సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (15:24 IST)

ఉన్నావ్ రేప్: దర్యాప్తు నివేదిక ఇవ్వాలని సీబీఐకి సుప్రీం ఆదేశం... ఈ కేసులో ఎప్పుడేం జరిగింది?

ఉన్నావ్ అత్యాచార ఆరోపణలతో జైల్లో ఉన్న ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. తాజాగా ఈ కేసు విచారణలో పురోగతిని వివరించేందుకు ఒక అధికారి మధ్యాహ్నం 12 గంటల లోపు కోర్టుకు హాజరు కావాలని సుప్రీం కోర్టు గురువారం సీబీఐని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ ఈ కేసు దర్యాప్తు గురించి పూర్తి వివరాలను అందించాలని సీబీఐని అడిగారు.

 
"ఇప్పటివరకూ వెల్లడైనవి, జరిగినవి వివరించే దర్యాప్తు, పురోగతి నివేదికతో సీబీఐ అధికారి ఇక్కడికి రావాలని మేం కోరుతున్నాం" అని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం చెప్పింది. ఏఎన్ఐ వార్తా సంస్థ వివరాల ప్రకారం, ఈ రోజు 12 గంటల లోపు సీబీఐ అధికారులు కోర్టుకు చేరుకోవడం సాధ్యం కాదని, దయచేసి గడువు పొడిగించాలని సొలిసిటర్ జనరల్ టి.మెహతా సుప్రీంకోర్టును కోరారు. అయితే, సుప్రీం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేయడానికి తిరస్కరించింది.

 
ఇటు ఆస్పత్రిలో బాధితురాలు, ఆమె వకీలుకు లైఫ్ సపోర్టుపై చికిత్స అందిస్తున్నారు. వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి అంత దిగజారలేదని, ఇది మంచి సంకేతమే అని చెబుతున్నారు. ఇద్దరూ ప్రస్తుతం లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీలో ఉన్న ట్రామా వెంటిలేటరీ యూనిట్ ఐసీయూలో ఉన్నారు. మెడికల్ పరిభాషలో చెప్పాలంటే వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. కానీ మూడు రోజులైనా ఇద్దరిలో ఎవరూ ఇంకా స్పృహలోకి రాలేదు.

 
అయితే, బుధవారం ఉన్నావ్ రేప్ బాధితురాలు, ఆమె వకీల్ పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు కూడా వైద్యులు గమనించారు. కానీ వారి కోలుకుంటారా లేదా అనేది అప్పుడే ఏం చెప్పలేమంటున్నారు. వీరి పరిస్థితిని వివరించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రామా సర్జరీ చీఫ్ డాక్టర్ సందీప్ తివారీ "ఏదైనా పురోగతి కనిపిస్తే అది 24 గంటల నుంచి 48 గంటలు అలాగే ఉంటుంది. అప్పుడే దానిని వైద్య పరిభాషలో పరిస్థితి మెరుగ్గా ఉందని భావిస్తారు. కానీ, మా ప్రయత్నాలు మేం చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టే భావించాలి" అన్నారు.

 
మంగళవారం బాధితురాలి వకీలుకు ఉన్న వెంటిలేటర్‌ను కాసేపు తొలగించారు. కానీ ఆయన్ను మళ్లీ వెంటనే వెంటిలేటర్‌పైకి తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీయూలో ఉన్న బాధితురాలు, ఆమె వకీల్ ఇద్దరికీ తర్వాత 24 నుంచి 48 గంటలు చాలా కీలకంగా మారింది.

 
సినిమాను తలపించే ఘటనలు
ఉన్నావ్ అత్యాచార ఘటనలో మలుపులు సినిమా కథను మించిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక బలమైన ప్రజా ప్రతినిధి, తన ఇంటికి సాయం కోసం వచ్చిన బాలికపై అత్యాచారం చేస్తాడు. కానీ ఆ కుటుంబం న్యాయం కోసం కోర్టుకెక్కడంతో కేసు వాపసు తీసుకోమని బెదిరిస్తాడు. అధికార బలానికి లొంగని బాధితురాలి కుటుంబాన్ని చివరకు ఎన్నో కష్టాలు పెడతాడు. అప్పటికీ తన మాట వినకపోవడంతో కుటుంబంలో ఒక్కొక్కరినీ అంతం చేస్తాడు.

 
చివరికి అసలు తనపై కేసే లేకుండా చేయడానికి బాధితురాలు, ఆమె వకీలును కూడా చంపించే ప్రయత్నం చేస్తాడు. ఒక పెద్ద ట్రక్కుతో వారు వెళ్తున్న కారును ఢీకొట్టేలా చేస్తాడు. ఇప్పుడు ఉన్నావ్ కేసులో కూడా సరిగ్గా ఇలాగే జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన మంగళవారం లోక్‌సభను కుదిపేసింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీఎస్పీ సభ్యులు న్యాయం కావాలంటూ అరగంటకు పైగా వెల్ దగ్గర నిరసనలు దిగారు. తర్వాత వాకౌట్ చేశారు.

