శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. మహామహులు
Written By
Last Updated : శనివారం, 6 జులై 2019 (18:47 IST)

ఫుట్ బాల్‌ వికెట్ కీపర్.. క్రికెట్‌లోకి ఎలా వచ్చాడంటే? (Video)

భారత సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి జూలై ఏడో తేదీన పుట్టిన రోజు. జూలై 7, 1981వ సంవత్సరంలో రాంచీలో ధోనీ పుట్టాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. పేద కుటుంబం. అందుచేత ధోనీ వీధిలో తన స్నేహితులతో క్రికెట్ ఆడటాన్ని ప్రారంభించాడు ధోనీ. ధోనీకి పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. క్రికెట్‌ ఆడిన తర్వాత మిగిలిన సమయాన్ని ధోనీ పెయింటింగ్‌ చేస్తూ గడుపుతాడు. 
 
యుక్త వయస్సులో ధోనీకి ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఫుట్‌బాల్‌లో  గోల్ కీపర్‌గా పనిచేసిన అనుభవం ధోనీకి వుంది. ఓసారి క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. వికెట్ కీపర్‌కు గాయం ఏర్పడటంతో ధోనీని ఆయన స్నేహితులు కీపింగ్ చేయమన్నారు. 
 
అప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడిన ధోనీకి.. ఫుట్ బాల్ కంటే తాను క్రికెట్‌లో వికెట్ కీపింగ్ బాగా చేస్తున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి క్రికెట్ పట్ల ధోనీకి ఆసక్తి పెరిగింది. జార్ఖండ్ ప్రాంతం కొండలతో కూడిన ప్రదేశం కావడంతో స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేయడమే అతని ఫిట్ నెస్ రహస్యమని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. 
 
యువకుడిగా వున్నప్పుడు ధోనీ బీహార్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేవాడు. పలు మ్యాచ్‌ల్లో ధోనీ ఒంటి చేత్తో జట్టుకు స్కోర్ సంపాదించిపెట్టడం, సెంచరీ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచేది. అయితే ఆయన టీమ్ మాత్రం ఓడిపోయేది. దీంతో టీమిండియాలోకి ధోనీ అంత సులువుగా రాలేకపోయాడు. అయితే బీసీసీఐ దేశ వ్యాప్తంగా నైపుణ్యం కలిగిన యువకులను ఎంపిక చేసే విషయంపై దృష్టి పెట్టింది. 
 
అలా ఇండియా -ఎ జట్టుకోసం ఆడిన ధోనీ సెంచరీ సాధించాడు. కెన్యా, జింబాబ్వేలతో ఆడాడు. ధోనీ ప్రతిభను అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుర్తించాడు. ఆపై బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ధోనీ ఆడాడు. అయితే దురదృష్టకరంగా ఆరంభంలోనే అవుట్ అయ్యాడు. అయినప్పటికీ ధోనీ ఆటతీరుపై నమ్మకం వుంచి గంగూలీ వరుసగా ఆఫర్లు ఇచ్చాడు. ఇలా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ అదరగొట్టాడు. ఈ క్రమంలో ఏకంగా 183 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు ధోనీ. 
 
2007 ట్వంటీ-20 ఓవర్ ప్రపంచ కప్‌కు కెప్టెన్‌గా మారాడు. తన కెప్టెన్సీలో ప్రపంచ కప్ సాధించిపెట్టాడు. 2011వ సంవత్సరం ధోనీ కెరీర్‌లోనే కాకుండా భారత చరిత్రలోనే కీలక మలుపు చోటుచేసుకుంది. 1983కి తర్వాత వన్డే ప్రపంచ కప్‌ను ధోనీ సారథ్యంలోని టీమిండియా జట్టు సొంతం చేసుకుంది. ఈ ప్రపంచ కప్ పోటీలు సచిన్ టెండూల్కర్‌కు చివరిదిగానూ మిగిలింది. ఈ ప్రపంచ కప్‌ను ధోనీ సచిన్ కోసమే సాధించిపెట్టాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో ధోనీ 48వ ఓవర్లో సిక్సర్ కొట్టాడు. దీంతో 23 సంవత్సరాలకు తర్వాత భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంది. దీంతో కెప్టెన్లలో ధోనీ కూల్ కెప్టెన్‌గా.. అత్యుత్తుమ సారథిగా నిలిచాడు.
 
ధోనీకి లతా మంగేష్కర్ పాటలంటే చాలా ఇష్టం ఇంకా గిల్ క్రిస్ట్ ఈయనకు నచ్చిన క్రీడాకారుడు. వీడియో గేమ్‌లంటే పడి చస్తాడు. కొత్త బైకులను సేకరించడంలో ఆసక్తి ఎక్కువ. అత్యాధునిక బైకులన్నీ ధోనీ వద్ద వుంటాయి. జార్ఖండ్ ప్రభుత్వానికి చెందిన విద్యా ఆవశ్యకతను తెలియజేసే ప్రకటనలో ధోనీ రూపాయి కూడా తీసుకోకుండా నటించాడు.

తన సతీమణి సాక్షి పేరిట ఓ ఛారిటీని ఏర్పరిచిన ధోనీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల సంతానానికి సహాయసహకారాలు అందిస్తున్నాడు. తన జీవితంలోనూ ఉన్నత స్థాయికి ఎదుగుతూ..  క్రికెట్‌లోనూ పలు రికార్డులను కొల్లగొట్టిన మహేంద్ర సింగ్ ధోనీ భారత ప్రజల మనస్సుల్లో తన కంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు.