శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 10 డిశెంబరు 2022 (16:16 IST)

స్టేటస్ సింగిల్: ‘ఎస్..మేం ఒంటరివాళ్లం’ అని గర్వంగా చెప్పుకునే మహిళల సంఖ్య భారత్‌లో పెరుగుతోందా?

woman
భారత్‌లో మంచి భార్య, మంచి తల్లిగా కావాలని చెబుతూ ఆడపిల్లలను పెంచుతారు. ఇక్కడ ఆడపిల్ల జీవితంలో ముఖ్యమైన లక్ష్యం పెళ్లి. అయితే, నేడు చాలా మంది అమ్మాయిలు ఒంటరిగా జీవించేందుకే మొగ్గుచూపుతూ కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దక్షిణ దిల్లీలో ఓ హోటల్‌లో గత ఆదివారం రెండు డజన్ల మంది మహిళలు సమావేశమయ్యారు. ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యాను. హోటల్ గది మొత్తం సందడిగా, నవ్వులతో నిండిపోయింది.
 
ఫేస్‌బుక్‌లోని ‘‘స్టేటస్ సింగిల్’’ కమ్యూనిటీలో వీరంతా సభ్యులు. భారత్‌లోని పట్టణాల్లో ఒంటరిగా జీవించే మహిళల కోసం ఏర్పాటుచేసిన గ్రూప్ ఇదీ. ‘‘వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, పెళ్లికాని వారు.. ఇలాంటి పదాలతో సంబోధించడం ఇక్కడితో ఆపేయండి’’అని ఈ గ్రూప్ మొదలుపెట్టిన రచయిత శ్రీమోయి ప్యో కుందు వ్యాఖ్యానించారు. ‘సగర్వంగా మనం ఒంటరిగా జీవిస్తున్నాం(ప్రౌడ్లీ సింగిల్) అని చెప్పుకుందాం ’’అని ఆమె అన్నారు. వెంటనే చుట్టుపక్కల మహిళలంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.
 
పెళ్లి గురించి విపరీతంగా చర్చించుకునే భారత్‌లో ఒంటరిగా జీవించడాన్ని చాలా మంది తప్పుగా భావిస్తారు. దీని గురించి చాలా అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలను కుటుంబాలకు భారంగా పరిగణిస్తారు. ఒంటరిగా ఉండేవారు, వితంతువులు ఆధ్యాత్మిక నగరాలైన బృందావన్, వారణాసి లాంటి నగరాలకు తరలి వెళ్తుంటారు. అయితే, కుందుతోపాటు దిల్లీలో పబ్‌లో నేను కలిసిన మహిళలు కాస్త భిన్నమైనవారు. వీరిలో చాలా మందికి మధ్యతరగతి నేపథ్యముంది. టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్స్, సామాజిక కార్యకర్తలు, రచయితలు, జర్నలిస్టులు ఉన్నారు.
 
వీరిలో కొంతమంది భర్తల నుంచి విడాకులు తీసుకున్నారు. కొంతమంది వితంతువులు. మరికొంతమంది పెళ్లి చేసుకోలేదు. పట్టణాల్లో జీవించే ధనవంతులైన ఒంటరి మహిళలను ఆకర్షించేందుకు బ్యాంకులు, బంగారు ఆభరణాల సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు ప్రత్యేక కార్యక్రమాలు మొదలుపెడుతున్నాయి. మరోవైపు బాలీవుడ్ సినిమాల్లోనూ ఒంటరి మహిళ జీవితాలపై కొత్తకొత్త సినిమాలు వస్తున్నాయి.
 
క్వీన్, పీకూ లాంటి సినిమాలతోపాటు ఫోర్ మోర్ షాట్స్ లాంటి వెబ్‌షోలు వాణిజ్య పరంగానూ మెప్పించాయి. గత అక్టోబరులో పెళ్లికాని మహిళలకు కూడా అబార్షన్ హక్కులు ఒకేలా వర్తిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఇలాంటి సానుకూల మార్పులు కనిపిస్తున్పప్పటికీ సమాజంలో మాత్రం ఇప్పటికీ తమను తక్కువగానే చూస్తున్నారని కుందు అన్నారు. ‘‘ఒంటరిగా జీవించడం అంత తేలిక కాదు. అన్నివేళలా వారి గురించి ఏదో ఒకటి జనాలు మాట్లాడుకుంటారు’’అని ఆమె చెప్పారు.
 
‘‘ఒక ఒంటరి మహిళగా నేను చాలా వివక్ష, అవమానాలను ఎదుర్కొన్నాను. ముంబయిలో ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీరు తాగుతారా? సెక్స్ ఎక్కువగా చేస్తారా? లాంటి ప్రశ్నలను అడిగేవారు’’ అని ఆమె చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి సంబంధం చూసేందుకు ఒక మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఆమె ఫోటోలను ఆమె తల్లి అప్‌లోడ్ చేశారు. దీంతో ఒక వ్యక్తి కుందును కలిసేందుకు వచ్చారు. ‘‘అయితే, 15 నిమిషాల్లోనే నువ్వు కన్యవా?’’అని ఆయన అడిగారు. ‘‘ఒంటరిగా జీవించే మహిళలకు ఇలాంటి ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి’’అని ఆమె చెప్పారు.
 
