శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 4 నవంబరు 2024 (13:09 IST)

ఇరాన్ యూనివర్సిటీలో ఏం జరిగింది? ఓ యువతి అర్ధనగ్నంగా ఎందుకు కనిపించారు?

girl agitation in Iran
ఇరాన్‌లోని ఒక యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ యువతి ఒంటిపై లోదుస్తులతో కనిపించారు. శనివారం (నవంబరు 2)న ఈ ఘటన జరిగింది. తర్వాత ఆ యువతిని అరెస్టు చేశారు. ఈ వీడియోపై చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంపై అనేక కథనాలు వస్తున్నాయి. ఘటన జరిగిన ప్రాంతాన్ని బీబీసీ పర్షియా డిజిటల్ టీమ్ ధ్రువీకరించింది. తెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ‌ సైన్స్, రీసర్చ్ బ్లాక్-1 దగ్గర ఆమె అలా కనిపించారు.
 
వీడియోలో ఏముంది?
లోదుస్తులు మాత్రమే ధరించిన ఒక అమ్మాయి యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఒక గోడపై కూర్చుని ఉన్నారు. సెక్యూరిటీ గార్డులు ఆమెతో మాట్లాడుతున్నారు. అయితే వీడియోలో వారి సంభాషణ వినిపించడం లేదు. దూరంగా ఉన్న క్లాస్‌రూమ్ విండో నుంచి బహుశా ఈ వీడియోని తీసిఉండొచ్చు. మరో వీడియోలో యువతి బ్లాక్-1 దగ్గర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె తన దుస్తులను తొలగిస్తున్నట్టు కదలికలను బట్టి అర్థమవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న వారి రియాక్షన్ చూస్తే కూడా ఇది అర్థమవుతుంది. కాసేపటికే, చాలామంది పోలీసు అధికారులు ఉన్న కారు అక్కడకు చేరుకుంది. వారు కారు దిగి, యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించినట్టు కనిపిస్తోంది.
 
సోషల్ మీడియాలో అనేక అభిప్రాయాలు
ఇరాన్ వెలుపల అనేక మీడియాల్లోనూ, సోషల్ మీడియా నెట్‌వర్క్స్‌లోనూ ప్రచురించిన, పోస్టు చేసిన కథనాలు... ఈ ఘటనను యువతి నిరసన తెలిపిన విధానంగా అభివర్ణించాయి. హిజాబ్ కచ్చితంగా ధరించాలనడాన్ని, యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారుల ప్రవర్తనను వ్యతిరేకిస్తూ యువతి ఈ రూపంలో నిరసన తెలిపారని అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన అనేక కథనాలు 'అమీర్ కబీర్ న్యూస్‌లెటర్' టెలిగ్రామ్ ఛానెల్‌లో కనిపించాయి. ముఖానికి ముసుగు ధరించలేదని యువతిని వేధించారని, సెక్యూరిటీ సిబ్బంది ఆమె దుస్తులను చింపివేశారని, దీంతో ఆ యువతి తన దుస్తులన్నీ విప్పి నిరసన తెలిపారని 'అమీర్ కబీర్ న్యూస్' తెలిపింది. విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా తాము కథనం ప్రచురించామని అమీర్ కబీర్ న్యూస్ పేపర్ బీబీసీ పర్షియన్‌కు తెలిపింది.
 
ప్రత్యక్ష సాక్షి బీబీసీకి ఏం చెప్పారు?
ప్రత్యక్షసాక్ష్యులైన ఇద్దరు వ్యక్తులు ఈ సంఘటన గురించి బీబీసీ పర్షియన్‌కు వివరించారు. ‘‘చేతిలో మొబైల్ ఫోన్‌తో ఆ యువతి చాలా క్లాస్‌రూమ్‌లకోకి వచ్చి వీడియోలు తీస్తూ కనిపించారు’’ అని ఆయన చెప్పారు. అనుమతి లేకుండా క్లాస్‌రూమ్‌లోకి రావడంపై ప్రొఫెసర్లలో ఒకరు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని ఆమె వెంట ఓ విద్యార్థిని పంపించారు. ఆ యువతి అరవడం మొదలుపెట్టారని, పెద్ద పెద్దగా గొడవ చేశారని ప్రత్యక్షసాక్షి చెప్పారు. గోడ దగ్గరకు వెళ్లగానే యువతి దుస్తులు విప్పేశారని ప్రత్యక్షసాక్షి బీబీసీకి చెప్పారు.
 
అక్కడ యువతికి, సెక్యూరిటీ గార్డులకు మధ్య ఎలాంటి గొడవ జరగలేదని ఇద్దరు ప్రత్యక్షసాక్షులు అన్నారు. అయితే వారిద్దరూ యువతి క్లాస్‌రూమ్‌లోకి అకస్మాత్తుగా వచ్చిన తర్వాత ఏం జరిగిందో మాత్రమే చూశారు. యువతి క్లాస్‌రూమ్‌లోకి రావడానికి ముందు ఏం జరిగిందో తనకు తెలియదని ప్రత్యక్షసాక్షి చెప్పారు. యువతి దుస్తులు తొలగించిన తర్వాత ప్రత్యక్షసాక్షులు సంఘటనాస్థలానికి వెళ్లారు. క్లాస్‌రూమ్‌లోపల యువతి ‘‘నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను’’ అని విద్యార్థులతో అన్నట్టు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ‘‘నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను’’ అని యువతి చెప్పారని యూనివర్సిటీ విద్యార్థి ఒకరు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.
 
