శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (22:38 IST)

బీహార్ థ్రిల్లింగ్ : ఎన్డీయే కూటమిదే గెలుపు.. కానీ అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ...

బీహార్ రాష్ట్ర శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. రాత్రి 10.30 గంటలకు వెల్లడైన ఫలితాల మేరకు ఎన్డీయే కూటమి 123 స్థానాలతో అతిపెద్ద కూటమిగా అవతరించింది. ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవరమైన సాధారణ మెజార్టీ కంటే ఒక్క స్థానం అధికంగా చేజిక్కించుకుంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 122 సీట్లు కావాల్సివుంది. 
 
ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమి 108 స్థానాలు కైవసం చేసుకుని, మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 7 స్థానాలు గెలుచుకోగా, ఎల్‌జేపీ ఒక్క స్థానంలో కూడా సత్తా చాటలేకపోయింది. 
 
అయితే, కూటమి పరంగా ఎన్డీయే అధిక సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ అతిపెద్ద పార్టీగా మాత్రం బీజేపీ అవతరించలేక పోయింది. ఆ పార్టీ 72 స్థానాలకే పరిమితం కాగా, ఆర్జేడీ మాత్రం 77 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇకపోతే, జేడీయు 43, కాంగ్రెస్ 11, ఎన్డీయే కూటమిలోని ఇతర మిత్రపక్షాలు 8 చోట్ల విజయం సాధించారు. అలాగే, సీపీఐ 11 చోట్ల, ఎంజీబీలోని ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపొందారు.
 
ఇదిలావుంటే, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, 17 స్థానాల్లో నెగ్గిన బీజేపీ మరో 2 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో నెగ్గి, 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఉన్న గండం తప్పిపోయినట్టే. 
 
ఇదిలావుంటే, గుజరాత్, బెంగుళూరు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. అయితే, తెలంగాణాలో మాత్రం అధికార తెరాస చతికిలపడింది. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన సమీప అభ్యర్థి తెరాసకు చెందిన సోలిపేట సుజాతపై విజయం సాధించి చరిత్ర సృష్టించారు.