శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (14:21 IST)

కర్ణాటక రాజకీయ సంక్షోభం: భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలకు ఇది ముగింపా?

కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనమవటం ఖాయమైపోయినట్లే కనిపిస్తోంది. ఇది భారతదేశంలో మరో సంకీర్ణ రాజకీయాల శకం అంతానికి ఆరంభం కావచ్చు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యంత బలమైన రాజకీయ పార్టీగా అవతరించటం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన అధికారాన్ని బలోపేతం చేసుకోవటం.. 1971లో పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సర్వశక్తిమంతురాలిగా అవతరించటం ఒకే తరహాలో ఉన్నట్లు అనిపిస్తోంది.

 
లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణం తర్వాత ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చారు. ఆమెకు త్వరలోనే 'గూంగీ గుడియా' - అంటే 'మూగ బొమ్మ' అనే బిరుదు తగిలించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నట్లు కనిపించింది. దేశంలో తొలి సంకీర్ణ రాజకీయాల శకం.. 1967లో ఆరంభమవటానికి అదే కారణం. నాడు భారతీయ క్రాంతి దళ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, భారతీయ జన సంఘ్ (భారతీయ జనతా పార్టీ తొలి రూపం) పార్టీలతో కలిసి సంయుక్త విధాయక్ దళ్ (ఎస్‌వీడీ) సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

 
కానీ.. ఇందిరాగాంధీ పాకిస్తాన్‌ను చీల్చి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత.. ఆమె సౌకర్యవంతమైన మెజారిటీతో దేశాన్ని పాలించటానికి మాత్రమే కాదు.. వివిధ రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలన్నిటినీ కూల్చివేయగల రాజకీయ బలం సముపార్జించారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కేరళల్లో సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలు కుప్పకూలాయి. కేరళలోనూ, ఇటీవలి కాలం వరకూ పశ్చిమ బెంగాల్‌లోనూ కమ్యూనిస్ట్ పార్టీ సారథ్యంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) సంకీర్ణాలు బలపడ్డాయి. తమిళనాడులో ద్రవిడ పార్టీల ప్రాబల్యం కొనసాగుతోంది.

 
సంకీర్ణ శకం రెండో దశ 1989లో ఆరంభమైంది. ఈసారి వివిధ రాజకీయ పార్టీల కూటములు రాష్ట్రాలలోనే కాదు.. కేంద్రంలోనూ అధికారం చేపట్టగలిగాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) సంకీర్ణం 2004, 2009 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావటం వరకూ ఈ రెండో శకం కొనసాగింది.

 
2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి.. గత ఏప్రిల్, మే నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే వరకూ ఆ శకం నడిచింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినపుడు.. 'కాంగ్రెస్ రహిత భారత్' అనే బీజేపీ ఉద్యమాన్ని నిలువరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.

 
కర్ణాటక శాసనసభలో కాంగ్రెస్ గెలిచిన సీట్లలో దాదాపు సగం - అంటే కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ నాయకుడు హెచ్.డి.కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని అనూహ్యంగా ముందుకొచ్చింది. ఇది ఆశ్చర్యకరమైన పరిణామం. ఎందుకంటే జేడీఎస్ - కాంగ్రెస్‌ల మధ్య ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలో దశాబ్దాల పాటు భీకర పోరాటం సాగింది.

 
దాదాపు 14 నెలలు అధికారంలో కొనసాగిన తర్వాత నేడు జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణం కుప్పకూలుతోంది. తొమ్మిది మంది ఎంఎల్‌ఏలు శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయటం దీనికి కారణం. కర్ణాటక బీజేపీ ఆరంభించిన 'ఆపరేషన్ కమల 4.0' వ్యూహం ప్రకారం.. రాజీనామా చేసిన ఎంఎల్‌ఏలను భవిష్యత్తులో బీజేపీ టికెట్ మీద గెలిపిస్తారు.