 
రెండేళ్ల కిందట మొదలైన ఈ కేసును అసలు లేకుండా చేసేందుకు ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ అత్యాచార బాధితురాలు, ఆమె వకీలు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టించారని సభ్యులు ఆరోపించారు. బాధితురాలికి రక్షణగా ఉండాల్సిన సిబ్బంది, ప్రమాదం జరిగే రోజు ఎందుకు లేరని ప్రశ్నించారు.

 
అసలు ఉన్నావ్ రేప్ కేసేంటి, ఎప్పుడేం జరిగింది.
2017 జూన్ 4- ఉద్యోగం ఇప్పించమనని అడగడానికి ఎమ్మెల్యే కులదీప్ సెంగర్ ఇంటికి వెళ్తే ఆయన తనను రేప్ చేశాడని ఒక మైనర్ బాలిక ఆరోపించింది. ఉద్యోగం వచ్చేందుకు సాయం చేయమని అగడగడానికి బంధువులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లానని, ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పింది. కానీ, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో యువతి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తమ ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని బాలిక ఆరోపించింది.

 
2017 జూన్ 11: ఆ తర్వాత బాలిక కనిపించకుండా పోయింది. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.

 
2017 జూన్ 20: బాధితురాలు ఔరయ్యా గ్రామంలో కనిపించింది. తర్వాత రోజు ఆమెను ఉన్నావ్ తీసుకొచ్చారు.

 
2017 జూన్ 2017: బాధితురాలిని కోర్టులో హాజరు పరిచారు. సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. పోలీసులు వాంగ్మూలంలో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ పేరు చెప్పనివ్వలేదని ఆమె ఆరోపించారు.

 
2017 జులై 3: వాంగ్మూలం నమోదు చేసిన 10 రోజుల తర్వాత బాధితురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితురాలు దిల్లీ వచ్చి పోలీసులు తనను వేధించారని చెప్పింది. ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్, అతడి సోదరుడు అతుల్ సింగ్ సెంగర్ పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని బాధితురాలు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను కోరింది.

 
2018 ఫిబ్రవరి 24: బాధితురాలి తల్లి బయటికొచ్చారు. ఉన్నావ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది.

 
2018 ఏప్రిల్ 3- బాధితురాలి తండ్రికి, కులదీప్ సింగ్ సెంగర్ సోదరుడు అతుల్ సింగ్ సెంగర్ మధ్య ఘర్షణ జరిగింది.

 
2018 ఏప్రిల్ 4: ఆ తర్వాత ఉన్నావ్ పోలీసులు బాలిక తండ్రిని ఆర్మ్స్ యాక్ట్‌ కేసులో అరెస్టు చేశారు.

 
2018 ఏప్రిల్ 8: బాధితురాలు ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఎం ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ఆరోపించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తమను బెదరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

 
2018 ఏప్రిల్ 9: బాలిక తండ్రి పోలీసు కస్టడీలో మృతి చెందారు. తర్వాత సోషల్ మీడియాలో బాధితురాలి తండ్రి కనిపిస్తున్న వీడియో, ఫొటోలు వైరల్ అవడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ పరిణామాలను దురదృష్టకరంగా పేర్కొన్నారు. లఖ్‌నవూ ఏడీజీని ఈ కేసును లోతుగా విచారించమని ఆదేశించిన యోగీ, దోషులు ఎంతటి వారైనా, ఏ స్థానంలో ఉన్నవాళ్లయినా సహించబోమన్నారు.

 
2018 ఏప్రిల్ 10: బాధితురాలి తండ్రి పోస్టుమార్టం రిపోర్టులో అతడికి 14 చోట్ల గాయాలు ఉన్న విషయం బయటికొచ్చింది. ఈ కేసులో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. మేజిస్ట్రేట్ విచారణకు కూడా ఆదేశించారు. రెండు నెలల తర్వాత ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి కూడా మృతిచెందాడు.

 
2018 ఏప్రిల్ 11: యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.

 
2018 ఏప్రిల్ 12: మైనర్ రేప్ కేసులో ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్‌ను నిందితుడుగా చేర్చారు. కానీ అరెస్టు చేయలేదు. ఈ కేసులో స్వయంగా జోక్యం చేసుకున్న అలహాబాద్ హైకోర్టు కులదీప్ సింగ్‌ను అరెస్ట్ చేస్తారా, చేయరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

 
2018 ఏప్రిల్ 13: ఎమ్మెల్యేను విచారించడానికి సీబీఐ అతడిని అదుపులోకి తీసుకుంది. తర్వాత అరెస్టు చేసింది. కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

 
2018 జులై 11: సీబీఐ ఈ కేసులో మొదటి చార్జిషీటు దాఖలు చేసింది. అందులో ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ పేరును చేర్చింది.