అంత మంది ఉన్నప్పటికీ..
నిజానికి భారత్‌లో 7.14 కోట్ల మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నట్లు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఇది బ్రిటన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ. అలాంటప్పుడు ఒంటరిగా జీవించే మహిళల విషయంలో ఇంత వివక్ష ఎందుకు? 2001లో భారత్‌లో జీవించే ఒంటరి మహిళల సంఖ్య 5.12 కోట్లు. ఆ తర్వాత దశాబ్దంలో ఈ సంఖ్య 39 శాతం పెరిగింది. 2021లో కోవిడ్-19 వ్యాప్తి నడుమ జనాభా లెక్కలను నిర్వహించలేదు. అయితే, ఈ సంఖ్య నేడు పది కోట్లకుపైనే ఉంటుందని కుందు చెప్పారు.
 
భారత్‌లో పెళ్లి వయసును పెంచడం కూడా ఈ పెరుగుదలకు ఒక కారణం కావొచ్చు. అంటే ఇక్కడ చాలా మంది టీనేజీ చివర్లో లేదా, 20ల మొదట్లో ఉండొచ్చు.
ఇక్కడ వితంతువుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే పురుషులతో పోలిస్తే, మహిళల జీవిత కాలం కాస్త ఎక్కువగా ఉంటుంది. ‘‘అయితే, నేడు ఒంటరి మహిళల్లో చాలామంది కావాలనే ఒంటరిగా జీవించాలని భావిస్తున్నారు. దీనికి పరిస్థితులు కారణం కాదు’’అని కుందు అంటున్నారు. ‘‘ఈ మార్పులను మనం గమనించాలి. మేం కావాలనే ఒంటరిగా జీవిస్తున్నాం అని చెప్పే చాలా మంది మహిళలను నేను కలిశాను. వారికి ఈ పెళ్లి వ్యవస్థపై అంత నమ్మకం లేదు. దీన్ని ఒక పురుషాధిక్య వ్యవస్థగా, దీని వల్ల అణచివేతకు గురవుతున్నట్లు వారు భావిస్తున్నారు’’ అని కుందు చెప్పారు.
 
29 ఏళ్ల వయసులోనే కుందు తల్లి వితంతువుగా మారారు. ఆమె చాలా వివక్షను ఎదుర్కొన్నారు. ఆ ప్రభావం కుందుపై చాలా పడింది. ‘‘మగతోడు లేని మహిళ ఎలాంటి వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందో చూస్తూ నేను పెరిగాను. మా బంధువుల పెళ్లిలో కొన్ని కార్యక్రమాలకు కూడా మా అమ్మను ఆహ్వానించలేదు. పెళ్లి కూతురుకు దూరంగా ఉండాలని ఆమెకు సూచించారు. ఆమెను దురదృష్టవంతురాలిగా చూసేవారు’’అని ఆమె చెప్పారు. 44 ఏళ్ల వయసులో కుందు తల్లి మళ్లీ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు కూడా ఆమె విక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘‘వితంతువులు ఏడుస్తూ, బాధతో జీవించాలి. కానీ, అన్ని సుఖాలు అనుభవిస్తూ జీవించకూడదు’’అని ఆమె వెనుక మాట్లాడుకునేవారని కుందు చెప్పారు. ‘‘నేను కూడా పెళ్లి చేసుకోవాలనే కోరికలతోనే పెరిగాను. పెళ్లి చేసుకుంటే సమాజం నన్ను స్వీకరిస్తుందని భావించాను’’అని ఆమె చెప్పారు.
 
మరి ఏమైంది?
అయితే, రెండుసార్లు ఆమె రిలేషన్‌షిప్‌లలో విఫలం అయ్యారు. శారీరకంగా, మానసికంగా ఆమె వేదనను అనుభవించాల్సి వచ్చింది. 26 ఏళ్ల వయసులో దాదాపు ఆమె పెళ్లి చేసుకోబోయారు. కానీ, ఆ తర్వాతే ఒక పురుషుడి కింద జీవితాంతం బానిస జీవితం తనకొద్దని భావించినట్లు ఆమె చెప్పారు. ‘‘నిజానికి ఆదర్శంగా కనిపించే బంధానికి గౌరవం, సమ్మతి లాంటివి పునాదులుగా ఉంటాయి. సంస్కృతి, సంప్రదాయాలు, మతాలు కాదు’’అని ఆమె అంటారు. ఆ సమావేశంలో నేను కలిసిన చాలా మంది మహిళలు అదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
 
కానీ, భారత్‌ను పురుషాధిక్య సమాజంగానే చెప్పుకోవాలి. ఇక్కడ దాదాపు 90 శాతం పెళ్లిళ్లు పెద్దలు కుదిర్చినవే. ఇక్కడ మహిళల అభిప్రాయాలను అంతగా పరిగణలోకి తీసుకోరు. పెళ్లి చేసుకున్న తర్వాత వీరు కుటుంబాన్ని వదిలి ఒంటరిగా వేరే కుటుంబంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ పరిస్థితుల్లో నేడు మార్పు కనిపిస్తోందని గురుగ్రామ్‌కు చెందిన 44 ఏళ్ల లైఫ్ కోచ్ భావన దహియా చెప్పారు. ‘‘మేం సముద్రంలో ఒక నీటి బొట్టు అయ్యుండొచ్చు. అయితే, నేడు కనీసం ఆ బొట్టు అయినా గుర్తించగలుగుతున్నాం’’అని ఆమె చెప్పారు. ‘‘ఇలాంటివారు మరింత మంది బయటకు వస్తే, వీరి గురించి చర్చ మొదలవుతుంది. సాధారణంగా భర్తల కెరియర్, అతడి ప్రణాళికలు, పిల్లల స్కూలు గురించి మహిళలు మాట్లాడుకునేవారు. నేడు ఈ చర్చ మారుతోంది’’అని ఆమె వివరించారు.