శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2019 (21:48 IST)

గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు చర్యలు: నిర్మలా సీతారామన్

ఆర్థిక మందగమనం ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 3.2 శాతంగా చెబుతున్నారని.. ఇది ఇంకా తగ్గే సూచన ఉందన్నారు. భారత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అనేక అంశాలను వివరించారు.
 
గత అయిదేళ్లుగా సంస్కరణలను అమలు చేస్తున్నామని.. సంస్కరణలనేవి నిరంతర ప్రక్రియని చెప్పారు. ఇప్పటికే వాణిజ్యంలో, పన్ను విధానాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు.
 
ఇంకా ఏమేం చెప్పారు?
* జీఎస్టీ మరింత సులభతరం చేస్తాం. దీనిపై ఆగస్టు 25న అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం.
* పన్నుల వసూళ్లలో ఎవరికీ ఇబ్బందులు ఉండవు.
* వాణిజ్య యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపైనా ఉంది ప్రపంచ జీడీపీ 3.2శాతం నుంచి మరింత పతనమవుతోంది. 2014 నుంచి మేం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్‌ సురక్షిత స్థితి ఉంది. 2014 నుంచి సంస్కరణలే అజెండాగా పనిచేస్తున్నాం.
* రెపో రేట్లకు అనుగుణంగానే గృహ, వాహన రుణాలపై భారం తగ్గనుంది.
* మార్కెట్‌లో రూ.5 లక్షల కోట్ల ద్రవ్య లభ్యతకు ఏర్పాట్లు చేస్తున్నాం.
* ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్లు ఆర్థిక సర్దుబాటు చేస్తాం. వడ్డీ రేట్లు తగ్గించేందుకు చర్యలు చేపడతాం. ఆ తగ్గింపు రుణ గ్రహీతలకు చేరేలా చర్యలు తీసుకుంటాం.
* ఎంఎస్‌ఈలను బలోపేతం చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను విచారించాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఆర్థిక అవకతవకలను సహించం.. భారీ జరిమానాలు విధిస్తాం. సీఎస్‌ఆర్‌ ఉల్లంఘనలను క్రిమినల్‌ నేరాలుగా పరిగణించం.
* అక్టోబర్‌ 1 నుంచి కేంద్రీకృత విధానంలో ఆదాయ పన్ను నోటీసులు ఇస్తాం. నోటీసులు అందిన మూడు నెలల్లోనే అన్ని కేసులు పరిష్కారమవుతాయి. డీఎన్‌ఐ లేని నోటీసులకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు.
* దేశీయ, విదేశీ ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులపై బడ్జెట్‌ ముందునాటి విధానం పునరుద్ధరిస్తాం.
* 2020 మార్చి వరకు కొనుగోలు చేసిన బీఎస్-4 రకం వాహనాల జీవిత కాలం ఎంతవరకు ఉందో అంతవరకు తిప్పే అవకాశం ఉంది.
* అన్ని శాఖల్లో పాత వాహనాల స్థానంలో కొత్తవి తీసుకోమని కోరుతాం.
* పాత వాహనాల విషయంలో త్వరలో విధానాన్ని ప్రకటిస్తాం.
 
కాంగ్రెస్ విమర్శలు
ఆర్థిక మంత్రి ప్రసంగం అనంతరం విపక్ష కాంగ్రెస్ విమర్శలు సంధించింది. బ్యాంకులకు రూ.70 వేల కోట్ల రీక్యాపిటలైజేషన్‌పై సందేహాలు లేవనెత్తింది. ఇది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులపై భారం కాదా? గత రీక్యాపిటలైజేషన్ ఎలాంటి ఫలితాలనిచ్చింది..? ద్రవ్య స్థితిని ఇది చక్కదిద్దుతుందా? అంటూ ట్వీటర్ వేదికగా ప్రశ్నలు వేసింది.
 
అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉందని ఆర్థిక మంత్రి చెబుతున్నారు కానీ నోట్లరద్దు, జీఎస్టీ చేసిన నష్టాల గురించి కావాలనే మాట్లాడడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ‘‘జీఎస్టీ అమల్లోకొచ్చిన మూడేళ్ల తరువాత కూడా రాబడిలో ఇంకా భారీ లోటు తప్పడం లేద’ని ట్వీట్ చేశారు.