యూనివర్సిటీ, మీడియా స్పందనేంటి?
ఆమె యూనివర్సిటీ విద్యార్థిని అని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అమీర్ మహ్జూబ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే యువతికి, భద్రతా సిబ్బందికి మధ్య ఎలాంటి వాదనా జరగలేదని ఆయనన్నారు. ‘‘మానసిక స్థితి సరిగ్గా లేని యువతి తన సహవిద్యార్థులు, ఉపాధ్యాయుల వీడియోలు తీయడం ప్రారంభించారు. దీంతో ఆ యువతిని వారు మందలించారు. విద్యార్థులు, భద్రతా సిబ్బంది హెచ్చరించడంతో ఆమె క్యాంపస్‌లోకి పరుగెత్తి.. ఇదంతా చేశారు’’ అని అమీర్ మహ్జూబ్ చెప్పారు. తమను వీడియో తీయడంపై విద్యార్థులు ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారని, దానికి ప్రతిస్పందనగా ఆ యువతి దుస్తులు తీసేశారని ఐఎస్‌ఎన్‌ఏ సహా ఇరాన్ మీడియా తెలిపింది. తీవ్ర మానసిక ఒత్తిడి, మానసిక అనారోగ్యంతో యువతి ఇబ్బందిపడుతున్నారని, ఆమెను మెడికల్ సెంటర్‌కు పంపామని యూనివర్సిటీ అధికారులు చెప్పారు.
 
యువతిని వెంటనే విడుదల చేయాలని అంతర్జాతీయంగా డిమాండ్
యువతిని అరెస్టు చేయడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పందించింది. ‘‘నవంబరు 2న బలవంతంగా అరెస్టు చేసిన విద్యార్థినిని ఇరాన్ అధికారులు బేషరతుగా, తక్షణమే విడుదల చేయాలి. ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ భద్రతా అధికారులు హిజాబ్ ధరించాలని బలవంతం చేస్తూ ఆమెను దూషించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆ యువతి దుస్తులు తొలగించి నిరసన వ్యక్తం చేశారు’’ అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ‘ఎక్స్‌’లో పేర్కొంది.
 
‘‘ఆ యువతిని హింసించడాన్ని, ఆమెతో దురుసుగా ప్రవర్తించడాన్ని అధికారులు అడ్డుకోవాలి. ఆమె కుటుంబ సభ్యులకు లాయర్‌తో మాట్లాడే అవకాశం కల్పించాలి. యువతిని కొట్టారని, లైంగికంగా హింసించారని వచ్చిన ఆరోపణలపై స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి’’ అని అమ్నెస్టీ ఇరాన్ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసింది. ఈ సంఘటనను, ఆ తర్వాత అధికారుల స్పందనను తాను దగ్గర నుంచి గమనిస్తున్నానని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ ప్రత్యేక రాయబారిగా ఆగస్టు నుంచి ఇరాన్‌లో పనిచేస్తున్న మై సాటో ‘ఎక్స్‌’లో తెలిపారు.
 
హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు?
ఈ సంఘటనపై వస్తున్న రకరకాల సమాచారంలో ఏది నిజమో తెలియనప్పటికీ ఉన్న సమాచారం ఆధారంగా చాలా మంది యూజర్లు ఆ యువతి గురించి మాట్లాడుతున్నారు. హిజాబ్‌ను తప్పనిసరిగా ధరించాలనడాన్ని, తనపై యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది దురుసు ప్రవర్తనను వ్యతిరేకిస్తూ.. యువతి అలా చేశారని చాలా మంది యూజర్లు అభిప్రాయపడుతున్నారు. మరియం కియానార్తి అనే లాయర్‌ కూడా ఈ అభిప్రాయమే వ్యక్తంచేశారు. మానవతాదృక్పథంతో ఆ యువతి చేసిన తిరుగుబాటు హిజాబ్ ధరించాలని విద్యార్థినిలపై పెరుగుతున్న తీవ్ర ఒత్తిడికి సంకేతమని విశ్లేషించారు.
 
ఈ కేసులో న్యాయపోరాటం చేయడానికి, డబ్బులు తీసుకోకుండా యువతి తరఫున వాదించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హిజాబ్ ధరించాలని ఒత్తిడి చేయడాన్ని, సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తనను వ్యతిరేకిస్తూ యువతి దుస్తులు తొలగించారని నమ్ముతున్న యూజర్లు ఆమె చేసిన పనిని సాహసోపేతమైనదిగా అభివర్ణిస్తున్నారు. భయాందోళన, ఒత్తిడితోనే ఆ యువతి ఇలా చేశారని, అది స్వచ్ఛందంగా చేసిన నిరసన కాదని ఇంకొందరు ఆరోపిస్తున్నారు.
 
‘‘మహిళ, జీవితం, స్వేచ్ఛ’’ అనే ఉద్యమాన్ని వ్యతిరేకించేవారు, ఇరాన్ ప్రభుత్వ విధానాలను సమర్థించేవారు అనేకమంది దీనిపై స్పందించారు. ‘‘ఈ ఉద్యమంలో నిరసనకారులు నగ్నంగా కనిపించడానికి సిద్ధంగా ఉన్నారని మేం చేస్తున్న వాదనకు యువతి చర్యే నిదర్శనం’’ అని ఇరాన్ ప్రభుత్వ అనుకూలురు ఆరోపిస్తున్నారు. ఆ యువతి ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, మరింత సమాచారం తెలుసుకుని, సోషల్ మీడియాలో ఆమెకు మద్దతిస్తామని చాలా మంది యూజర్లు చెబుతున్నారు. ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేసేవారి వివరాలు తెలియకపోవడం వల్ల చివరకు నిశ్శబ్దం మిగిలిపోతుందని, అంతిమంగా దాని వల్ల సమాజానికి హాని కలుగుతుందని కొందరు యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.