శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 జులై 2019 (15:30 IST)

పట్టువీడని డీకే.. బెట్టు దిగని ఖాకీలు.. వర్షంలో తడుస్తూనే ఉన్న ట్రబుల్ షూటర్!

కర్నాటక రాజకీయం ముంబైకు చేరింది. కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి తమ పదవులకు రాజీనామాలు చేసిన 14 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ నక్షత్ర హోటల్‌లో మకాం వేసివున్నారు. వీరిని కలుసుకునేందుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరుగడించిన సీనియర్ నేత డీకే. శివకుమార్ ముంబైకు చేరుకున్నారు. 
 
ఈయన రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. డీకే శివకుమార్ వల్ల తమకు ప్రాణహాని వుందని రెబెల్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనకు అనుమతి నిరాకరించారు. 
 
అయితే, డీకే మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. హోటల్‌లో బస చేసిన రెబెల్ ఎమ్మెల్యేలను కలిసిన తర్వాతే ఇంటికి వెనుదిరుగుతానని పోలీసులకు పునరుద్ఘాటించారు. వర్షం వచ్చినా.. కొట్టుకుపోయినా తాను మాత్రం వారిని కలిసేంత వరకూ హోటల్ ముందు నుంచి కదిలే ప్రసక్తే లేదని ఆయన మొండిపట్టు పట్టారు. 
 
తన వల్ల ప్రాణ హాని ఉందని ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు పైనా ఆయన స్పందించారు. తన దగ్గర ఎలాంటి ఆయుధం లేదని, ఆదరించే హృదయం మాత్రమే ఉందని డీకే వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, బెంగళూరు నుంచి ఉదయమే బయల్దేరిన డీకే టిఫిన్ కూడా అదే హోటల్ ముందు చెట్టు కింద నిల్చుని చేయడం కొసమెరుపు. మరోవైపు ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
 
తామంతా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులమని, కుటుంబంలో కలతలొచ్చి కొందరు వీడిపోయారని, అలాంటప్పుడు వారిని తిరిగి కుటుంబంలో చేర్చుకునేందుకు కలవకూడదా అని ఆయన ప్రశ్నించారు. వారితో మాట్లాడి ఒప్పిస్తామని చెప్పారు. మంత్రులంతా రాజీనామా చేశారని, కొత్త కేబినెట్‌ను తాము ఏర్పాటు చేస్తామని, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పిస్తామని డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.