సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శనివారం, 6 జులై 2019 (20:00 IST)

''మిస్టర్‌ కూల్‌''పై ఆ విమర్శలు.. స్పందించిన మహీ.. బర్త్ డే రోజున?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జూలై ఏడో తేదీన పుట్టినరోజు కావడంతో మహీ ఫ్యాన్స్ పండగ చేసుకునేందుకు సిద్ధమైయ్యారు. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు ధోనీ. ఎప్పుడు రిటైర్‌ అవుతానో తనకే తెలియదంటూ కామెంట్ చేశాడు. గత కొంతకాలంగా ''మిస్టర్‌ కూల్‌'' పై వస్తున్న వార్తల నేపథ్యంలో ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
 
ప్రస్తుతం ప్రపంచ కప్ మెగా టోర్నీ తుది దశకు చేరుకుంది. లీగ్ దశ నుండి నిష్క్రమించిన ఆయా జట్ల ఒక్కో సీనియర్‌ ఆటగాడు తమ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నారు. దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌, పాక్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌లు ఆటకు గుడ్‌బై చెప్పారు.
 
తాజాగా తెలుగు తేజం, భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడు కూడా క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్, యూనివర్స్‌ బాస్ క్రిస్‌ గేల్‌ (40) చేరుతాడనుకున్నా.. ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. అలాగే ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ప్రపంచకప్‌ అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై ధోనీ స్పందించాడు. 
 
శ్రీలంకతో శనివారం భారత్ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతున్న నేపథ్యంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ధోనీ స్పందించాడు. ''నేనెప్పుడు రిటైర్‌ అవుతానో నాకే తెలియదు. కానీ.. చాలా మంది శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే కెరీర్‌కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు" అని ధోనీ చెప్పినట్టు సదరు ఛానెల్ పేర్కొంది.
 
ధోనీ రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు భారత జట్టులోని ఏ సభ్యుడైనా, కోచింగ్ సిబ్బందైనా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ధోనీ ఎవరికీ చెప్పకుండా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుండి వైదొలుగుతూ వున్నట్టుండి నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం వన్డేల్లోనూ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో ధోనీకి తెలుసునని బీసీసీఐ వర్గాల సమాచారం. 
 
ప్రపంచకప్‌ తర్వాతా కూడా ధోనీ తన ఆటను కొనసాగిస్తాడని మరో బీసీసీఐ అధికారి అంటున్నారు. ఇంకా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి, జట్టులోని ఆటగాళ్లు సైతం ధోనీకి మద్దతుగా నిలిచి కొనసాగాలనే భావిస్తున్నారు. కానీ మాజీలు సచిన్, గుంగూలీల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. మరి ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.