మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (17:50 IST)

ఆర్జేడీ... ఉదయం జోరు.. సాయంత్రానికి బేజారు :: కాషాయానికి జై కొట్టిన బిహారీలు

బీహార్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభ సమయంలో ఆర్జేడీ పూర్తి ఆధిక్యాన్ని చూపింది. కానీ, సాయంత్రానికి ఆ పార్టీ పూర్తిగా బేజారైపోయింది. అదేసమయంలో కమలం పార్టీ (బీజేపీ) అనూహ్యంగా పుంజుకుంది. ఫలితంగా జేడీయు, ఆర్జేడీలను వెనక్కి నెట్టేసి రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
నిజానికి ఈ అసెంబ్లీ ఎన్నికలను ఆర్జేడీ యువ నేత తేజస్వి ప్రసాద్ యాదవ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం కూడా ప్రభంజనంలా సాగించారు. ఫలితంగానే ఉదయం జోరు కనబర్చిన ఆర్జేడీ ఓట్ల లెక్కింపు కొనసాగే కొద్దీ స్వల్ప తేడాతో వెనుకబడింది.
 
సాయంత్రం 5.30 గంటల వరకు వెల్లడైన ట్రెండ్స్ గమనిస్తే, మొత్తం 243 సీట్లకుగాను ఎన్డీయే కూటమి 125 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే, మహా‌గట్‌బంధన్ 107 స్థానాల్లో, ఇతరులు 11 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. పైపెచ్చు.. నితీశ్ కుమార్‌తో విభేదించి సొంతంగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి, లోక్‌జనశక్తి అధినేత దివంగత రాం విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయారు. 
 
ఎన్డీయే ఆధిక్యంలో ఉన్న 125 స్థానాల్లో బీజేపీ ఒక్కటే 74 చోట్ల, జేడీయు 43, ఇతరులు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే, మహా‌గట్‌బంధన్ కూటమిలో ఆర్డేజీ 68 సీట్లు, కాంగ్రెస్ 21, సీపీఐ ఎంఎల్ 11, ఇతరులు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది.
 
ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ట్రెండ్స్ గమనిస్తే ఆర్జేడీ హవా ఖాయమనిపించింది. కొన్నిరౌండ్లలో ఆ పార్టీ ఆధిక్యం 130 స్థానాలకు వరకు ఎగబాకింది. అయితే, ఎన్డీయే కూటమి పార్టీలు ఆ తర్వాత పుంజుకోవడంతో ఆర్జేడీ ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది.
 
అటు గుజరాత్ రాష్ట్రంలో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 3 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, మిగిలిన 5 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉంది.
 
ఇకపోతే, కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ హవా సాగించింది. రెండింటికి రెండు స్థానాలను చేజిక్కించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోస్థానంలో సమాజ్ వాదీ పార్టీ పైచేయి సాధించింది.  
 
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక జరిగిన దుబ్బాక అసెంబ్లీ స్థానం బీజేపీ ఖాతాలోకి చేరింది. ఇక్కడ అధికార తెరాసను బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓడించి చరిత్ర సృష్టించారు. రఘునందన్ రెండుసార్లు ఓడిపోగా, మూడోసారి ఎట్టకేలకు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.