 
2018 జులై 13: ఇదే కేసులో రెండో చార్జిషీటు నమోదైంది. ఇందులో బాధితురాలి తండ్రిని తప్పుడు ఆరోపణలతో ఇరికించారని కులదీప్ సింగ్ సెంగర్, అతడి సోదరుడు అతుల్ సింగ్ సెంగర్, కొంతమంది పోలీసులను నిందితులుగా చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో కులదీప్ సింగ్ సెంగర్‌పై పోక్సో యాక్ట్(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012) కింద కూడా ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కులదీప్ సింగ్ సెంగర్, అతుల్ సెంగర్ సహా ఏడుగురు నిందితులు ఉన్నారు.

 
2019 జులై 28: బాధితురాలు తన పిన్ని, అత్త, వకీలుతో రాయ్‌బరేలీ వెళ్తున్న సమయంలో. వారు ప్రయాణిస్తున్న డిజైర్ కారును 12 చక్రాల ఒక ట్రక్కు ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో బాధితురాలి పిన్ని, అత్త మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు, ఆమె వకీలుకు లఖ్‌నవూలోని కింగ్ జార్జి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరూ లైఫ్ సపోర్టుపై ఉన్నారు.

 
కారును ఢీకొన్న ట్రక్కు నంబర్ ప్లేటుపై గ్రీజు పూసి నంబరు కనిపించకుండా చేశారు. బాలికకు ప్రభుత్వం సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. కానీ, ప్రమాదం జరిగిన సమయంలో ఆమెతో ఒక్క రక్షణ సిబ్బంది కూడా లేరు. అత్యాచార బాధితురాలికి రక్షణగా ఉత్తరప్రదేశ్ పోలీస్ ఎప్పుడూ ముగ్గురు గార్డులను నియమిస్తుంది. వీరిలో ఇద్దరు మహిళా గార్డులు ఉంటారు.

 
వీరు ముగ్గురూ ఎప్పుడూ బాధితురాలి ఇంటి దగ్గరే గస్తీ కాస్తుంటారు. కానీ ఆదివారం బాలిక, ఆమె కుటుంబం వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొన్నప్పుడు వారితో భద్రతా సిబ్బందిలో ఒక్కరు కూడా లేరు. బాధితురాలి తల్లి భద్రతా సిబ్బంది ఇంట్లో ఎవరికో అనారోగ్యంగా ఉండడంతో వారు వెళ్లిపోయారని చెప్పారు.

 
కానీ ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సురేష్ కుమార్ అనే గార్డ్ ప్రమాదం జరిగిన తర్వాత రోజు మీడియాతో మాట్లాడారు. కారులో చోటు లేదని బాధితురాలు, ఆమె కుటుంబం తమను వారితో తీసుకెళ్లలేదని చెప్పారు. ఇటు, ఎమ్మెల్యే మనుషులు కేసు వాపసు తీసుకోవాలంటూ తమను బెదిరిస్తున్నారని, ఈ యాక్సిడెంట్ కూడా వారే చేయించారని బాధితురాలి కుటుంబం ఆరోపించింది.

 
ఈ కేసులో బాధితురాలి పిన్ని కూడా ఒక సాక్షి. ఆమె ఇప్పుడు ప్రమాదంలో మరణించారు. దీనిపై పోలీసులు మొదట ఫోరెన్సిక్ విచారణ చేపట్టారు. తర్వాత ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్, మరో 10 మందిపై సీబీఐ హత్యారోపణలు నమోదు చేసింది.

 
2019 జులై 30: మైనర్ బాలికపై అత్యాచారం, తదనంతర పరిణామాలపై ప్రతిపక్షాల విమర్శలతో బీజేపీ పార్టీ నుంచి కులదీప్ సింగ్ సెంగార్‌ను సస్పెండ్ చేసింది. సెంగార్‌పై చర్యలు తీసుకుంటామని యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ ప్రకటించారు. సెంగార్ విషయంలో పార్టీకి సంబంధం లేదని, చట్టం తన పని తాను చేస్తుందని వివరించారు.

 
ఉన్నావ్ బాధితురాలు తనకు ప్రాణహాని ఉందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్‌కు రాసిన లేఖను తమ ముందు ఎందుకు ప్రవేశ పెట్టలేదని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఒక నివేదిక కోరింది.

 
2019 ఆగస్టు 1- ఉన్నావ్ రేప్ కేసు విచారణలో పురోగతిని వివరించేందుకు ఒక సీబీఐ అధికారి మధ్యాహ్నం 12 లోపు కోర్టుకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.