ఎన్నికల్లో ఓట్లు చీల్చటానికి.. కీలక గుర్తులను పోలిన గుర్తులతో డమ్మీ అభ్యర్థులను పోటీకి పెడుతున్నారా?

election
బిబిసి| Last Modified గురువారం, 12 నవంబరు 2020 (13:50 IST)
2019 లోక్‌సభ ఎన్నికలు... తెలంగాణలోని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం. పోటీ హోరాహోరీగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డికి 5,32,795 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్‌ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్‌కు 5,27,576 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నాలుగు వేల ఓట్లు దాటారు. మిగతా స్వతంత్ర అభ్యర్థులంతా రెండు వేల ఓట్లూ దాటలేదు. అసలు బలమైన స్వతంత్ర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేరు.

కానీ, ఒక స్వతంత్ర అభ్యర్థికి మాత్రం ఏకంగా 27,973 ఓట్లు వచ్చాయి. ఆయన పేరు పెద్దగా ప్రచారంలో లేదు. కానీ ఆయన గుర్తు రోడ్డు రోలర్. అది టీఆర్ఎస్‌ గుర్తు కారును పోలి ఉంటుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ 5,219 ఓట్ల తేడాతో ఓడిపోయింది. దాదాపు సీపీఐకి వచ్చిన ఓట్లతో సమానంగా ఆ రోడ్డు రోలర్ గుర్తుకు ఓట్లు పడ్డాయి.


2014లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసన సభ ఎన్నికలు ఓకేసారి జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని పాలకొల్లు అసెంబ్లీ స్థానంలో టీడీపీ రెబల్ అభ్యర్థి సత్యనారాయణ మూర్తికి ఆటో గుర్తు వచ్చింది. ఆయనకు ఆ ఎన్నికల్లో 38,420 ఓట్లు వచ్చాయి. ఆయన మూడో స్థానంలో ఉన్నారు.

టీడీపీ 51,523 ఓట్లతో ఆ ఎన్నికల్లో గెలిచింది. అదే ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ పడ్డ వారిలో ప్రేమ్ జనతాదళ్ పార్టీ తరపున పోటీ చేసిన గీతాదాస్ అనే మహిళకు పాలకొల్లు చుట్టపక్కల నియోజకవర్గాల్లో 700, 800 ఓట్లు వస్తే ఒక్క పాలకొల్లులో 12,029 ఓట్లు వచ్చాయి. ఆమెదీ ఆటో గుర్తే. కానీ ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థి ఆటో గుర్తు బదులూ, పార్లమెంటు అభ్యర్థి ఆటో గుర్తుకు చాలా మంది ఓటు వేశారు. అయితే ఆమెకు వచ్చిన ఓట్లూ, టీడీపీ రెబల్ ఆటో గుర్తుకు వచ్చిన ఓట్లూ కలిపితే సత్యనారాయణ మూర్తి గెలవకపోయినా కేవలం వెయ్యి ఓట్ల తేడాతో రెండో స్థానంలో ఉండేవారు. కానీ ఆయన 13 వేల తేడాతో మూడో స్థానానికి పడిపోయారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నికల గుర్తుల్లో ఉండే చిన్న చిన్న సమస్యలు నాయకులు, పార్టీల భవిష్యత్తును తలకిందులు చేసేస్తున్నాయి. తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో కూడా చపాతీ మేకర్ గుర్తుకు 3,570 ఓట్లు వచ్చాయి. బండారు నాగరాజు అనే అభ్యర్థికి అన్ని ఓట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదని స్థానికలు చెబుతున్నారు. ఈ చపాతి మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉందనేది కొందరి వాదన. ఈ స్వతంత్ర్య అభ్యర్థికి పడ్డ ఓట్లు, టీఆర్ఎస్‌ - బీజేపీల మధ్య తేడా కంటే మూడు రెట్లు ఎక్కువ.

''దురదృష్టకరమైన విషయం ఏంటంటే, గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజాభిప్రాయం కాకుండా, పోలికలు ఉన్న గుర్తులు నిర్ణయాక శక్తిగా మారాయి. మన దేశంలో చాలా మంది చదువుకోని వారు, వృద్ధులు, చూపు సమస్య ఉన్న వారు ఉంటారు. వారికి అభ్యర్థుల పేర్ల కంటే గుర్తులే ముఖ్యం. వారు గుర్తును బట్టే ఓటేస్తారు. దీంతో దగ్గరి పోలికలు ఉన్న గుర్తుల వల్ల ఓడిపోవాల్సి వస్తుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎవరో తెలియని వ్యక్తికి భువనగిరిలో 27 వేల ఓట్లు వచ్చాయి. నేను 5,200 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అంతకుముందు 2014లో కూడా ఈ సమస్య వచ్చింది. అప్పుడు ఆటో గుర్తుకు ఏకంగా 40 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆ ఆటో గుర్తు అభ్యర్థి ఎవరో కూడా జనాలకు తెలియదు. కారు ఓట్లు అటు పడ్డాయి. నా మెజార్టీ 30 వేలకు పడిపోయింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా తీసుకోవాలి'' అని అన్నారు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య.

''సాధారణంగా చదువుకున్న వారే మన ఈవీఎంల దగ్గర తికమక పడతారు. పైగా ఈవీఎంలో ఫోటోలూ గుర్తులూ చిన్నగా ఉంటాయి. అక్కడ వెలుతురు సరిగా ఉండదు. ఫోటోలు స్పష్టంగా కనిపించవు. స్వయంగా ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో తప్పులు చేస్తుంటారు. ఇక చదువుకోని సామాన్యుల పరిస్థితి ఏంటి?'' అని అన్నారు నర్సయ్య. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య కొత్తది కాదు. కొన్నిసార్లు పొరపాటున జరిగితే, కొన్నిసార్లు ప్రత్యర్థులు కావాలని ఏరికోరి ఇలాంటివి చేస్తారు.

