చంద్రబాబు ఫ్యామిలీకి సెక్యూరిటీ తొలగింపు... ఏపీ సర్కారు నిర్ణయం
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబానికి కల్పిస్తూ వచ్చిన భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ముఖ్యంగా, చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిలకు ఇప్పటివరకు ఉన్న భద్రతను తొలగించింది.
నిజానికి గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి, వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే చంద్రబాబుకు కల్పిస్తూ వచ్చిన భద్రతను కుదించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నారా లోకేశ్‌కు కూడా కల్పిస్తూ వచ్చిన భద్రతను కూడా తగ్గించింది.
ప్రస్తుతం నారా లోకేశ్‌కు 5 ప్లస్ 5 గన్‌మెన్ల భద్రత ఉండగా, దాన్ని 2 ప్లస్ 2కు కుదించింది. అలాగే, నారా బ్రహ్మణి, నారా భువనేశ్వరిలకు కల్పిస్తూ వచ్చిన భద్రతను పూర్తిగా తొలగించింది. ఈ భద్రత తొలగింపుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తోందని ఆరోపిస్తున్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో వైకాపా నేతల భద్రత పట్ల ఏమాత్రం పక్షపాతం చూపలేదనీ, జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు సైతం పూర్తి భద్రతను తల్పించామని టీడీపీ నేతలు అంటున్నారు. కానీ, నవ్యాంధ్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్... చంద్రబాబు ఫ్యామిలీ సభ్యులకు భద్రతను కుదిరించి రాజకీయకక్ష సాధింపునకు దిగిందని ఆరోపిస్తున్నారు.