బర్మింగ్‌హామ్‌లో సిక్సర్ల వర్షం... చెలరేగిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు.. భారత్ ముంగిట భారీ లక్ష్యం

ind vs eng
Last Updated: ఆదివారం, 30 జూన్ 2019 (18:55 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ - ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో 13 సిక్సర్లు, 26 ఫోర్లు కొట్టారంటే ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఏ విధంగా చెలరేగిపోయారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ కళ్లు చెదిరిపోయే షాట్లు కొడుతూ భారత బౌలర్లను బెంబేలెత్తించారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై వీరిద్దరూ దూకుడుకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో భారత బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఎలాంటి బంతివేసినా సిక్సర్ బాదాలన్న కసితో రాయ్, బెయిర్ స్టో ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

వీరిద్దరి వీర కుమ్ముడు దెబ్బకు భారత బౌలర్లు బేజారయ్యారు. వీరిద్దరూ ఓపెనింగ్ భాగస్వామ్యంగా 23 ఓవర్లలో ఏకంగా 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో రాయ్ 66 పరుగులు చేయగా, స్టో (111) సెంచరీ చేశాడు. స్టో తన ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు సిక్సర్లు, 10 ఫోర్లతు కొట్టి సత్తా చాటాడు. చివరకు స్టో వికెట్‌ను మహ్మద్ షమి నేలకూల్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయే సమయానికి ఆ జట్టు స్కోరు 205 పరుగులు చేసింది.

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రూట్ 44, మోర్గాన్, బట్లర్ 20, స్టోక్స్ 78, వోక్స్ 7, ప్లుంకెట్ 0 చొప్పున పరుగులు చేశారు. స్టోక్స్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 79 పరుగులు చేశాడు. మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లు బాదాడు. మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీశాడు. ఈ ప్రపంచ కప్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. భారత్ గెలవాలంటే 50 ఓవర్లలో 338 పరుగులు చేయాల్సివుంది. ఓవర్‌కు ఏడు పరుగుల చొప్పున చేయాల్సివుంది.

అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్ కోసం భారత్ ప్రకటించిన తుది జట్టులో ఒక మార్పు చేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విజయ్ శంకర్‌ను తొలగించి అతని స్థానంలో రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే, ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చేసింది.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ క్రికెటర్లు ఆరంజ్ జెర్సీలో కనిపించనున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు అపజయం అంటూ ఎరుగని జట్టుగా స్థానం సంపాదించుకుంది. ఈ మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్‌కు అత్యంత కీలకమైనదిగా మారింది. ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,

భారత జట్టు : కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జాదవ్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, షమీ, చాహల్, బుమ్రా.
ఇంగ్లండ్ జట్టు : జేజే రాయ్, బైర్‌స్టో, రూట్, మోర్గాన్, స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లుంకెట్, రషీద్, ఆర్చెర్, వుడ్.



దీనిపై మరింత చదవండి :