శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (18:45 IST)

టార్డిగ్రేడ్స్‌: చందమామపై చిక్కుకుపోయిన వేలాది 'మొండి' జీవులు.. 30 ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా బతికేస్తాయి

చంద్రగ్రహం ఇప్పుడు వేలాది 'మొండి' జీవులకు ఆవాసంగా మారే అవకాశం ఉంది. ఎలుగుబంటి ఆకారంలో మిల్లీమీటర్ కంటే తక్కువ పొడవుండే మొండి జీవులు చంద్రుడిపై సజీవంగా ఉన్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఆర్చ్ మిషన్ ఫౌండేషన్ తెలిపింది. ఆ జీవులను టార్డిగ్రేడ్లు అంటారు. వాటర్ బేర్స్ అని కూడా పిలుస్తారు. అవి సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులనూ తట్టుకోగలవు.

 
అంతేకాదు, దశాబ్దాల పాటు ఆహారం లేకున్నా బతికే ఉంటాయి. అందుకే, వీటిని మహా మొండి జీవులంటారు. ఇజ్రాయెల్ పంపిన అంతరిక్ష వాహనం 2019 ఏప్రిల్‌లో చంద్రుని మీద కూలిపోయింది (క్రాష్ ల్యాండ్ అయ్యింది). ఆ వాహనంలో టార్డిగ్రేడ్స్‌ను కూడా పంపించారు. అయితే, వాహనం కూలిపోయినా అందులోని ఆ జీవులు తప్పకుండా సజీవంగానే ఉంటాయని వాటిని పంపిన ఆర్చ్ మిషన్ ఫౌండేషన్ అధినేత నోవా స్పివాక్ చెప్పారు.

 
ఈ సంస్థ మానవ మేధోసంపత్తిని, భూమి మీద ఉండే అరుదైన జీవుల అవశేషాలను సౌరవ్యవస్థలోని వివిధ ప్రదేశాలకు పంపుతుంటుంది. ఈ ఏడాది టార్డిగ్రేడ్స్‌ను చంద్రమండలానికి పంపింది. వాటితో పాటు మానవ చరిత్రకు సంబంధించి మూడు కోట్ల పేజీల సమాచారం నిక్షిప్తమై ఉన్న ఒక డీవీడీని కూడా రోబోటిక్ ల్యాండర్‌ చంద్రుని మీదికి మోసుకెళ్లింది. టార్డిగ్రేడ్స్‌లో నీరు లేకుండా బాగా ఎండబెట్టి (నిర్జలీకరణం చేసి) పంపించారు.

 
శరీరంలో నీరు లేకుండా ఏ జీవులూ ఎక్కువకాలం బతకలేవు. కానీ, టార్డిగ్రేడ్స్ చాలా మొండి జీవులు. వీటిని ఎంతగా ఎండబెట్టినా, నీటి తడి తాకగానే మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తాయి. ఎండబెట్టాక ఇరవై ముప్పై ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా... వెంటనే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 
ఎండిపోయినప్పుడు అవి తలలు, ఎనిమిది కాళ్ళను తొలగించుకుని చిన్న బంతిలాగా మారతాయి. దాదాపు మరణం అంచుల దాకా వెళ్తాయి. శరీరంలోని నీటినంతా త్యజిస్తాయి. జీర్ణక్రియ రేటు మామూలు స్థితితో పోల్చితే 0.01 శాతానికి పడిపోతుంది. ఆ పరిస్థితుల్లోనూ కొన్ని దశాబ్దాలపాటు ప్రాణంతో ఉండగలవు.

 
ఆర్చ్ మిషన్ సంస్థ 2007లోనూ ఈ జీవులను అంతరిక్షంలోకి పంపింది. భూగోళం మీద అత్యంత మొండివిగా పేరున్న టార్డిగ్రేడ్స్‌ను అంతరిక్షంలోకి పంపడం ఉత్తమమని నోవా స్పివాక్ అన్నారు. అయితే, ఇప్పుడు చంద్రుడి మీద ఇవి ప్రాణంతో ఉండగలిగినా, ఆ గ్రహం మీది వాతావరణం కారణంగా వాటి పరిస్థితి గొప్పగా ఏమీ ఉండకపోవచ్చునని ప్లానెటరీ అండ్ స్పేస్ సైన్సెస్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మోనికా గ్రాడీ అన్నారు.

 
"అంతరిక్ష ప్రయోగాలు చేసేవారు వాతావరణ కాలుష్య నియంత్రణకు సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కానీ, ఈ టార్డిగ్రేడ్స్‌ను చంద్రుని మీదకు పంపేందుకు ఆ సంస్థకు అనుమతులు ఉన్నాయని నేను అనుకోవడంలేదు. ఇది మంచి పని కాదు" అని మోనికా చెప్పారు. టార్డిగ్రేడ్లు చంద్రునిపై ఎండిన దశలో సురక్షితంగా దిగినా, నీటి తడి తగిలేంత వరకూ అవి మామూలు స్థితిలోకి అవకాశం లేదు. అయితే, కొన్నాళ్లకు ఆ జీవులను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చి పరీక్షిస్తే, చంద్రమండలంలోని వాతావరణ ప్రభావం వాటి మీద ఎలా ఉందో అధ్యయనం చేసేందుకు వీలుంటుంది.