గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (12:27 IST)

కర్నాటకలో రాజీనామాల పర్వం : మరో స్వతంత్ర ఎమ్మెల్యే రిజైన్

కర్నాటక రాష్ట్ర రాజకీయాలు క్షణానికోరకంగా మారిపోతున్నాయి. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా మరో స్వతంత్ర శాసనసభ సభ్యుడు నగేశ్ రాజీనామా చేశారు. బెంగళూరులోని రాజ్‌‌భవన్‌కు వెళ్లిన నగేశ్, తన రాజీనామా లేఖను గవర్నర్ వజూభాయ్ వాలాకు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'కుమారస్వామి ప్రభుత్వానికి నా మద్దతును ఉపసంహరించుకుంటున్నా. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ బీజేపీని ఆహ్వానిస్తే నేను ఆ పార్టీకి మద్దతు ఇస్తా' అని తెలిపారు. 
 
మరోవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తమ మంత్రి పదవులను తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన మంత్రులు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, మొత్తం 224 మంది సభ్యులున్న బెంగుళూరు విధాన సభలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ 113. అయితే, ప్రస్తుత సభలో కాంగ్రెస్ పార్టీకి 78 మంది, జేడీఎస్‌కు 37 మంది, బీజేపీకి 105, బీఎస్పీ, ఇతరులకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.