సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (17:01 IST)

బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ల వీరకుమ్ముడు... హమ్మయ్య వికెట్ పడింది.... రూట్ సెంచరీ

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్ - భారత్ క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో వీర కుమ్ముడు దెబ్బకు భారత బౌలర్లు బేజారయ్యారు. వీరిద్దరూ ఓపెనింగ్ భాగస్వామ్యంగా 23 ఓవర్లలో ఏకంగా 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో రాయ్ 66 పరుగులు చేయగా, స్టో సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. ఈ క్రమంలో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ వీరిద్దరి భాగస్వామ్యానికి తెరదించారు. దీంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. 
 
అంతకుందు... రాయ్ - స్టోలు జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ కళ్లు చెదిరిపోయే షాట్లు కొడుతూ భారత బౌలర్లను బెంబేలెత్తించారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై వీరిద్దరూ దూకుడుకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో భారత బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఎలాంటి బంతివేసినా సిక్సర్ బాదాలన్న కసితో రాయ్, బెయిర్ స్టో ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ స్టో 90 బంతుల్లో సెంచరీ కొట్టాడు. 90 బంతుల్లో ఆరు సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో రెచ్చిపోయాడు. ఫలితంగా ఇంగ్లండ్ 26.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 183 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టో, రూట్‌లు ఉన్నారు. 
 
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. అయితే, ఈ మ్యాచ్ కోసం భారత్ ప్రకటించిన తుది జట్టులో ఒక మార్పు చేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విజయ్ శంకర్‌ను తొలగించి అతని స్థానంలో రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే, ఇంగ్లండ్ జట్టుల రెండు మార్పులు చేశారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ క్రికెటర్లు ఆరంజ్ జెర్సీలో కనిపించనున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు అపజయం అంటూ ఎరుగని జట్టుగా స్థానం సంపాదించుకుంది. ఈ మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్‌కు అత్యంత కీలకమైనదిగా మారింది. ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత జట్టు : కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జాదవ్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, షమీ, చాహల్, బుమ్రా. 
ఇంగ్లండ్ జట్టు : జేజే రాయ్, బైర్‌స్టో, రూట్, మోర్గాన్, స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లుంకెట్, రషీద్, ఆర్చెర్, వుడ్.