 
2008లో బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినపుడు ఇటువంటి ప్రయోగమే చేయగా.. నాడు రాజీనామా చేసిన ఎనిమిది మంది ఎంఎల్‌ఏల్లో ఐదుగురు మాత్రమే తిరిగి ఎన్నికయ్యారు. ఈ పరిణామాలను.. దేశ రాజకీయాలు బలమైన ఏక పార్టీ పాలన దిశగా కదులుతున్న స్వభావాన్ని చూస్తే.. మరో సంకీర్ణ రాజకీయాల శకానికి ముగింపు మొదలైందా అన్న ప్రశ్న వస్తోంది.

 
''ఒకరకంగా నిజమే. భారతదేశంలో రాజకీయ పార్టీలు విశ్వసనీయతను, బీజేపీతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోయాయని 2019 లోక్‌సభ ఎన్నికలు విస్పష్టంగా చాటాయి. మోదీ నాయకత్వాన్ని తట్టుకుని, సవాల్ చేసి నిలబడగలిగే ప్రత్యామ్నాయ నాయకత్వమేదీ ఇప్పుడు లేదు'' అని ధార్వాడ్ యూనివర్సిటీలో రాజనీతిశాస్త్ర విభాగ అధ్యాపకుడు ప్రొఫెసర్ హరీష్ రామస్వామి పేర్కొన్నారు.

 
కర్ణాటకలో 1983లో రామకృష్ణ హెగ్డే సారథ్యంలోని జనతా పార్టీ - క్రాంతిరంగ్‌లతో కూడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతిచ్చిన విషయాన్ని రాజకీయ విశ్లేషకుడు మహదేవ్ ప్రకాశ్ గుర్తుచేశారు. అయితే 1984 ఎన్నికల్లో 28 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 24 సీట్లు గెలుచుకున్నపుడు ఆ సంకీర్ణం కూలిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. మళ్లీ 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచినపుడు ఏర్పాటైన కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణం.. జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తిరుగుబాటుతో కూలిపోయిన వైనాన్నీ ఉదహరించారు.

 
అలా 2006లో బీజేపీతో చేతులు కలిపిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా 2008లో కూలిపోయింది. నాడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ''జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణం ఈ రాష్ట్ర సంకీర్ణ రాజకీయాల్లో మూడో ప్రయోగం. 2019 లోక్‌సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా సంకీర్ణ రాజకీయాలను తిరస్కరించాయి. ఏక పార్టీ పాలన ఉత్తమ ప్రభుత్వ రూపమని ప్రజలు నిర్ణయించారు. ఎందుకంటే సంకీర్ణాలు ప్రజలకు పాలనను అందించవు'' అని ప్రకాశ్ వ్యాఖ్యానించారు.

 
మైసూర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ముజఫర్ అస్సాదీ.. ప్రకాశ్ అభిప్రాయంతో ఏకీభవించటం లేదు. ''రాజకీయంగా, ఇతరత్రా విభేదాలు ఉన్నప్పటికీ ఆ సంకీర్ణ ప్రభుత్వం పనిచేయగలిగింది. సైద్ధాంతికంగా వారు లౌకికవాదం పక్షాన ఉన్నారు. గత రాజకీయ పోరాటాలు, అహంభావాలే తాజా విభేదాలకు కారణం'' అని ఆయన అంటారు. ''హిందూ కుల బృందాల సంకీర్ణాన్ని సృష్టించటంలో బీజేపీ సఫలం కావటం వల్ల రాష్ట్రంలో రాజకీయ సంకీర్ణం విఫలమైంది'' అని ఆయన అంగీకరిస్తారు.

 
''అది హిందూయిజాన్ని ప్రోత్సహించటం, హిందుత్వ కన్నా భిన్నమైనది. అస్తిత్వం విషయంలో అన్ని కులాలనూ కలుపుకుంది. ఇప్పుడు కర్ణాటక మరింత హిందూగా మారింది. నేను హిందూయిజం అంటున్నపుడు అది తృణీకారంతో అంటున్నది కాదని గమనించండి. బీజేపీ రూపొందించిన బహుళ కుల సంకీర్ణం.. కాంగ్రెస్, జేడీఎస్‌ల సామాజిక పునాదికి వ్యతిరేకంగా పనిచేసింది'' అని ఆయన పేర్కొన్నారు.