గత ఎన్నికల్లో కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ ఆంధ్రలో హెలికాప్టర్ గుర్తుపై పోటీ చేయడం వెనుక వైఎస్సార్సీపీని దెబ్బ తీసే వ్యూహం ఉందని ఆ పార్టీ ఆరోపించింది. కానీ ఫలితాల్లో ఆ ప్రభావం కనిపించలేదు. ఆ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో హెలికాప్టర్ గుర్తు కేటాయించవద్దు అంటూ వైఎస్సార్సీపీ కలెక్టరుకు ఫిర్యాదు చేసింది కూడా. 2018 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి ట్రక్కు గుర్తే కారణమని ఆరోపించారు మాజీ మంత్రి, టీఆర్ఎస్‌ నాయకులు మహేందర్ రెడ్డి. తనకూ విజేతకూ మధ్య ఓట్ల తేడా కంటే, ట్రక్కు గుర్తుకు ఎక్కువ వచ్చాయన్నది ఆయన ఆరోపణ.

ఇదే తరహా సమస్య ప్రజారాజ్యం పార్టీ రైలింజను గుర్తుకు వచ్చింది. దీంతో 2009 ఎన్నికల తరువాత పీఆర్పీ నాయకులు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించి ఉదయించే సూర్యుడు గుర్తు తెచ్చుకున్నారు. ఇక పార్టీల గుర్తులు ఉండని పంచాయతీ ఎన్నికల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ''గతంలో విజయవాడలో ఒక ఎన్నిక జరిగితే స్కూటర్ గుర్తు అభ్యర్థికి ఎవరూ ఊహించనన్ని ఓట్లు వచ్చాయి. అవి టీడీపీకి పడాల్సిన ఓట్లు. అది ఫలితాన్ని ప్రభావితం చేయలేదు. కానీ, మన దేశంలో అక్షరాస్యత తక్కువ ఉన్న నేపథ్యంలో ఇటువంటి సమస్య తీవ్రంగా ఉంటుంది. దీన్ని అధిగమించడం అంత తేలిక కాదు'' అని వ్యాఖ్యానించారు సీనియర్ పాత్రికేయులు డానీ.

బల్బు - బంతి, సైకిల్ - స్కూటర్, ట్రాక్టర్ - లారీ... ఈ గుర్తులన్నీ చూడటానికి ఒకలానే ఉంటాయి అని గుర్తు చేశారాయన. గుర్తులే కాదు కొన్ని సందర్భాల్లో పేర్ల ద్వారా కూడా గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తారు కొందరు. తమ ప్రత్యర్థి పేరు, కుదిరితే ఇంటి పేరు ఉన్న వ్యక్తులను తీసుకువచ్చిన ఆ ఎన్నికల్లో నామినేషన్ వేయిస్తారు కొందరు. దీంతో ఓటు వేసే వారు తికమక పడతారని వారి ఆశ.

''దీనికి ఒకటే పరిష్కారం. తమ గుర్తును పోలిన గుర్తులు ఏమున్నాయో ముందే చూసి, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల అధికారిని అభ్యర్థించాలి. వాటిని ఎవరికీ కేటాయించవద్దని చెప్పాలి. ముందుగానే స్పందిస్తే మంచిది. కానీ చాలా మంది గుర్తులు కేటాయింపు జరిగిపోయాక వచ్చి గొడవ చేస్తారు. దానివల్ల ప్రయోజనం ఉండదు. పోలికలున్న గుర్తులను కేటాయించవద్దన్న వినతిని ఎన్నికల అధికారులు తీసుకుంటారు. ఇదొక్కటే దీనికి మందు. కానీ చాలా మందికి ఆ అవగాహన ఉండదు'' అని అన్నారు ప్రస్తుతం తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తూ, ఎన్నో ఎన్నికలకు రిటర్నింగు ఆఫీసరుగా పనిచేసిన ఒక అధికారి.

గుర్తులు ఎలా ఇస్తారు?
ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీకి శాశ్వత గుర్తు ఇస్తారు. ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీకి మాత్రం ఆయా ఎన్నికల్లో వీలును బట్టి ఉమ్మడి గుర్తు కేటాయిస్తారు. ఒకసారి గుర్తింపు వచ్చాక, ఆ గుర్తును శాశ్వతం చేసుకోవచ్చు. అయితే ఒకప్పుడు పార్టీలు కోరిన గుర్తును ఎన్నికల సంఘం ఇచ్చేది. కానీ తరువాత ఎన్నికల సంఘం తన పద్ధతి మార్చుకుంది. తమ దగ్గర అందుబాటులో ఉన్న గుర్తుల్లో నుంచి ఒక దాన్ని పార్టీలు ఎంపిక చేసుకోవాలని నిబంధన విధించింది. ఇందుకోసం పార్టీలు మూడు ఆప్షన్లు ఇవ్వాలి. ఆ క్రమంలోనే వైఎస్సార్సీపీ, జనసేన వంటి పార్టీలకు ముందే నిర్ణయించిన గుర్తులు వచ్చాయి.

ఎన్నికల సంఘం దగ్గర ప్రస్తుతం 200 వరకూ ఫ్రీ సింబల్స్ ఉంటాయి. ఇందులో సామాన్యులకు అర్థం కాని సీసీ కెమెరాలు, పెన్ డ్రైవుల వంటి గుర్తులు కూడా ఉన్నాయి. గుర్తుల విషయంలో గందరగోళం అంశంపై ఎన్నికల సంఘం ప్రతినిధులు స్పందించాల్సి ఉంది.

దీనిపై మరింత చదవండి :