేందుకే ఈ వేదిక ఏర్పాటు చేశామని గ్రూపు పరిచయ వాక్యాల్లో పేర్కొన్నారు.


"అవివాహిత మహిళలు, విడాకులు తీసుకున్నవారు లేదా వేరుగా ఉంటున్నవారు, భర్త చనిపోయినవారు, లేక కుటుంబం వదిలేసిన మహిళలు, ఎల్జీబీటీ సమూహాలకు చెందినవారు తమ కథలను వినిపించడానికే ఈ వేదికను ప్రారంభించాం. వారు ఎదుర్కొనే సమస్యలు చర్చించడానికి, సాటి మహిళలకు అండగా ఉండడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది" అని పరిచయ వాక్యాల్లో రాశారు. అయితే, ఇది ఒక ప్రైవేటు గ్రూపు. ఒంటరి మహిళలకు మాత్రమే పరిమితం. ఇందులో 2,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు. సమాజంలో కొన్ని భావాలు పాతుకుపోయాయని, ఒంటరి మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కుంటున్నారని, తమ మనసు విప్పి చెప్పుకునేందుకు, సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగకరంగా ఉందని పూర్ణిమ అన్నారు.