మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (11:49 IST)

వరల్డ్ కప్ : సెమీస్ రేస్ నుంచి శ్రీలంక నిష్క్రమణ

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం లీగ్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే, ఈ పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు ఒక్కటే ఇప్పటివరకు సెమీస్‌కు రాజమార్గంలో వెళ్లింది. ఆ తర్వాత జట్టుగా భారత్ ఉంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 
 
అంటే, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ కోహ్లీ సేన ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. పైగా, మెరుగైన రన్‌రేట్ ఉంది. ఈ టోర్నీలో కేవలం ఒకే ఒక్క ఓటమిని చవిచూసింది. దీంతో సెమీస్‌కు చేరేందుకు మెరుగైన అవకాశాలు భారత్‌కు ఉన్నాయి. 
 
భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత శ్రీలంకతో ఆడాల్సివుంది. ఈ రెండు మ్యాచ్‌లలో ఏ ఒక్క మ్యాచ్‌లో గెలుపొందినా భారత్ సెమీస్‌కు చేరడం ఖాయం. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌లలో ఓడినా పాయింట్ల ఆధారంగా సెమీస్‌కు చేరుతుంది. 
 
ఇకపోతే, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన ఇంగ్లండ్... తన పాయింట్ల ఖాతాను పదికి పెంచుకుంది. చివరి నాకౌట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే సెమీస్‌కు చేరుకుంది. అదేసమయంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందడంతో శ్రీలంక సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. 
 
ప్రస్తుతం లంక ఖాతాలో కేవలం ఆరు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఈ మ్యాచ్‌లలో గెలుపొందిన లంక పాయింట్ల సంఖ్య 10కి చేరుతుంది. ఇపుడు ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ పాయింట్ల సంఖ్య కూడా 10 వద్దే ఆగిపోతే, అన్ని జట్లూ పాయింట్లూ సమానమవుతాయి. 
 
అపుడు నెట్ రన్‌రేటుతో పాటు... జట్టు సాధించిన గెలుపోటములను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. చివరగా లీగ్ మ్యాచ్‌లలో అత్యధిక విజయాలు సాధించిన జట్టే సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. వర్షం కారణంగా శ్రీలంకకు రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో సెమీస్ దారులు మూసుకునిపోయాయి. ఫలితంగా లీగ్ మ్యాచ్‌ల తర్వాత లంక జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఇప్పటికే ఆప్ఘనిస్థాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లూ సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే.