మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (16:49 IST)

చేతిలో ఐదు వికెట్లు ఉన్నా.. కానీ 338 రన్స్ చేయలేని దుస్థితి... గంగూలీ విమర్శలు

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్, భారత్ క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముగింట 337 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత 338 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన కేవలం 306 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 36 పరుగుల తేడాతో ఈ ప్రపంచ కప్‌లో తొలి ఓటమిని చవిచూసింది. 
 
ఆ సమయంలో కామెంటేటర్స్ బాక్సులో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌ల ఆసక్తికర సంభాషణ జరిగింది. అపుడు నాసిర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నకు గంగూలీ సమాధానమిస్తూ, ధోనీ ఆటతీరు గురించి చెప్పడానికి తన వద్ద ఎలాంటి వివరణ లేదన్నారు. 
 
ముఖ్యంగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నప్పటికీ 338 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేని స్థితిలో భారత బ్యాట్స్‌మెన్లు ఉన్నారంటూ దుయ్యబట్టారు. ముఖ్యంగా, ధోనీ సింగిల్స్ తీస్తూ అతి నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై సౌరవ్ విమర్శలు గుప్పించారు. నిజానికి భారత క్రికెట్ జట్టు 300 పరుగులకు ఆలౌట్ అయివున్నా తాను బాధపడేవాడినని కాదని, కానీ ఐదు వికెట్లు చేతిలో ఉండగా కూడా ఇలా ఆడటం ఏంటని ధోనీ, కేదార్ జాదవ్ ఆటతీరును గంగూలీ దుయ్యబట్టారు.